జీవాల పెంపకానికి చేయూత
ABN , First Publish Date - 2023-03-05T00:17:53+05:30 IST
మాసం ఉత్పత్తులను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ (ఎన్‌ఎల్‌ఎం) ద్వారా గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకానికి చేయూతనిస్తున్నది.
నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ద్వారా 50 శాతం సబ్సిడీ, రుణ సదుపాయం
జోగిపేట, మార్చి 4: మాసం ఉత్పత్తులను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ (ఎన్‌ఎల్‌ఎం) ద్వారా గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకానికి చేయూతనిస్తున్నది. ఎంపిక చేసిన లబ్ధిదారులకు రూ. 12 లక్షల నుంచి రూ.కోటి విలువైన యూనిట్లను 50ు సబ్సిడీపై అందజేస్తున్నది. ఇందుకోం అన్ని సామాజికవర్గాలకు చెందినవారు అర్హులు. రాష్ట్రాల్లో పశుసంవర్థకశాఖ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నది. ఈ పథకంపై తగినంత ప్రచారం లేకపోవడంతో ఔత్సాహికుల నుంచి స్పందన కొరవడింది. ఇప్పటివరకు సంగారెడ్డి జిల్లాలో కేవలం ఐదు దరఖాస్తులు వస్తే ఒక యూనిట్ గ్రౌండింగ్ పూర్తయ్యింది.
ఐదు విభాగాలుగా యూనిట్లు
ఎన్‌ఎల్‌ఎం ద్వారా గతంలో రూ. కోటి విలువైన యూనిట్లను మాత్రమే మంజూరు చేశారు. ఇందులో రూ. 50 లక్షలు సబ్సిడీ, రూ. 40 లక్షలు బ్యాంక్‌లోన్, మిగతా రూ. 10 లక్షలు లబ్ధిదారుల వాటాగా చెల్లించాల్సి వచ్చేంది. యూనిట్ విలువ ఎక్కువగా ఉండడంతో బ్యాంకులు పూచీకత్తు ఉంటేనే లోన్లు ఇవ్వడానికి ముందుకువచ్చాయి. దీంతో ప్రజలకు చేరువ కాలేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎన్‌ఎల్‌ఎం పథకం నిబంధనలను సరళం చేసింది. పథకాన్ని ఐదు విభాగాలుగా విభజించింది. రూ. 12 లక్షలతో 105 గొర్రెల యూనిట్, రూ. 40 లక్షలతో 210 గొర్రెల యూనిట్, రూ. 60 లక్షలతో 315 గొర్రెల యూనిట్, రూ. 80 లక్షలతో 420 గొర్రెల యూనిట్, రూ. కోటితో 525 గొర్రెల యూనిట్‌గా నిర్ణయించారు. ఇందులో ఏ యూనిట్‌ను ఎంచుకున్నా 50ు సబ్సిడీ లభిస్తుంది. మేకలు, గొర్రెలే కాకుండా దేశవాళీ కోళ్లు, పందుల పెంపకం కూడా చేపట్టవచ్చు. వీటి యూనిట్ కాస్ట్ రూ. 50 లక్షలకే పరిమితం చేశారు.
2 నుంచి 10 ఎకరాల భూమి
ఎంపిక చేసుకున్న యూనిట్‌ను బట్టి 2 నుంచి 5 ఎకరాల భూమి అవసరం ఉంటుంది. సొంత భూమి లేకపోతే లీజుకు తీసుకోవచ్చు. చుట్టూ ఫెన్సింగ్ వేసుకుని షెడ్డు నిర్మించి మేత ఏర్పాట్ల్లు చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాంక్ లోన్ కోసం కాన్సెంట్ తీసుకోవాలి. అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లు జతచేసి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు కాపీని జిల్లా పశుసంవర్థకశాఖ ఆఫీసులో సమర్పించాలి.
ఎంపిక విధానం
నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ కార్యక్రమానికి రాష్ట్రస్థాయిలో యానిమల్ హస్బెండరీ డైరెక్టర్ (జిల్లా పశుసంవర్థక శాఖాధికారి) నోడల్ ఆపీసర్‌గా వ్యవహరిస్తారు. లబ్ధిదారుల ఎంపికకు రాష్ట్ర, కేంద్రస్థాయిలో వేర్వేరుగా కమిటీలు ఉంటాయి. ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. బ్యాంకు రుణం మంజూరైన అనంతరం 25 శాతం సబ్సిడీ సొమ్ము విడుదల చేస్తారు. యూనిట్ గ్రౌండింగ్ సమయంలో మిగిలిన 25 శాతం సబ్సిడీ సొమ్మును అందజేస్తారు. బ్యాంక్ లోన్ అవసరం లేదనుకుంటే లబ్ధిదారులు సొంత పెట్టుబడి ఏర్పాట చేసుకోవచ్చు.