మా ఓటు మీకే
ABN , First Publish Date - 2023-09-04T00:11:16+05:30 IST
ఇంకా ఎన్నికల షెడ్యూల్ విడుదల కానేకాలేదు. ఎన్నికలెప్పుడు జరుగుతాయో స్పష్టత లేనేలేదు. బరిలో ఉండే అభ్యర్థులెవరో తేలనేలేదు. ప్రచారం మొదలుపెట్టనే లేదు. కానీ సిద్దిపేట జిల్లాలో ఎన్నికల వాతావరణం ఊపందుకున్నది.
ఏకగ్రీవాలతో మద్దతు ప్రకటిస్తున్న వైనం
గ్రామాలు, సంఘాలు, కులాలవారీగా తీర్మానాలు
సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో ప్రారంభం
షెడ్యూల్‌కు ముందే రాజకీయ సందడి
జిల్లాలో మొదలైన ఎన్నికల కోలాహలం
ఆంధ్రజ్యోతిప్రతినిధి, సిద్దిపేట, సెప్టెంబరు3: ఇంకా ఎన్నికల షెడ్యూల్ విడుదల కానేకాలేదు. ఎన్నికలెప్పుడు జరుగుతాయో స్పష్టత లేనేలేదు. బరిలో ఉండే అభ్యర్థులెవరో తేలనేలేదు. ప్రచారం మొదలుపెట్టనే లేదు. కానీ సిద్దిపేట జిల్లాలో ఎన్నికల వాతావరణం ఊపందుకున్నది. ఎక్కడికక్కడ రాజకీయ సందడి నెలకొన్నది. రేపోమాపో ఎన్నికలు జరుగబోతున్నాయా అనేలా పరిస్థితులు ప్రతిబింబిస్తున్నాయి. సాధారణంగా ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి పార్టీలకు మద్దతు లభిస్తుంటుంది. కానీ ఎన్నికల ప్రక్రియ తెరమీదకు రాకముందే జిల్లాలో ఏకగ్రీవ తీర్మానాల హడావిడి ప్రారంభమైంది.
జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, దుబ్బాకలో బీజేపీ ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. జిల్లాలోని నాలుగు మండలాలతో సంబంధం ఉన్న జనగామ నియోజకవర్గం కూడా బీఆర్‌ఎస్ చేతుల్లోనే ఉంది. అన్నింటికి మించి ముఖ్యమంత్రి కేసీఆర్, కీలక మంత్రి హరీశ్‌రావు ఇదే జిల్లా నుంచి ఉన్నారు. దీంతో జిల్లాలోని రాజకీయాలకు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నది. అదేస్థాయిలో ఇతర జిల్లాలకు భిన్నం గా ఇక్కడ రాజకీయ పరిణామాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి.
తెరమీదకు ఏకగ్రీవ తీర్మానాలు..
ప్రస్తుతం జిల్లాలో ఏకగ్రీవ తీర్మానాల ట్రెండ్ కొనసాగుతున్నది. గత ఎన్నికల్లోనూ ఇదే విధంగా గ్రామాల్లో ఏకగ్రీవ తీర్మానాలు పెద్ద సంఖ్యలో చేపట్టారు. గ్రామాలు, కులాలు, సంఘాల వారీగా ఎన్నికలకు ముందే తమ మద్దతు ప్రకటించారు. ఈసారి ముందుగానే ఈ తీర్మానాలకు శ్రీకారం చుట్టారు. సిద్దిపేట రూరల్ మండలం రాంపూర్ గ్రామస్థులంతా తమ ఓట్లు సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి హరీశ్‌రావుకే వేస్తామని ఏకంగా తీర్మానం చేశారు. అదే విధంగా గుర్రాలగొంది, హనుమంతుపల్లి, చిన్నగుండవెల్లి గ్రామాల్లోని ముదిరాజ్ కుల సంఘాలు, రావురూకుల గ్రామంలోని కురుమ సంఘం, తోర్నాలలోని మున్నూరు కాపు సంఘం, రజక సంఘం, మల్యాలలోని గౌడ సంఘం, సిద్దిపేట లోని శంకర్‌నగర్ ఆర్యవైశ్య సమాజం తీర్మానాలు తయారుచేసి స్వచ్ఛందంగా మంత్రికి అందజేశారు. మంత్రి హరీశ్‌రావు ఎన్నికల ఖర్చు కోసం సిద్దిపేట హరిహర రెసిడెన్సీ వాస్తవ్యులు రూ.5,116 ఇచ్చారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్‌కే తమ ఓటు అని గజ్వేల్ ఆరె కటిక సంఘం, గౌడ సంఘం ప్రతినిధులు తీర్మానం చేసి మంత్రికి అందజేశారు.
ఎన్నికల కోలాహలం
బీఆర్‌ఎస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించడంతో ఎన్నికల కోలాహలం మొదలైంది. అయితే ఎన్నికలను నిర్వహించే తేదీలు ప్రకటించనప్పటికీ రాజకీయ సమీకరణాలు క్రమంగా మారుతున్నాయి. పార్టీల్లో చేరికలపై దృష్టి పెట్టారు. తెలంగాణ ఉద్యమ ఆవిర్భావం నుంచి ఈ ప్రాంతం బీఆర్‌ఎస్ పార్టీకి కంచుకోటగా ఉండడంతో ఈసారి కూడా అదే ట్రెండ్‌ను కొనసాగించాలని భావిస్తున్నారు. దుబ్బాక ఉపఎన్నికలో ఓటమిని మినహాయిస్తే దాదాపు అన్ని ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్ హవా కొనసాగుతూ వచ్చింది. గత ఎన్నికల్లో సిద్దిపేట నుంచి 1,18,699 ఓట్ల రికార్డు మెజార్టీతో హరీశ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ దఫా 1.50లక్షల మెజార్టీ రావాలని స్థానిక బీఆర్‌ఎస్ నేతలు టార్గెట్ పెట్టుకుని ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. 2018 ఎన్నికల్లో దుబ్బాక, హుస్నాబాద్, గజ్వేల్ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులకు 50వేలకు పైగానే మెజార్టీ వచ్చింది. ఈసారి రికార్డులు తిరగరాయడానికి ప్రయత్నాలు ప్రారంభించి ప్రజల్లోకి వెళ్లడంతో ముందస్తుగానే హడావిడి కనిపిస్తున్నది. దీనికి తోడు కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ప్రకటించకపోవడం కూడా బీఆర్‌ఎస్ నేతలు సానుకూలంగా మార్చుకుంటున్నారు.
పథకాలపై ప్రచారం
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలపై బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు ప్రచారం ఆరంభించారు. ప్రతీ సమావేశంలోనూ పథకాల గురించి విస్తృతంగా మాట్లాడుతున్నారు. రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, గృహలక్ష్మి, దళితబంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు, గొర్రెల పంపిణీ తదితర పథకాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పింఛన్లు రానివారిని గుర్తించి దరఖాస్తు చేయిస్తున్నారు. గొర్రెల యూనిట్లను గొల్లకుర్మలకు అం దేలా చర్యలు తీసుకుంటున్నారు. అర్హులతోపాటు పార్టీకి విధేయులుగా ఉంటున్న వారికి బీసీబంధు, మైనార్టీ బంధు, దళితబంధు, గృహలక్ష్మీ పథకాలు వర్తించేలా ప్రయత్నిస్తున్నారు. ఎన్నిక లెప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలనే సంకేతాలు రావడంతో ముందుగానే తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు.