పాత ఓటర్లకు కొత్త గుర్తింపు
ABN , First Publish Date - 2023-11-19T23:43:33+05:30 IST
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న క్రమంలో ఎన్నికల సంఘం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కొందరి గుర్తింపు కార్డులు ఆన్‌లైన్‌లో కనిపించడంలేదు.

జిల్లాలో 28 వేల మందికి కొత్త కార్డులు
నేరుగా పోస్టల్ ద్వారా ఇంటికే పంపనున్న అధికారులు
సిద్దిపేట అగ్రికల్చర్, నవంబరు 19: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న క్రమంలో ఎన్నికల సంఘం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కొందరి గుర్తింపు కార్డులు ఆన్‌లైన్‌లో కనిపించడంలేదు. వాటిపై దృష్టిసారించిన ఎన్నికల సంఘం నియోజకవర్గాల వారీగా అలాంటి వారు ఎంతమంది ఉన్నారనే వివరాలు సేకరించింది. వారికి కొత్తకార్డుల జారీ ప్రారంభించింది. 2012 కంటే ముందున్న గుర్తింపు కార్డుల్లో 12 అంకెలున్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా ఇస్తున్న వాటిలో 10 అంకెలున్నాయి. కొత్త గుర్తింపు కార్డులు జారీ చేసే ముందు ఓటర్లకు బీఎల్‌వోల ద్వారా లేఖలు అందించారు. జిల్లాలో 28 వేల మందికి పోస్టల్ ఆఫీస్ ద్వారా నేరుగా ఇంటికే ఎపిక్ (ఎలక్షన్ ఫొటో ఐడెంటిటీ కార్డు) పంపిస్తున్నారు. కార్డుతో పాటు ప్రతిజ్ఞ, ఓటుహక్కు వినియోగించుకువాలనే సందేశాన్ని జత చేస్తున్నారు. కొత్త కార్డు రాకున్నా పాతకార్డుతో కూడా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు అని అధికారులు చెబుతున్నారు.
ప్రతిజ్ఞాపత్రం జత చేసి..
ఉమ్మడి రాష్ట్రంలో జారీ చేసిన గుర్తింపు కార్డులు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు. దీంతో ఓటర్లు ఒకింత ఆందోళన చెందారు. అయితే వీటన్నింటికీ ఏపీ సిరీ్‌సకు బదులు కొత్త ప్రామాణిక సంఖ్య కేటాయించారు. గుర్తింపు కార్డుల కొత్త నంబర్లను బీఎల్‌వోలు ఇప్పటికే లేఖల ద్వారా ఓటర్లకు పంపిణీ చేశారు. ఇకపై నూతన ఎపిక్‌లోని పేరు, నంబరు తదితర వివరాలనే ప్రామాణికంగా తీసుకుంటారు. ఓటరు చైతన్యంలో భాగంగా పలు సంస్కరణలు అమలు చేస్తున్న ఎన్నికల సంఘం మరో అడుగు ముందుకేసింది. ఓటు హక్కు నమోదు నుంచి వినియోగం వరకు పారదర్శక, నైతిక విలువలకు కట్టుబడి ఉండేలా ప్రజలకు తమ బాధ్యతలను గుర్తుచేస్తూ సందేశాత్మక పత్రాలను ముద్రించింది. ’స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా ఓటు వేస్తానని ప్రతిజ్ఞ పత్రం, మరో సందేశాత్మక పత్రం కొత్తకార్డులతో కలిపి పోస్టల్ ద్వారా ఓటర్ల ఇంటికి చేరవేస్తున్నది. కొత్తగా నమోదు చేసుకున్న 20,722 ఓటర్లతో పాటు మార్పులు, చేర్పులు చేసుకున్న వారికి స్పీడ్ పోస్టు ద్వారా ఇంటికి చేరవేస్తున్నారు.
ఓటు హక్కుపై ఎన్నికల సంఘం లేఖ
ప్రజాస్వామ్యంలో ఓటు విలువను గుర్తు చేస్తూ జిల్లా ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ముద్రించిన ఇంగ్లీష్, తెలుగు భాషలో ఉన్న మీ ఓటు-మీ హక్కు పేరుతో లేఖను గుర్తింపు కార్డుతో పంపిస్తున్నారు. ఎన్నికల్లో మీ అభీష్టం మేరకు, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని అందులో పేర్కొన్నారు.