సేవాలాల్‌ మహారాజ్‌ జయంతి ఉత్సవాల్లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి

ABN , First Publish Date - 2023-02-16T00:25:43+05:30 IST

జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో బుధవారం జరిగిన సంత్‌ సేవాలాల్‌మహారాజ్‌ జయంతి ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి పాల్గొన్నారు

సేవాలాల్‌ మహారాజ్‌ జయంతి ఉత్సవాల్లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి
సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ జయంతి సందర్భంగా సంగారెడ్డిలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి,

బంజారాలతో కలిసి డాన్స్‌

సేవాలాల్‌ జయంతి రోజు సెలవు ఇచ్చేలా కృషి చేస్తా

సంగారెడ్డి మెయిన్‌ రోడ్డులో సేవాలాల్‌ మహారాజ్‌,

భవానీమాత గుడికి స్థలం కేటాయించేలా చూస్తానని హామీ

అభివృద్ధి కోసం ఎవరైనా సీఎంను కలవాల్సిందే కదా

తాను సీఎంను కలవడమే పాపమైపోయిందని వ్యాఖ్య

సంగారెడ్డిటౌన్‌, ఫిబ్రవరి 15: జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో బుధవారం జరిగిన సంత్‌ సేవాలాల్‌మహారాజ్‌ జయంతి ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి పాల్గొన్నారు. గణే్‌షనగర్‌లోని భవానీ మాత ఆలయం నుంచి పాత బస్టాండు వరకు నిర్వహించిన భారీ ఊరేగింపులో పాల్గొన్న జగ్గారెడ్డి బంజారాలతో కలిసి డాన్సు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగ్గారెడ్డి మాట్లాడుతూ సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ అడుగుజాడల్లో నడిచి ప్రతీ ఒక్కరు బాగా చదువుకొని ఉన్నతస్థాయికి ఎదగాలని సూచించారు. బంజారాలకు రిజర్వేషన్‌ కల్పించి, ఉన్నత స్థితికి రావడానికి సేవాలాల్‌ మహారాజ్‌ ఎంతగానో కృషిచేశారని గుర్తుచేశారు. సేవాలాల్‌ జయంతి రోజున ప్రభుత్వం సెలవు దినం ప్రకటించేలా కృషి చేస్తానని అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలలో సేవాలాల్‌ జయంతి రోజును సెలవు దినంగా ప్రకటించాలని కోరానన్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్‌ను ఒప్పించి తీరుతానని అన్నారు. అలాగే సంగారెడ్డి మెయిన్‌ రోడ్డులో సేవాలాల్‌ మహారాజ్‌, భవానీమాత ఆలయాల కోసం స్థలం కేటాయించేలా చూస్తానని, నిర్మాణానికి రూ.25లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారు. గుడి నిర్మాణంతో పాటు ఆశ్రమాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతీ గిరిజన తండాలో సేవాలాల్‌ విగ్రహాలు పెట్టిస్తానన్నారు. అభివృద్ధి విషయంలో ఏపార్టీ ఎమ్మెల్యే అయినా సీఎంను కలవాల్సిందేనని, కానీ తాను ముఖ్యమంత్రిని కలవడం పాపమైపోయిందని జగ్గారెడ్డి అన్నారు. సీఎంను కలిస్తే పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేయడం పరిపాటిగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు.

బంజారాల అభ్యున్నతికి పరితపించిన మహనీయుడు సేవాలాల్‌ మహారాజ్‌

సంగారెడ్డిరూరల్‌/మెదక్‌ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 15: బంజారాల అభ్యున్నతికి సంత్‌సేవాలాల్‌ మహారాజ్‌ పరితపించిన మహనీయుడని సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌ అన్నారు. సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ 284వ జయంతి సందర్భంగా బుధవారం సంగారెడ్డిలోని బాలాజీనగర్‌లో గల సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ ఆలయంలో కలెక్టర్‌ శరత్‌, జడ్పీచైర్‌పర్సన్‌ మంజుశ్రీ ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సేవాలాల్‌ మహారాజ్‌ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని చెప్పారు. ప్రభుత్వం సకల సౌకర్యాలతో ఏర్పాటు చేస్తున్న గిరిజన గురుకులాలు, కళాశాలల్లో తమ పిల్లలనే కాకుండా ఇతర పిల్లలను కూడా చేర్చేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. సంక్షేమ ఫలాలు ప్రతి గిరిజనుడికీ అందినపుడే సంత్‌సేవాలాల్‌ మహారాజ్‌ లక్ష్యం నెరవేరుతుందని కలెక్టర్‌ శరత్‌ స్పష్టం చేశారు. అనంతరం జడ్పీచైర్‌పర్సన్‌ మంజుశ్రీ మాట్లాడారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ జేడీ నర్సింహారావు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సేవాలాల్‌ గొప్ప సంస్కరణ వాది

సేవాలాల్‌ ప్రభోధనల సన్మార్గంలో అందరూ నడవాలని మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, మెదక్‌ కలెక్టర్‌ రాజర్షిషా కోరారు. సేవాలాల్‌ మహారాజ్‌ జయంతిని పురస్కరించుకుని మెదక్‌లోని ద్వారకానగర్‌లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ శేరి సుభా్‌షరెడ్డి, అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌తో కలిసి పాల్గొన్నారు. ముందుగా సేవాలాల్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అక్కడే ఏర్పాటు చేసిన హోమం వద్ద పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆకలిగొన్న వాడికి అన్నం పెట్టాలన్నదే సేవాలాల్‌ కీలక ప్రభోదనగా గుర్తు చేసుకున్నారు. గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం 10శాతం రిజర్వేషన్‌ కల్పించడంతో పాటు గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తండాలను పంచాయతీలుగా చేయడం ద్వారా అభివృద్ధి జరిగిందన్నారు. సొంత స్థలం ఉండి గుడిసెల్లో నివసిస్తున్న వారికి త్వరలో ఇళ్ల నిర్మాణానికి రూ.3లక్షల ఆర్థిక సహాయం అందించనున్నామని తెలిపారు. జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మహిళలతో కలిసి నృత్యం చేశారు. కార్యక్రమంలో డీఎంఅండ్‌హెచ్‌వో చందునాయక్‌, డీఈవో రమేశ్‌, ఆర్డీవో సాయిరాం, మున్సిపల్‌ చైర్మన్‌ తొడుపునూరి చంద్రపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-16T00:25:44+05:30 IST