ఇల్లే లేదు! అయినా..ఇంటి నంబర్?
ABN , First Publish Date - 2023-09-22T23:21:12+05:30 IST
అనుమతులు లేకుండానే వెంచర్లను ఏర్పాటు చేయడమేకాకుండా ఇళ్లే కట్టకుండా ఇంటి నంబర్లు పొంది దర్జాగా రిజిస్ట్రేషన్లు చేస్తున్న రియల్‌ఎస్టేట్ సంస్థల మాయాజాలం హైదరాబాద్ నగర శివార్లలోని జిన్నారం మండలంలో వెలుగు చూసింది.
34 ఖాళీ స్థలాలకు కేటాయింపు.. ఇవే నంబర్లతో 91 ఇళ్లకు రిజిస్ట్రేషన్లు
అందమైన బ్రోచర్లతో వెంచర్ల మాయ
అక్రమ దందాలో అధికారులకూ పాత్ర!
నత్తనడకన అంతర్గత విచారణ
జిన్నారం, సెప్టెంబరు 22: అనుమతులు లేకుండానే వెంచర్లను ఏర్పాటు చేయడమేకాకుండా ఇళ్లే కట్టకుండా ఇంటి నంబర్లు పొంది దర్జాగా రిజిస్ట్రేషన్లు చేస్తున్న రియల్‌ఎస్టేట్ సంస్థల మాయాజాలం హైదరాబాద్ నగర శివార్లలోని జిన్నారం మండలంలో వెలుగు చూసింది. అధికారుల అండతో ఎలాంటి నిర్మాణాలు లేకుండానే 34 స్థలాలకు ఇంటి నంబర్లు కేటాయించగా, వీటి ఆధరంగా ఇప్పటికే 91 ప్లాట్లను రిజిస్త్రేషన్ చేయడం విస్మయం కలిగిస్తున్నది. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పంచాయతీ పరిధిలో 72, 80, 83, 84, 85, 89, 80ఎ8, 86 ఎఎ, 86ఇ సర్వే నంబర్లలో 6 ఎకరాల స్థలంలో ఓ ప్రవేట్ సంస్థ వెంచర్ ఏర్పాటు చేసింది. ఇందులో ఎలాంటి నివాసాలు నిర్మించకుండానే ఏకంగా 34 ఇంటి నంబర్లను పంచాయతీ నుంచి పొందారు. వీటి ఆధారంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్త్రేషన్లు కూడా చేశారు. ఇంటి నంబర్లు 34 మాత్రమే ఉండగా మొత్తం 91 రిజిస్ట్రేషన్లు చేయడం గమనార్హం. ఈ వ్యవహారంలో పంచాయతీ ఉద్యోగితో పాటు, మరో వ్యక్తి కీలకపాత్ర పోషించినట్టు విమర్శలు వెల్లువెత్తాయి. ఇందుకోసం ఒక్కో ప్లాటుకు రూ. 2 లక్షల చొప్పున సొమ్ము చేతులు మారిందని ఆరోపణలున్నాయి. ఇంటి నంబర్ల కేటాయింపు వ్యవహారంపై ఇప్పటికే ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.
బ్రోచర్లు, ఆఫర్లతో బురిడీ
సొంతింటి కళను సాకారం చేసుకోవాలనే సామాన్యులనే రియల్‌ఎస్టేట్ సంస్థలు టార్గెట్‌గా చేసుకుంటున్నాయి. తక్కువ ధరకే ఇస్తామని ఆఫర్లు ప్రకటిస్తూ, అందమైన బ్రోచర్లను ముద్రించి ప్రచారం చేస్తున్నారు. అనుమతులు తీసుకోకుండా, న్యాయపరమైన వివాదాలున్న భూములు, ప్రభుత్వ భూములు, నీటివనరుల పరిధిలోని భూములను ఆక్రమించి లేఔట్‌లు చేస్తున్నారు. బ్రోచర్లను చూసి ఆకర్షితులయ్యే వారు కనీసం క్షేత్రస్థాయిలో స్థలం కూడా చూడకుండా ప్లాట్లను కొంటున్నారు.
గడ్డపోతారంలోని సౌఖ్య వెంచర్‌లో కొన్ని సర్వే నంబర్లలోని భూములపై కోర్టులో కేసులు ఉండగా వ్యాపారులు దర్జాగా ప్లాట్లను విక్రయించారు. సదరు రియల్ సంస్థ భూ వివాదం, బ్యాంకు రుణం చెల్లింపులపై కోర్టులో జరిగిన విచారణలో ఇంటి నంబర్ల కేటాయింపు అంశం బయటపడింది. విచారణలో భాగంగా ప్లాట్లు కొన్నవారికి కోర్టు నోటీసులు అందడంతో లబోదిబోమంటున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు రూ. 45 కోట్ల వరకు అమ్మకాలు జరుగగా.. ఒక్కో ఇంటి నంబర్, రిజిస్త్రేషన్‌కు రూ. 2 లక్షల చొప్పున చేతులు మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గతంలో నల్తూరు పరిధిలో ఓ సంస్థ రైతుల వద్ద భూముల కొనుగోలుకు ఒప్పందం చేసుకుని అడ్వాన్స్ మాత్రమే చెల్లించి ప్లాట్ల అమ్మకాల కోసం ప్రకటనలు ఇచ్చింది. తమకు పూర్తిగా డబ్బులు చెల్లించకుండానే అమ్మకాలు ప్రారంభించడంతో రైతులు తమ భూములను స్వాధీనం చేసుకోగా కొన్నవారు తీవ్రంగా నష్టపోయారు. ప్లాట్లు కొనేవారు స్థలాన్ని పరిశీలించి, ఎలాంటి వివాదం లేనివని నిర్ధారణ చేసుకోకపోవడంతోనే నష్టపోయే ప్రమాదం నెలకొన్నది.
ఆ వెంచర్‌కు పంచాయతీ అనుమతి లేదు
-ప్రకాశంచారి, సర్పంచ్
గడ్డపోతారంలో అక్రమంగా ఇంటి నంబర్లు పొందిన ప్రైవేట్ వెంచర్‌కు గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు లేవు. పంచాయతీ పాలకవర్గం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే ప్లాట్ల అమ్మకాలు జరిపారు. ఈ వ్యవహారంపై సమగ్రంగా దర్యాప్తు చేయాలి. దీనిపై పాలకవర్గ సమావేశం నిర్వహించి తీర్మానం చేస్తాం.