Share News

ఖేడ్‌ ఎంపీపీపై అవిశ్వాసం

ABN , Publish Date - Dec 14 , 2023 | 11:20 PM

నారాయణఖేడ్‌ మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షురాలు చాందీబాయిచౌహాన్‌పై అవిశ్వాసాన్ని ప్రకటిస్తూ బీఆర్‌ఎ్‌సపార్టీకి చెందిన ఎంపీటీసీలు గురువారం నారాయణఖేడ్‌ ఆర్డీవో కార్యాలయ డీఏవోకు నోటీసు అందజేశారు.

ఖేడ్‌ ఎంపీపీపై అవిశ్వాసం
నారాయణఖేడ్‌ ఆర్డీవో కార్యాలయ డీఏవోకుఅవిశ్వాసం నోటీసు అందజేస్తున్న బీఆర్‌ఎస్‌ ఎంపీటీసీలు

ఆర్డీవో కార్యాలయ డీఏవోకు నోటీసు ఇచ్చిన ఎంపీటీసీలు

నారాయణఖేడ్‌, డిసెంబరు 14: నారాయణఖేడ్‌ మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షురాలు చాందీబాయిచౌహాన్‌పై అవిశ్వాసాన్ని ప్రకటిస్తూ బీఆర్‌ఎ్‌సపార్టీకి చెందిన ఎంపీటీసీలు గురువారం నారాయణఖేడ్‌ ఆర్డీవో కార్యాలయ డీఏవోకు నోటీసు అందజేశారు. నారాయణఖేడ్‌ మండల పరిషత్‌ పరిధిలో 18 మంది ఎంపీటీసీలు ఉన్నారు. అందులో 14 మంది బీఆర్‌ఎస్‌, 3 కాంగ్రెస్‌, ఒకరు స్వతంత్ర అభ్యర్థి. అప్పట్లో ర్యాకల్‌ ఎంపీటీసీ చాందీబాయిచౌహాన్‌ను ఎంపీపీగా, నిజాంపేట రెండో ఎంపీటీసీ సాయిరెడ్డిని వైస్‌ ఎంపీపీగా ఎన్నుకున్నారు. ఇటీవల ఎంపీపీ చాందీబాయిచౌహాన్‌తో పాటు సత్యగామ ఎంపీటీసీ సరోజన కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ర్యాలమడుగు స్వతంత్ర ఎంపీటీసీ మోతీబాయి కూడా కాంగ్రెస్‌ గూటికి చేరుకున్నారు. దీంతో బీఆర్‌ఎస్‌ ఎంపీటీసీలు 12 మంది ఆర్డీవో కార్యాలయ డీఏవోకు అవిశ్వాసం నోటీసు అందించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీలు మాట్లాడుతూ తమ పార్టీ ద్వారా గెలుపొందిన చాందీబాయిచౌహాన్‌ కాంగ్రెస్‌లో చేరారని, అందుకే అవిశ్వాసాన్ని ప్రకటిస్తున్నామన్నారు. 18 మంది సభ్యులలో నోటీసు ఇవ్వడానికి 12 మంది అవసరమని, సరిపడా ఉన్నందున నోటీసు అందజేశామన్నారు. అవిశ్వాస నోటీసులో తుర్కపల్లి ఎంపీటీసీ అశోక్‌రెడ్డి, జగన్నాథ్‌పూర్‌ ఎంపీటీసీ రుక్మిణిబాయి, నమ్లీమేట్‌ ఎంపీటీసీ శ్రీనివాస్‌, సంజీవరావుపేట ఎంపీటీసీ భూపాల్‌, అనంత్‌సాగర్‌ ఎంపీటీసీ రాజు, లింగాపూర్‌ ఎంపీటీసీ లక్ష్మి, చాప్టా.కె ఎంపీటీసీ సునీత, కొండాపూర్‌ ఎంపీటీసీ సుజాత, అబ్బెంద ఎంపీటీసీ జగదేవి, వెంకటాపూర్‌ ఎంపీటీసీ చాందిబాయి, ఎంపీపీ ఉపాధ్యక్షుడు సాయిరెడ్డి పేర్లు ఉన్నాయి. వారివెంట కోఆప్షన్‌ సభ్యుడు నవాబ్‌, విజిలెన్స్‌ కమిటీ సభ్యుడు రాజు, మాజీ సభ్యుడు రవీందర్‌నాయక్‌ ఉన్నారు. ఈవిషయమై ఎంపీపీ చాందీబాయిచౌహాన్‌ స్పందిస్తూ నోటీసు ఇచ్చిన వారిలో ఎంపీటీసీలు అందరూ లేరని ఆరోపించారు. నిబంధనల ప్రకారం ఎంపీటీసీలు ఆర్డీవో ఎదుట సంతకాలు చేయాల్సి ఉంటుందన్నారు. కానీ కొందరి సంతకాలు ఫోర్జరీ చేసి అవిశ్వాసం నోటీసు ఇచ్చారని ఆరోపించారు. ఈ నోటీసు చెల్లదని చాందీబాయి పేర్కొన్నారు.

Updated Date - Dec 14 , 2023 | 11:20 PM