ప్రజల సొమ్మును అదానీకి దోచిపెట్టిన మోదీ

ABN , First Publish Date - 2023-02-07T00:03:58+05:30 IST

దేశ ప్రజల సొమ్మును ప్రధాని నరేంద్ర మోదీ అదానీకి దొచిపెట్టారని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు.

ప్రజల సొమ్మును అదానీకి దోచిపెట్టిన మోదీ
సిద్దిపేట ఎస్‌బీఐ రీజినల్‌ బ్యాంక్‌ ఎదుట కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిరసన

టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య

సిద్దిపేట టౌన్‌, ఫిబ్రవరి 6 : దేశ ప్రజల సొమ్మును ప్రధాని నరేంద్ర మోదీ అదానీకి దొచిపెట్టారని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు సోమవారం సిద్దిపేట పట్టణంలోని ఎస్‌బీఐ రీజినల్‌ బ్యాంకు కార్యాలయం ఎదుట డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ అదానీ ఆస్తులను పెంచేందుకు మోదీ ప్రభుత్వం ఆ గ్రూప్‌ సంస్థలో ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ తదితర ప్రభుత్వ బ్యాంకులను బలవంతంగా పెట్టుబడి పెట్టేలా చేశారని ఆరోపించారు. కేంద్రం తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల సామాన్యుడి నడ్డి విరిగి పెనుభారం పడనుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రబుత్వాలు మీరు చెప్పిందేమిటి, చేస్తున్నది ఏమిటని, దేశ పరిస్థితులు 9 ఏళ్లకు ముందు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉన్నాయని ప్రశ్నించారు. మోదీ దేశ సంపదను కొల్లగొడుతున్నాడని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌ పరం చేయం బాధాకరమన్నారు. ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ దేశానికి మూల స్తంభాలాంటివని, అలాంటి సంస్థలను కేవలం ఆదాని లాంటి వారికి మాత్రమే కట్టబెట్టడం సరైనది కాదన్నారు. అదానీకి, అంబానీకి భారీగా లోన్‌లు ఇప్పించే కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలకు ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 లక్షల మంది కౌలు రైతులకు మాత్రం రుణం ఇవ్వని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, ఇక్కడ ఏ పనిచేయని సీఎం కేసీఆర్‌, పక్క రాష్ట్రానికి వెళ్లి గొప్పలు చెప్పుకుంటున్నాడన్నారు. ఫామ్‌హౌస్‌ నుంచి బయటకు రావని, ప్రజల సమస్యలు పట్టించుకోవని, నీకు ఎందుకు జాతీయ రాజకీయాలని మండిపడ్డారు. కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరం కూడా పారలేదని పాలమూరు, రంగారెడ్డి పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారాయని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్‌ ఎక్కడ వస్తుందో సీఎం కేసీఆర్‌ నిరూపించాలన్నారు. రేవంత్‌రెడ్డి చేపట్టే హాథ్‌ సే హాథ్‌ జోడో కార్యక్రమం వ్యక్తికి సంబంధం లేదని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయాన్ని ప్రతీ ఒక్కరు స్వాగతించాలని అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు డాక్టర్‌ శ్రవణ్‌కుమార్‌రెడ్డి, సోమేశ్వర్‌రెడ్డి, గంప మహేందర్‌, బొమ్మల యాదగిరి, దరిపల్లి చంద్రం, దేవులపల్లి యాదగిరి, అత్తు ఇమామ్‌, ముద్దం లక్ష్మి, ఆంక్షారెడ్డి, సూర్యవర్మ, దాస అంజయ్య, మార్క సతీష్‌, గణేష్‌, కలిముద్దీన్‌, సయ్యద్‌ అతీక్‌, అజ్జు యాదవ్‌, ఫయ్యాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T00:03:59+05:30 IST