పురపాలన అస్తవ్యస్తం
ABN , First Publish Date - 2023-05-20T23:46:12+05:30 IST
అక్షర క్రమంలో ముందున్న అందోలు-జోగిపేట మున్సిపాలిటీ అభివృద్ధిలో అథమ స్థానంలో నిలుస్తున్నది. పాలకవర్గంలో విభేధాలు, ఆధిపత్య పోరుతో పాలన గాడితప్పింది.
అందోలు-జోగిపేట మున్సిపాలిటీలో గాడి తప్పిన పాలన
ప్రజా సమస్యలకు గాలికి వదిలి ఆధిపత్య పోరులో పాలకవర్గం
అజమాయిషీ లేక కిందిస్థాయి సిబ్బంది ఇష్టారాజ్యం
రూ. కోట్ల నిధులు అందుబాటులో ఉన్నా సాగని అభివృద్ధి పనులు
జోగిపేట, మే 20: అక్షర క్రమంలో ముందున్న అందోలు-జోగిపేట మున్సిపాలిటీ అభివృద్ధిలో అథమ స్థానంలో నిలుస్తున్నది. పాలకవర్గంలో విభేధాలు, ఆధిపత్య పోరుతో పాలన గాడితప్పింది. అభివృద్ధి దేవుడెరుగు.. పారిశుధ్యం, వీధిదీపాలు, నీటి సరఫరా వంటి కనీస వసతులను కూడా పట్టించుకోవడం లేదు. అందోలు-జోగిపేట మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులుండగా.. 13 మంది అధికార బీఆర్‌ఎ్‌సకు చెందినవారే. మున్సిపల్ చైర్మన్‌కు సొంత పార్టీ కౌన్సిలర్లకు ఉన్న విభేదాల కారణంగా వైస్ చైర్మన్ మినహా మిగిలిన 12 మంది సభ్యులు మూడు నెలల క్రితం చైర్మన్‌పై అవిశ్వాసం నోటీసు ఇచ్చారు. అవిశ్వాసంపై ఎటూ తేలకపోయినా అప్పటి నుంచి మున్సిపల్‌కౌన్సిల్ ఒక్కసారి కూడా పూర్తిస్థాయిలో సమావేశం కాలేదు. మధ్యలో జరిగిన బడ్జెట్ సమావేశానికి అధికార పార్టీకి చెందిన 9 మంది కౌన్సిలర్లు డుమ్మా కొట్టారు. ప్రతిపక్షాల మద్దతుతో బడ్జెట్ ఆమోదించి మమ అనిపించారు. అప్పటి నుంచి చైర్మన్, బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు పాలనను పట్టించుకోకుండా విందులు, వినోదాలు, విహారయాత్రలతో టైంపాస్ చేస్తున్నారు. అప్పుడప్పుడూ చైర్మన్ అభివృద్ధి పనులను సమీక్షించినా.. ఒక్క సమస్యా పరిష్కారం కావడంలేదు. అధికారులపై కౌన్సిల్ ఆజమాయిషీ కొరవడడంతో వారు ఆడింది ఆట.. పాడింది పాట అన్నట్టు పరిస్థితి తయారైంది.
తొమ్మిదేళ్లలో 16 మంది కమిషనర్లు
మున్సిపాలిటీకి చుక్కాని లాంటి కమిషనర్, శానిటేషన్, టౌన్‌ప్లానింగ్, నీటి సరఫరా తదితర విభాగాలకు పూర్తిస్థాయి అధికారుల నియామకం లేకపోవడంతో ఆయా విభాగాల పనితీరుపై తీవ్ర ప్రభావం పడుతున్నది. నగర పంచాయతీగా ఏర్పాటైననాటి నుంచి నేటి వరకు ఇన్‌చార్జి కమిషనర్లే తప్ప రెగ్యులర్ నియామకం జరగలేదు. వచ్చిన కమిషనర్లు కూడా ఇక్కడి రాజకీయాలతో వేగలేక బదిలీ చేయించుకుని వెళ్లిపోతున్నారు. 2014 నుంచి 16 మంది కమిషన్లు మారారు. ప్రస్తుత కౌన్సిల్ హయాంలో ఆరుగురు కమిషనర్లు మారారు.
కంపు కొడుతున్న కాలనీలు
మున్సిపాలిటీలో శానిటేషన్ అధికారి లేకపోవడం, సరిపడా పారిశుధ్య సిబ్బందిని నియమించకపోవడంతో పట్టణంలో పారిశుధ్య నిర్వహణ నానాటికీ తీసికట్టుగా మారింది. మురుగుకాల్వల్లో చెత్తను తొలగించకపోవడంతో మురుగు రోడ్లపై ప్రవహిస్తున్నది. ప్రధాన రహదారిపై సైడ్ డ్రెయిన్స్ నిర్మాణం పూర్తికాకపోవడంతో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు చెరువును తలపించింది. మార్కెట్‌యార్డు వద్ద డ్రైనేజీ నిర్మాణం అసంపూర్తిగా వదిలేయడంతో మురుగు రోడ్డుపైనే ప్రవహిస్తున్నది. మురుగులో చెత్త పేరుకుపోయి.. పందులు, దోమలు స్వైరవిహారం చేస్తుండడంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. దుర్వాసనతో వీధులు కంపుకొడుతున్నాయి. వార్డుల్లో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతున్నది. ప్రధాన వీధులన్నీ చెత్తమయమంగా మారాయి.
తైబజార్ సిబ్బంది చేతివాటం
మున్సిపాలిటీకి అత్యధిక ఆదాయాన్ని సమకూర్చే తైబజార్, మేకలు-గొర్రెల సంత, పశువుల సంత, కబేళా వేలంపాటలు నిర్వహించకపోవడంతో తాత్కాలిక, కాంట్రాక్టు సిబ్బంది చేతివాటం చూపుతున్నారు. సిబ్బందిపై నియంత్రణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో మున్సిపల్ ఆదాయానికి గండిపడుతున్నది.
నిధులున్నా అభివృద్ధి సున్నా
మున్సిపాలిటీలో పుష్కలంగా నిధులు అందుబాటులో ఉన్నా అభివృద్ధి అటకెక్కింది. నాలుగేళ్లుగా ప్రభుత్వం నుంచి వచ్చిన రూ. 6 కోట్లతో పాటు సీఎం కేసీఆర్ కేటాయించిన రూ.25 కోట్లతో మున్సిపాలిటీని అద్దంలా తీర్చిదిద్దేందుకు అవకాశం ఉన్నా పాలకవర్గం పట్టించుకోవడం లేదు. ఇటీవల పలు అభివృద్ధి పనులను మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేసిన పనులు మాత్రం ప్రారంభం కాలేదు. చైర్మన్, కౌన్సిలర్ల మధ్య విభేదాలతో ఏ పనులు చేయాలో కూడా తేలడం లేదు. దీంతో రాష్ట్రంలోనే అట్టడుగున జోగిపేట మున్సిపాలిటీ నిలుస్తుందని అధికారులే పేర్కొంటున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.