మెదక్‌కు మొండిచేయి

ABN , First Publish Date - 2023-02-07T00:26:46+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌లో మెదక్‌ జిల్లాకు ప్రాధాన్యత దక్కలేదు. ఎన్నికల సీజన్‌ ముందున్నందున 2023-2024 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో జిల్లాకు కేటాయింపులు దక్కుతాయని భావించినవారికి నిరాశే మిగిలింది.

మెదక్‌కు మొండిచేయి

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌, ఫిబ్రవరి 6 : రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌లో మెదక్‌ జిల్లాకు ప్రాధాన్యత దక్కలేదు. ఎన్నికల సీజన్‌ ముందున్నందున 2023-2024 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో జిల్లాకు కేటాయింపులు దక్కుతాయని భావించినవారికి నిరాశే మిగిలింది. రాష్ట్రంలోని ప్రతీ జిల్లాకు మెడికల్‌ కళాశాలను కేటాస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది.మెదక్‌ జిల్లాలో 2023-2024 విద్యా సంవత్సరంలో మెడికల్‌ కళాశాలను ఏర్పాటు చేస్తామని గత బడ్జెట్‌లో వెల్లడించింది. కానీ సోమవారం మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టిన ప్రసంగంలో మెదక్‌లో మెడికల్‌ కళాశాల ప్రస్తావన లేకపోవడం జిల్లా ప్రజలకు నిరాశ కలిగించింది. ఇక ఈ బడ్జెట్‌లో ఏడుపాయల అంశమే ప్రస్తావనకు రాలేదు. గతంలో సీఎం ఇచ్చిన హామీ నీటి మూటగానే మిగిలింది.

ఈ ఏడాది 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు చేయాలనే లక్ష్యంతో బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయించారు. కానీ మెదక్‌ జిల్లా ఆయిల్‌పాం సాగుకు అనుకూలం కాదన్న సాకుతో ఇప్పటి వరకు ఒక్క రూపాయి కేటాయించ లేదు. మరోవైపు జిల్లాలోని నిజాంపేట మండలంలో ఓ రైతు 20 ఎకరాల్లో ఆయిల్‌పాంను విజయవంతంగా సాగు చేస్తున్నాడు. వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా జిల్లాలో 20 వేల ఎకరాల్లో ఆయిల్‌పాం సాగుకు చేయడానికి అనుకూలమైన వాతావరణం ఉందని ప్రకటించారు. అయినా ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. రుణమాఫీ కోసం జిల్లాలో వేలాది మంది రైతులు ఎదురుచూస్తున్నారు. రూ. 1లక్ష లోపు వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని 2018 ఎన్నికల సమయంలో అధికార పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు రూ. 25వేల లోపు రుణాలు మాత్రమే మాఫీ చేశారు. ఆ పైన రుణం తీసుకున్న రైతులకు మాఫీ జరగలేదు. మెదక్‌ జిల్లాలో 20,873 మంది రైతులకు రూ.82.39 కోట్ల రుణమాఫీ జరిగింది. ఈసారి బడ్జెట్‌లో రుణమాఫీకి కేవలం రూ.6,385 కోట్లు కేటాయించడంతో రుణమాఫీ ఉత్తదేనని అర్థమవుతున్నది.

Updated Date - 2023-02-07T00:26:48+05:30 IST