తమ భూమిని బదలాయించుకున్నారని తల్లీకొడుకుల ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2023-03-25T23:55:16+05:30 IST

తన తండ్రి పేరిట ఉన్న అసైన్డ్‌ భూమిని తమకు తెలియకుండానే వేరొకరు బదలాయించుకున్నారని ఆవేదన వ్యక్తంచేస్తూ తల్లీకొడుకులు తహసీల్దార్‌ కార్యాలయంలో ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది.

తమ భూమిని బదలాయించుకున్నారని తల్లీకొడుకుల ఆత్మహత్యాయత్నం

తహసీల్దారు ఆఫీసులోనే డీజిల్‌ పోసుకున్న వైనం

కౌడిపల్లి, మార్చి 25: తన తండ్రి పేరిట ఉన్న అసైన్డ్‌ భూమిని తమకు తెలియకుండానే వేరొకరు బదలాయించుకున్నారని ఆవేదన వ్యక్తంచేస్తూ తల్లీకొడుకులు తహసీల్దార్‌ కార్యాలయంలో ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. మెదక్‌ జిల్లా కౌడిపల్లిలో ఈ ఘటనకు సంబంధించిన వివరాలు బాధితులు తెలిపిన ప్రకారం.. కౌడిపల్లికి చెందిన చిన్నంగారి దుర్గయ్యకు 1996లో ప్రభుత్వం సర్వే నంబర్‌ 496/2లో 1.39 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ మేరకు అధికారులు అసైన్‌మెంట్‌ పట్టాను అందజేశారు. సదరు భూమిలో దుర్గయ్య కుటుంబం పంటలను కూడా సాగు చేసింది. 2014లో గ్రామానికే చెందిన పోలా కంసమ్మ పేరిట పట్టా మార్పిడి జరగడంతో అప్పటి నుంచి కంసమ్మ కుటుంబ సభ్యులు సాగు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ధరణి రికార్డుల్లోనూ కంసమ్మ కుటుంబ సభ్యుల పేరిటనే రికార్డులు నమోదై ఉన్నాయి. తమకు తెలియకుండానే అధికారులు రికార్డులు మార్చారని ఆరోపిస్తూ దుర్గయ్య కుమారుడు నాగరాజు తల్లి లక్ష్మితో కలసి శనివారం తహసీల్దార్‌ కార్యాలయంలో ఒంటిపై డిజిల్‌ పోసుకోని అత్మహత్యకు యత్నించారు. సిబ్బంది గమనించి అడ్డుకున్నారు. అనంతరం నాగరాజు విలేకరులతో మాట్లాడుతూ తండ్రి తదనంతరం తమ పేరిట రావాల్సిన భూమిని రెవెన్యూ అధికారులు తమకు తెలియకుండానే ఇతరుల పేరిట మార్చారని ఆరోపించారు. ఈ విషయంపై పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదని వాపోయారు. మరోవైపు ఈ విషయంపై స్థానికుల కథనం వేరేలా మరోవిధంగా ఉంది. కంసమ్మ కుటుంబం 12 సంవత్సరాల క్రితం భూమిని కొగుగోలు చేసి సాగు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ విషయంపై డిప్యూటీ తహసీల్దార్‌ తార స్పందిస్తూ ఈ నెల 20న నాగరాజు తహసీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తు ఇచ్చారని తెలిపారు. సదరు భూమికి సంబంధించిన రికార్డులను పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిస్తామని పేర్కొన్నారు.

Updated Date - 2023-03-25T23:55:16+05:30 IST