Share News

మా నాన్నే స్ఫూర్తి..

ABN , First Publish Date - 2023-11-14T23:15:30+05:30 IST

ప్రజల ఆశీర్వాదంతోనే ఆయనకు పునర్‌జన్మ చీమకూ హాని తలపెట్టనోడు... శత్రువు కీడు తలచనోడు దుబ్బాక దిక్కే ధ్యాస.. ఆయన కలంతా కాలువల కోసమే ఆయనను కడుపులో పెట్టుకుని గెలిపించుకుంటారు ఆపదలో నిలబడి.. తలబడుతున్న కార్యకర్తలు వారికి మా కుటుంబం జన్మజన్మల రుణపడి ఉంటుంది ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తనయుడు పృథ్వీకృష్ణారెడ్డి

మా నాన్నే స్ఫూర్తి..

దుబ్బాక, నవంబరు 14 : ‘‘మా నాన్న చీమకు కూడా హాని తలపెట్టనోడు. శత్రువు కూడా నోరువిడిచి అడిగితే, ఎంతటి సహాయమైన చేసే వ్యక్తి. కష్టాల నుంచి వచ్చారు. నిజమైన మానవతావాది. మానాన్నే నాకు స్ఫూర్తి. ప్రజల ఆశీర్వాదంతోనే ఆయనకు పునర్‌జన్మ లభించింది.’’ అని దుబ్బాక బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మెదక్‌ పార్లమెంటు సభ్యుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి కుమారుడు పృథ్వీకృష్ణారెడ్డి అన్నారు. ఆయన ఆస్పత్రిఓ ఉన్నా దుబ్బాకపైనే ధ్యాస ఉన్నదని తెలిపారు. పంట కాలువలు వస్తే ఇక్కడి రైతు బాగుపడుతాడనే తాపత్రయమే ఆయనకు ప్రధాన అంశమన్నారు. ఇటీవల దుబ్బాక ఎన్నికల ప్రచారంలో జరిగిన దాడితో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్తప్రభాకర్‌రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ప్రచార బాధ్యతను నిర్వర్తిస్తున్న ఆయన కుమారుడితో మాటాముచ్చట..

ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా మీ నాన్నపై జరిగిన దాడిని ఎలా చూస్తున్నారు. మీకుటుంబంపై ఎలాంటి ప్రభావం పడింది?

మానాన్న వివాదరహితుడు. సౌమ్యుడు. చీమకు కూడా హాని తలపెట్టనోడు. ఆయన శత్రువులకు కూడా సహాయం చేసే మంచి గుణం కలిగినవాడు. ఆయనపై దాడి మేమే కాదు... ప్రజలు కూడా ఊహించుకోరు. అలాంటప్పుడు ఆయనపై దాడి జరిగిందని తెలిసిన వెంటనే మా కుటుంబం ఆందోళనకు గురైంది. మేము ఇంటిలో నుంచి బయటకు అడుగు పెట్టని విధంగా మెదిలాం. మానాన్న మాత్రమే రాజకీయాలు చూసేవాడు. రాజకీయాలు కుటుంబం మీద కూడా పడనివ్వలేదు. అలాంటిది ఒక్కసారిగా ఇలాంటి పరిస్థితి రావడం నిజంగానే ఆందోళనకు గురిచేసింది. మానాన్న మంచితనాన్ని మంచితనంతోనే ఎదుర్కొనే దమ్ములేకనే ఇలాంటి దారుణానికి ఒడిగట్టారు.

ప్రచార బాధ్యత అనూహ్యంగా మీమీద పడింది కదా ? ప్రజల నుంచి ఎలా స్పందన వస్తుంది ? ఏమీ హామి ఇస్తున్నారు ?

ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. మంచి వ్యక్తిపై దాడి జరగడం దారుణమని ముక్తకంఠంతో కండిస్తున్నారు. నేను సామాన్యుడిగా ఒక ఊరు వద్ద నిలబడిన. అక్కడికి ఒక మహిళ వచ్చింది. ఎనగుర్తి గ్రామానికి చెందిన కొయ్యడ రామలక్ష్మణలనే అన్నదమ్ములకు కండక్షీరత వ్యాధి వచ్చిందట. ‘ఆంద్రజ్యోతి’ దినపత్రికలో 2010లో కథనం చూసి నాన్న స్పందించారు. వాళ్లను రక్షించాలని ప్రయత్నం చేశారు. కానీ ఆ వ్యాధి ఇద్దరు అన్నదమ్ములను పొట్టనపెట్టుకుంది. చిన్న పిల్లవాడు లక్ష్మణ్‌ చివరి క్షణంలో తుదిశ్వాసను బిగపట్టుకుని, నాన్నవచ్చే వరకు ఆసుపత్రిలో ఎదురుచూశారు. నాన్నను చివరిసారి చూసి చేతులో చెయ్యేసి నాన్న చేతుల్లోనే కన్నుమూశారు. నాన్న ఆ కుటుంబానికి ఎంత సహాయం చేశాడో ఆ మహిళ చెప్పుతుంటే కంటిలో నీళ్లు తిరిగాయి. అదే గ్రామానికి చెందిన గీతాకార్మికుడు చనిపోతే నాన్న స్పందించిన తీరు ఆ గ్రామస్థులు చెబుతుంటే మనసు చలించింది. దుబ్బాకలో రసూల్‌ అనే డ్రైవర్‌ మక్కాలో మరణిస్తే 2010లో తనకు అధికారం లేకున్నా ఆ కుటుంబానికి ప్రభుత్వంనుంచి సహాయం అందించాడు. కరోనా సమయంలో దుబాయ్‌లో కరోనాతో బాధపడుతున్న వారికి చికిత్స అందించడంతోపాటు, వారిని సొంతగ్రామానికి రప్పించారు. ఆయనలో మానవత్వం గురించి ప్రజలు చెప్పుతుంటే మాకే కండ్లు చెమ్మగిల్లుతున్నాయి. ఇంతటి మానవతావాదిని కచ్చితంగా దుబ్బాక ప్రజలు కడుపులో పెట్టుకుని గెలిపించుకుంటారు. దుబ్బాకలో మానవత్వందే విజయం. హామీల విషయానికి వస్తే, దుబ్బాక రెవెన్యూ డివిజన్‌ చేస్తామని ఇప్పటికే మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. నాన్న ధ్యాసంతా దుబ్బాక నియోజకవర్గంలో పంట కాలువలు పూర్తి కావాలనే దానిపైనే. రైతులు బాగుపడాలి. నియోజకవర్గం అభివృద్ధి చేయాలనే తపన ఉన్న నాయకుడు. ఆయన గెలిస్తే దుబ్బాక సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందనే హామీనివ్వగలను.

పక్క పార్టీల వారు కొంతమందిని కొంటున్నారనే ప్రచారం జరుగుతుంది. ప్రజల్లో పార్టీ పరిస్థితి ఏమిటి?

మానాన్న వద్ద నయీం ముఠా డబ్బులో, ల్యాండ్‌మాఫియా డబ్బులో లేవు. ఆయన ఎక్కడా ఒక్క పైసా కమీషన్‌ తీసుకున్న చరిత్ర లేదు. ప్రజలే చెబుతున్నారు. అమ్ముడుపోయేటోళ్లు పోవడమే మంచిదని. మానాన్న తెరిచిన పుస్తకం. ఆయనకు బలం దుబ్బాక ప్రజలు, కార్యకర్తలే. ఆపద సమయంలో అడుగడుగునా వారందిస్తున్న మద్దతు మరవలేనిది. ఆపదలో నిలబడి, ప్రత్యర్థులతో తలబడుతున్నారు. అడుగడుగునా పార్టీకి రక్షణ కవచంగా నిలబడి, గులాబీ జెండాను మోస్తున్నారు. నిజంగా వారికి మాకుటుంబం రుణపడి ఉంటుంది. ఇంతటి అభిమానం సంపాదించుకున్న మానాన్న నిజంగానే నాకు స్ఫూర్తి.

ప్రజల నుంచి వస్తున్న స్పందన ఎలా ఉంది ?

నాన్న మీద ఉన్న ప్రేమ, ఆధరాభిమానాలే నాకు అడుగడుగునా ప్రజల నుంచి లభిస్తున్నది. ప్రజల ఆశీర్వాదంతోనే ఆయనకు పునర్‌జన్మ లభించింది. స్వచ్ఛందంగా యువత కదిలివస్తున్నారు. ఈ సమయంలో కదిలిరాకుంటే, మానవత్వానికే అర్థం లేదనే భావన వారిలో కలిగింది. ఆయనకు కచ్చితంగా 50వేల పైచిలుకు మెజార్టీని అందించాలనే పట్టుదలతో పనిచేస్తున్నారు.

నాన్న ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ? ఆయన ప్రచారానికి ఎప్పుడు వస్తారు?

ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. వైద్యుల సూచన మెరకు నాలుగైదు రోజుల్లో ప్రజల మధ్యకు వస్తారు. ఆయన ధ్యాసంతా దుబ్బాకపైనే ఉంది.

Updated Date - 2023-11-14T23:15:32+05:30 IST