కొన‘సాగు’తున్న మిషన్ భగీరథ పనులు
ABN , First Publish Date - 2023-09-22T00:13:11+05:30 IST
జిన్నారం, సెప్టెంబరు 21: పారిశ్రామిక మున్సిపాలిటీ బొల్లారంలో చేపట్టిన మిషన్ భగీరథ పనులు నిదానంగా సాగుతుండటంతో రహదారులపై తీసిన గోతులు స్థానికులకు ఇక్కట్లు కలిగిస్తున్నాయి.

ఏడాదిన్నరగా జరిగిన పనులు 50 శాతమే!
కాలనీలు, ప్రధాన రహదారులపై ఇబ్బందిగా మారిన సీసీ వ్యర్థాలు
జిన్నారం, సెప్టెంబరు 21: పారిశ్రామిక మున్సిపాలిటీ బొల్లారంలో చేపట్టిన మిషన్ భగీరథ పనులు నిదానంగా సాగుతుండటంతో రహదారులపై తీసిన గోతులు స్థానికులకు ఇక్కట్లు కలిగిస్తున్నాయి. దశాబ్దాలుగా నెలకొన్న నీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం మిషన్ భగీరథ కింద రూ.28.69 కోట్లు మంజూరీ చేయగా.. ఏడాదిన్నర క్రితం పనులు ప్రారంభించారు. కానీ నేటికీ 50శాతం మాత్రమే పూర్తికావటంతో నీటి సరఫరా కోసం జనాలకు నిరీక్షణ తప్పటం లేదు.
గోతులతో జనం ఇక్కట్లు
బొల్లారం మున్సిపాలిటీలో దశాబ్దాలుగా నెలకొన్న నీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం రూ.28.69 కోట్లను మంజూరుచేసింది. హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ బోర్డు ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. మున్సిపాలిటీలోని కొత్త బస్టాండ్ వద్ద భారీ వాటర్ ట్యాంక్, ఔటర్ రహదారి మోడల్ పాఠశాల వెనకాల ఓ రిజర్వాయర్ నిర్మాణ పనులు పూర్తి కావచ్చాయి. ఇక పట్టణంలో 20 కాలనీలలో 37.50 కి.మీల మేర కొత్త పైప్‌లైన్ వేసి ప్రతి నివాసానికి నీటి కనెక్షన్ ఇవ్వాల్సి ఉండగా నేటికీ కాలనీలు, ప్రధాన రహదారిలో సుమారు 50శాతం వరకు పైప్‌లైన్ వేశారు. గతేడాదిగా పైప్‌లైన్ కోసం కాలనీల్లో తవ్విన గోతులు స్థానికులకు తీవ్ర ఇక్కట్లుగా మారాయి. ఇటీవల ప్రధాన రహదారి గాంధీ విగ్రహం నుంచి పాత మున్సిపల్ కార్యాలయం వరకు సీసీరోడ్డును తవ్వి పూడ్చినా.. సీసీ వ్యర్థాలు ప్రమాదకరంగా మారాయి. కాగా మిషన్ భగీరథ పనులు నిదానంగా సాగడం పట్ల కౌన్సిలర్లు, ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
త్వరలోనే పనులు పూర్తి: ఏఈ
బొల్లారంలో చేపట్టిన మిషన్ భగీరథ పనులు త్వరలోనే పూర్తవుతాయి. ఇప్పటివరకు సుమారు 60 శాతం పనులు జరిగాయి. పంప్‌హౌస్ నిర్మాణ పనులు కూడా ప్రారంభిస్తాం. కాలనీల్లో పైపులైన్లు, నివాసాలకు కనెక్షన్ల పనులు చేపడుతాం. రోడ్ల తవ్వకాలు జరిగిన చోట వెంటనే పూడ్చివేతలు జరిగేలా పనులు చేస్తామని ఏఈ తెలిపారు.