పామాయిల్‌ పంటకు వడగండ్లు, కరువుతో నష్టం లేదు

ABN , First Publish Date - 2023-10-01T00:34:57+05:30 IST

నంగునూరు మండలం నర్మెట గ్రామంలో శనివారం ఆయిల్‌పామ్‌ కర్మాగార పనులకు మంత్రి హరీశ్‌రావు భూమిపూజ చేశారు.

పామాయిల్‌ పంటకు వడగండ్లు, కరువుతో నష్టం లేదు
నంగునూరు మండలం నర్మెటలో ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ పనులకు భూమిపూజ చేస్తున్న మంత్రి హరీశ్‌రావు

ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ భూమిపూజలో మంత్రి హరీశ్‌రావు

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట/నంగునూరు : ‘అకాల వర్షాలు కురిసినా, వడగండ్లు పడినా ఆయిల్‌ పామ్‌ తోటలకు ఎలాంటి నష్టం ఉండదు. అడవి పందులు, కోతులతోనూ ఇబ్బంది లేదు. పామాయిల్‌ అంటేనే మొండి పంట. ఈ పంట వేసే దిశగా ప్రతీ రైతు ఆలోచించాలి. నెలవారీ ఆదాయం పొందే ఏకైక పంట ఇది’ అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు దిశానిర్దేశం చేశారు. నంగునూరు మండలం నర్మెట గ్రామంలో శనివారం ఆయిల్‌పామ్‌ కర్మాగార పనులకు ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సముద్రాలు, నదులు ఉన్న ప్రాంతాల్లో తేమ ఎక్కువగా ఉన్నందున పామాయిల్‌ తోటలకు అనుకూల వాతావరణం ఉంటుందని చెప్పారు. అందుకే ఆంధ్రప్రదేశ్‌, ఖమ్మం వంటి ప్రాంతాల్లో ఈ తోటలు ఎక్కువగా కనిపిస్తాయని వివరించారు. అయితే కేసీఆర్‌ ముందుచూపుతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల జిల్లాలో మల్లన్నసాగర్‌, రంగనాయకసాగర్‌, కొండపోచమ్మసాగర్‌ రిజర్వాయర్లతో జల వనరులు పెరిగాయని తెలిపారు. మిషన్‌కాకతీయ ద్వారా చెరువులు, చెక్‌డ్యాములు కళకళలాడుతున్నాయని గురుచేశారు. నీటి సౌలభ్యం పెరగడంతో సిద్దిపేట జిల్లాలో తేమశాతం పెరిగిందని, ఫలితంగా ఆయిల్‌పామ్‌ సాగుకు అనుకూలంగా మారిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఎకరాకు ప్రతీ ఏటా లక్షన్నరకుపైగా ఆదాయం వస్తుందన్నారు. రైతులకు తగిన మెలకువలు నేర్పే విధంగా ఉద్యానవన శాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నర్మెటలో ఏడాదిలోగా ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీని నిర్మించనున్నామని, ఇకపై ఇక్కడి నుంచే నూనె ప్యాకెట్లను సరఫరా చేయనున్నారని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆయిల్‌ఫెడ్‌ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతాపరెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, ఉద్యానవన శాఖ కమిషనర్‌ హనుమంతరావు, కలెక్టర్‌ ప్రశాంత్‌పాటిల్‌, ఆయిల్‌ఫెడ్‌ ఉపాధ్యక్షుడు ఎడ్ల సోమిరెడ్డి, నాయకులు జాప శ్రీకాంత్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి, సర్పంచ్‌ అజీద్‌, ఎంపీటీసీ బాబు, మార్కెట్‌, పీఏసీఎ్‌సల చైర్మన్లు రాగుల సారయ్య, మహిపాల్‌రెడ్డి, కోల రమేశ్‌గౌడ్‌ వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2023-10-01T00:34:57+05:30 IST