బాకీ డబ్బును చెల్లించనందుకే హత్య
ABN , First Publish Date - 2023-03-19T00:02:41+05:30 IST
ఈ నెల 11న శివ్వంపేట మండలం దొంతి శివారులో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు.

డీఎస్పీ యాదగిరిరెడ్డి వెల్లడి
తూప్రాన్, మార్చి 18: ఈ నెల 11న శివ్వంపేట మండలం దొంతి శివారులో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. బాకీ డబ్బును తిరిగి చెల్లించనందుకే హత్య చేసినట్టు తేల్చారు. ఈ మేరకు శనివారం పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. తూప్రాన్ సబ్ డివిజన్ కార్యాలయంలో డీఎస్పీ యాదగిరిరెడ్డి కేసు వివరాలను విలేకరులకు వెల్లడించారు. ఈ మేరకు.. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో నివాసముండే తూప్రాన్ పట్టణ పరిధి అల్లాపూర్‌కు చెందిన మన్నె ఆంజనేయులు(45) గజ్వేల్, పూడురులో కూలీ పనులు చేసేవాడు. అదే సమయంలోనే సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామానికి చెందిన గుండగళ్ల బాబు అలియాస్ బాల్‌రెడ్డి (23)తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో బాబు వద్ద ఆంజనేయులు రూ. 96వేలు అప్పుగా తీసుకున్నాడు. సదరు డబ్బును తిరిగి చెల్లించేందుకు ఇబ్బంది పెట్టడంతో ఆంజనేయులును చంపేందుకు పథకం పన్నాడు. ఈ నెల 11న శివ్వంపేట మండలం దొంతి శివారులోని కుందాలమ్మ చెరువు వద్ద ఆంజనేయులుతో కలిసి బాబు మద్యం సేవించాడు. మద్యం మత్తులో ఉన్న ఆంజనేయులును బాబు బండరాయితో కొట్టి చంపాడు. అనంతరం మృతదేహాన్ని చెరువులో పడేసి, మృతుడికి చెందిన నోకియా ఫోన్, బజాజ్ ప్లాటినా ద్విచక్రవాహనాన్ని తీసుకొని బాబు పారిపోయాడు. సిద్దిపేట జిల్లా ములుగులో ఉన్న స్నేహితుడి వద్దకు వెళ్లిన నిందితుడు బాబును శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య చేసిన తరువాత నిందితుడు బాబు మృతుడి కుటుంబీకులతో గొంతు మార్చి మాట్లాడినట్లు డీఎస్పీ తెలిపారు. హత్యను తప్పుతోవపట్టించేందుకు పలు పథకాలు వేసినట్లు వివరించారు. నిందితుడు బాబుపై గతంలో అల్వాల్ పోలీసుస్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై అత్యాచారం కేసు నమోదైనట్టు డీఎస్పీ చెప్పారు. నిందితుడి పట్టుకునేందుకు సాంకేతికతను అందజేసిన నర్సాపూర్ సీఐ లాల్‌మధర్‌తో పాటు గోవర్ధన్, వెంకట్, మల్లేశ్‌లను డీఎస్పీ అభినందించారు. సమావేశంలో తూప్రాన్ సీఐ శ్రీధర్, శివ్వంపేట ఎస్‌ఐ రవికాంత్‌రావు పాల్గొన్నారు.