నర్సాపూర్‌లో అమీతుమీ
ABN , First Publish Date - 2023-11-19T23:19:52+05:30 IST
హోరాహోరీగా తలపడుతున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు

సిట్టింగ్ స్థానంలో గెలుపే లక్ష్యంగా బీఆర్‌ఎస్
గత వైభవాన్ని పొందాలని కాంగ్రెస్
మొదటిసారి పాగా వేయాలని బీజేపీ
ఎవరికి వారు పోటాపోటీగా ప్రచారం
నర్సాపూర్ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. ఎన్నికల రణరంగంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు అమీతుమీ తేల్చుకుంటున్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఒక పర్యాయం మంత్రిగా, ప్రస్తుతం మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా ఉన్న సునీతారెడ్డి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచి ప్రచారంలో దూసుకెళుతున్నారు. బీజేపీ అభ్యర్థి, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీధర్‌యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థి పీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఓటర్లు ఎవరికి పట్టం కడతారో వేచిచూడాలి
- నర్సాపూర్, నవంబరు 19
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు అతీసమీపంలో ఉన్న నియోజకవర్గం నర్సాపూర్. ఎక్కువ భాగం అటవీప్రాంతాన్ని ఆనుకుని ఉన్నందున గతంలో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండేది. దీంతో ఈ ప్రాంతం హైదరాబాద్‌కు అతి దగ్గరగా ఉన్నా చెప్పుకున్నస్థాయిలో అభివృద్ధికి నోచుకోలేదు. గతంలో సీపీఐకి కంచుకోటగా నిలిచింది. ఐదు పర్యాయాలు సీపీఐ నుంచి చిలుముల విఠల్‌రెడ్డి ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందించారు. 20 ఏళ్ల నుంచి మారిన కాలానుగుణంగా ప్రజలలో వచ్చిన మార్పులతో ఇప్పుడిప్పుడే ఈ నియోజకవర్గం అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్నది. ప్రస్తుతం నర్సాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా ప్రధాన పోటీ బీఆర్‌ఎస్ అభ్యర్థి సునీతారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి, బీజేపీ అభ్యర్థి మురళీధర్‌యాదవ్ మధ్యనే ఉందని చెప్పవచ్చు. బీఆర్‌ఎస్ నుంచి బరిలో ఉన్న అభ్యర్థి సునీతారెడ్డి గతంలో మూడు పర్యాయాలు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందగా, రెండు పర్యాయాలు ఓటమి చెందారు. ప్రస్తుతం నాల్గోసారి గెలవాలనే ఉద్దేశంతో బీఆర్‌ఎస్ పార్టీ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి, బీజేపీ అభ్యర్థి మురళిధర్‌యాదవ్ మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టాలని తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ ముగ్గురిలో ఓటర్లు ఎవరికి పట్టం కడుతారో చూడాలి.
గతంలో చేసిన సేవ... బీఆర్‌ఎస్ అభివృద్ధిని నమ్ముకున్న సునీతారెడ్డి
బీఆర్‌ఎస్ నుంచి బరిలో ఉన్న సునీతారెడ్డి తాను గతంలో మంత్రిగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి చేసిన సేవతో పాటు బీఆర్‌ఎస్ పాలనలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులను వివరిస్తూ ప్రచారం సాగిస్తున్నారు. ఇతర ప్రధాన పార్టీల కంటే ముందుగానే సునీతారెడ్డి నియోజకవర్గంలో తన ప్రచారం మొదలు పెట్టి ప్రజలతో మమేకమవుతున్నారు. ఏ గ్రామానికి ప్రచారానికి వెళ్లిన బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధితో పాటు మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను వివరిస్తూ స్థానిక ఎమ్మెల్యే మదన్‌రెడ్డితో కలిసి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పాలనలో నర్సాపూర్ ఆర్టీసీ డిపో, గిరిజన తండాలకు ప్రత్యేక నిధులు, పీజీ కాలేజీ, రోడ్ల అభివృద్ధి తదితర పనులను వివరిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోని చెరువులు నింపి ఈ ప్రాంతంలో సాగు నీటి సమస్య లేక చేస్తామని హామీ ఇస్తున్నారు.
ఒక్క అవకాశం ఇవ్వాలంటున్న ఆవుల రాజిరెడ్డి
నర్సాపూర్ నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా బరిలో ఉన్న ఆవుల రాజిరెడ్డి మొదటిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు. పార్టీ నుంచి సునీతారెడ్డి వెళ్లినప్పటి నుంచి నియోజకవర్గస్థాయిలో కీలక నాయకుడిగా మారి పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ పదవీ ద్వారా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తు ముందుకుసాగారు. పార్టీ టికెట్ కోసం ఇతర నాయకులతో గట్టి పోటీ ఎదుర్కున్నా చివరకు రాజిరెడ్డికే దక్కింది. దీంతో టికెట్ ఆశించిన నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పీసీసీ ఉపాఽధ్యక్షుడు ఏకంగా పార్టీని వీడి బీఆర్‌ఎ్‌సలో చేరారు. అదిష్ఠానం కల్గుచేసుకోవడంతో మిగతా నాయకులంతా ప్రస్తుతం ప్రచారానికి సహకరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళుతూ ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్ననరు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్‌ఎస్ పార్టీలు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే హయంలో ఇచ్చిన హామీల అమలు ఏమైందని ప్రశ్నిస్తూ ప్రచారం కొనసాగిస్తున్నారు. సీపీఐ కూడా మద్దతు ఇస్తూ ప్రచారంలో పాల్గొంటుండడం కొద్దిమేర కలిసివచ్చింది.
బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలపై మురళీధర్‌యాదవ్ ఆశలు
బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న మురళిధర్‌యాదవ్ బీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు దీటుగా తనదైన శైలిలో ప్రచారం సాగిస్తున్నారు. గతంలో నర్సాపూర్ సర్పంచ్‌గా, ఉమ్మడి జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా, ప్రస్తుతం నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్‌గా మురళీధర్‌యాదవ్ ఇక్కడి రాజకీయాలలో తనదైన ముద్ర వేసుకున్నాడు. ముఖ్యంగా బీసీ వర్గం నుంచి ఈస్థాయి ఎదిగిన నాయకుడిగా ఇక్కడ ప్రత్యేక పేరు తెచ్చుకున్నాడు. గతంలో నర్సాపూర్ నుంచి బీసీ నేతలు గుండం వీరన్న, జగన్నథరావు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. 1999 తర్వాత ఇప్పటి వరకు బీసీలకు అవకాశం రాలేదు. మొదటిసారి బీజేపీ బలమైన అభ్యర్థిగా గుర్తించి మురళీధర్‌యాదవ్‌కు పార్టీ టికెట్ ఇచ్చి ఆ వర్గంతో పాటు ఎస్సీ, ఎస్టీల ఓట్లను కూడా రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే టికెట్ ఆశించిన ఇతర నాయకులు సింగాయపల్లి గోపి, రఘువీరారెడ్డి, మల్లేశ్‌గౌడ్ ఆయనకు సహకరించకుండా దూరంగా ఉన్నారు. గత ఎన్నికలో పోటీ చేసిన సింగాయపల్లి గోపి ఆయన అనుచర గణంతో సీఎం సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ప్రధాన నాయకులు మురళీధర్‌యాదవ్‌కు సహకరించకున్నా అన్నీతానై కార్యకర్తల సహకారంతో గ్రామగ్రామాన ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికీ వెళ్తూ ఓటర్లను తనవైపు తిప్పుకునేందుకు శ్రమిస్తున్నారు. ముఖ్యంగా బీఆర్‌ఎస్ పాలనలో నియోజకవర్గంలో జరుగుతున్న తప్పులతో పాటు మోదీ పాలనలో దేశంలో అమలవుతున్న పథకాలు, అభివృద్ధిని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
బీఆర్‌ఎస్ అభ్యర్థి సునీతారెడ్డి
అనుకూలతలు
-మూడుసార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు మంత్రి
- నిరంతరం ప్రజల మధ్య ఉండటం
- సామాన్య నాయకురాలిగా అందరితో కలుపుగోలుగా వ్యవహరించడం
- వివాదరహితరాలుగా పేరు
- ఎమ్మెల్యే మదన్‌రెడ్డితో పాటు ఆయన వర్గీయులు మద్దతివ్వడం
ప్రతికూలతలు
- ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకత
- దళితబంధు, ఇళ్లు, ఇతర సమస్యలపై కొంత అసంతృప్తి
- నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు పూర్తి కాకపోవడం
- కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన సునీతారెడ్డి పట్ల అసంతృప్తితో కొందరు పార్టీని వీడటం
కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి
అనుకూలతలు
- వివాదాలకు దూరంగా సౌమ్యుడిగా పేరు
- కష్టకాలం నుంచి పార్టీ క్యాడర్‌ను కాపాడుతు రావడం
- ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకత
- కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు
- బీఆర్‌ఎస్ నుంచి కొందరు ముఖ్య నాయకులు పార్టీలో చేరడం
ప్రతికూలతలు
- బలమైన నాయకురాలు సునీతారెడ్డి, మురళీధర్‌యాదవ్‌తో పోటీ
- రాజకీయంగా ఎత్తులుపైఎత్తులు అంతగా తెలియకపోవడం
- ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, సునీతారెడ్డి కలిసి పనిచేయడం
- పార్టీలో చివరి వరకు ముఖ్యనాయకులు అసమ్మతి రాగం పాడటం
బీజేపీ అభ్యర్థి మురళీధర్‌యాదవ్
అనుకూలతలు
- నిరంతరం ప్రజల మధ్య ఉండటంతో పాటు రెండుసార్లు సర్పంచుగా, ప్రస్తుతం మున్సిపల్‌చైర్మన్‌గా కొనసాగడం
- ఆయన భార్య జడ్పీ చైర్‌పర్సన్‌గా పనిచేయడం
- నియోజకవర్గంలో యువకులు బీజేపీ పట్ల ఆకర్షితులు కావడం
-బీసీ నినాదం..హిందుత్వం, కేంద్ర ప్రభుత్వ పథకాలు
- ఈటల రాజేందర్ అండగా ఉండటం.. నాయకులు వెళ్లినా కార్యకర్తలు కలిసిరావడం
ప్రతికూలతలు
-పార్టీకి చెందిన ముఖ్యనాయకులు దూరంగా ఉండటం
-నియోజకవర్గం మొత్తంగా గతంలో ప్రచారం లేకపోవడం
-కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నుంచి బలంగా తలపడటం
-గ్రామాలలో నాయకత్వ లోపం
నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,21,972
పురుషులు 1,08,441
మహిళలు 1,13,551
ఇతరులు 7
సామాజిక వర్గాల వారీగా ఓట్లు
బీసీలు 1,12,000
ఎస్సీలు 22,000
ఎస్టీలు 27,500
మైనార్టీలు 26,600
ఇతరులు 33,870
2014 ఎన్నికల్లో పోలైన ఓట్లు
మొత్తం పోలైన ఓట్లు - 1,75,286
సీహెచ్.మదన్‌రెడ్డి(బీఆర్‌ఎ్‌స) - 85,890
సునీతారెడ్డి(కాంగ్రెస్) - 71,673
చాగండ్ల బల్విందర్‌నాథ్(బీజేపీ) - 6,088
బీఆర్‌ఎస్ మెజార్టీ - 14,217
2018 ఎన్నికల్లో పోలైన ఓట్లు
మొత్తం పోలైన ఓట్లు- 1,83,511
సీహెచ్.మదన్‌రెడ్డి(బీఆర్‌ఎ్‌స)- 1,05,665
సునీతారెడ్డి(కాంగ్రెస్)- 67,345
సింగాయపల్లి గోపి(బీజేపీ)- 2,848
బీఆర్‌ఎస్ మెజార్టీ- 38,320