ఈజీఎస్‌ పనుల్లో పంచాయతీ కార్యదర్శుల నిర్లక్ష్యం

ABN , First Publish Date - 2023-03-26T00:02:02+05:30 IST

ఉపాధిహామీ పనుల్లో పంచాయతీ కార్యదర్శుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతుందని ఏపీడీ కౌసల్యాదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈజీఎస్‌ పనుల్లో పంచాయతీ కార్యదర్శుల నిర్లక్ష్యం
నంగునూరులో ఉపాధిహామీ సామాజిక తనిఖీ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజాదర్బార్‌లో పాల్గొన్న అధికారులు

సామాజిక తనిఖీలో మండిపడిన ఏపీడీ కౌసల్యాదేవి

నంగునూరు, మార్చి 25: ఉపాధిహామీ పనుల్లో పంచాయతీ కార్యదర్శుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతుందని ఏపీడీ కౌసల్యాదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం నంగునూరులో 13వ విడత ఉపాధిహామీ పథకంలో చేపట్టిన పనులపై సామాజిక తనిఖీలో భాగంగా ఏర్పాటుచేసిన ప్రజాదర్బార్‌లో ఆమె పాల్గొన్నారు. ల్యాండ్‌ లెవలింగ్‌లో రైతుల అంగీకారపత్రాలు చూపించకుండానే పనులు చేపట్టారని తనిఖీలో వెల్లడైంది. కొవిడ్‌ సమయంలో ఉపాధిహామీ కూలీలు హాజరైనట్లు చూపించారు. కానీ రిజిస్టర్‌లో పేరు నమోదు చేయలేదు. మండలంలోని అనేక చోట్ల పనులు చేయకుండానే బిల్లులను చెల్లించినట్లు స్పష్టమైంది. చాలా గ్రామాల్లో ఉపాధిహామీ పనుల కోసం దరఖాస్తులు స్వీకరించడం లేదని ఫిర్యాదులు వచ్చినట్లు వెల్లడైంది. ఘనపూర్‌ గ్రామంలో ముగ్గురు రైతులకు సంబంధించి రెండు వేల నీలగిరి మొక్కలు నాటినప్పటికీ పని ప్రదేశంలో సామాజిక తనిఖీ సందర్భంగా మొక్కలు లేకపోవడంతో, అక్కడ మొక్కలు నాటారా? లేదా? అన్నది స్పష్టం కాలేదు. మండలంలో 2019 నవంబరు 1 నుంచి 2022 మార్చి 31 వరకు చేపట్టిన ఉపాధి పనుల్లో అనేక అక్రమాలు చోటు చేసుకున్నట్లు వెలుగులోకి వచ్చాయి. ఉపాధిహామీ పథకంలో 3,669 పని దినాలకుగానూ రూ.11.65 కోట్ల లేబర్‌ కాంపోనెంట్‌ కింద పనులను చేపట్టారు. అందులో రూ.3.30 కోట్ల మెటీరియల్‌ ఖర్చుల కింద నిధులను చెల్లించారు. అలాగే రూ.19.95 కోట్ల నిధులు ఉపాధిహామీ కూలీలకు చెల్లించినట్లు రికార్డులు చెబుతున్నాయి. కానీ మధ్యాహ్నం వరకు మండలంలోని 24 గ్రామపంచాయతీల్లో తొమ్మిది గ్రామ పంచాయతీలకు మాత్రమే సోషల్‌ ఆడిట్‌ నిర్వహించారు. గట్లమల్యాల, కోనాయిపల్లి, పాలమాకుల, మైసంపల్లి, ఘనపూర్‌, వెంకటాపూర్‌, దర్గపల్లి, ముండ్రాయి, తిమ్మాయిపల్లి గ్రామాల్లో ఉపాధిహామీ పనుల విషయంలో జరిగిన సామాజిక తనిఖీలో రూ.36,637 జరిమానా చెల్లించేలా సిఫారసు చేసినట్లు ఏపీడీ కౌసల్యాదేవి పేర్కొన్నారు. మిగతా గ్రామాల్లో సామాజిక తనిఖీలు కొనసాగుతున్నాయి. అనేక గ్రామాల్లో ఎంపీడీవో పాస్‌ ఆర్డర్‌ లేకుండానే చెల్లింపులు జరిగినట్లు తనిఖీలో వెల్లడైంది. నంగునూరు మండలంలో పంచాయతీ కార్యదర్శుల పనితీరు బాగాలేదని ఏపీడీ కౌసల్యాదేవి అసహనం వ్యక్తంచేశారు. ఉపాధి కూలీల జాబ్‌కార్డులను కొత్త సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేయడంలో పంచాయతీ కార్యదర్శులు పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ విజిలెన్స్‌ అధికారి ప్రభాకర్‌, ఎస్‌ఆర్‌ హారిఫ్‌, ప్రదీ్‌పకుమార్‌, మాజీ ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2023-03-26T00:02:02+05:30 IST