మోదీ ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ట వేటు

ABN , First Publish Date - 2023-03-25T23:27:40+05:30 IST

కాంగ్రెస్‌ నాయకుల మండిపాటు

మోదీ ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ట వేటు
చిన్నశంకరంపేటలో ప్రధాని దిష్టిబొమ్మ దహనం చేస్తున్న నాయకులు

మెదక్‌, మార్చి 25: కాంగ్రెస్‌ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్‌గాంధీపై అనర్హత వేటు కేంద్ర ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ట అని టీపీసీసీ సభ్యుడు మామిళ్ల ఆంజనేయులు విమర్శించారు. శనివారం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్‌లో ప్రశ్నించకుండా మోదీ ప్రభుత్వం రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. దేశ ప్రజల సంపదను దోచుకొని పోతున్న దోషులను పట్టుకోలేని ప్రభుత్వం, తప్పును ప్రశ్నించే వారిపై కక్షగట్టి అనర్హత వేటు వేయడం బాధాకరమన్నారు. రాహుల్‌గాంధీకి ప్రజల్లో పెరుగుతున్న అభిమానాన్ని చూసి మోదీ ప్రభుత్వం ఓర్వలేకపోతుందన్నారు. దేశ సమగ్రత, ఐక్యత కోసం కాంగ్రెస్‌ పార్టీ ఉద్యమాలకు సిద్ధంగా ఉందని హెచ్చరించారు. సమావేశంలో మెదక్‌ పట్టణ అధ్యక్షుడు గూడూరి ఆంజనేయులుగౌడ్‌, హవేళిఘనపూర్‌ మండలాధ్యక్షులు లక్కర్‌ శ్రీనివాస్‌, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్‌, కౌన్సిలర్‌ రాజలింగం, మైనార్టీ నియోజకవర్గ కన్వీనర్‌ ఇస్మాయిల్‌, ఎస్సీ సెల్‌ పట్టణ అధ్యక్షుడు గడ్డం ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం

చిన్నశంకరంపేట/జిన్నారం: రాహుల్‌ గాంధీ జోడోయాత్రతో ప్రధాని నరేంద్ర మోదీకి వణుకు పట్టిందని చిన్నశంకరంపేట ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మిగోపాల్‌రెడ్డి, బొల్లారం మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అనిల్‌రెడ్డి విమర్శించారు. రాహుల్‌ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా శనివారం చిన్నశంకరంపేటలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. గంటపాటు రస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ సత్యనారాయణగౌడ్‌, ఎంపీటీసీలు శివకుమార్‌, ప్రసాద్‌గౌడ్‌, కాంగ్రెస్‌ మండల ఉపాధ్యక్షుడు బందెల సాయిలు, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు మల్లేశం, రాంచంద్రం, యాదగిరి, శంకర్‌, రాములు, నర్సింహులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-25T23:27:40+05:30 IST