Padma Reddy: మెదక్ టికెట్ మళ్లీ పద్మారెడ్డిదే
ABN , First Publish Date - 2023-05-11T03:22:03+05:30 IST
వచ్చే ఎన్నికల్లోనూ మెదక్ నుంచి బీఆర్‌ఎస్ టికెట్ పద్మారెడ్డికే వస్తుందని ఆమె భర్త, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి తెలిపారు. ఈ విషయంలో తమకు ఎటువంటి అనుమానమూ లేదని స్పష్టం చేశారు. తాము బీఆర్‌ఎ్‌సను వీడే ప్రసక్తే లేదని, పార్టీలో తాము చాలా ప్రశాంతంగా ఉన్నామని చెప్పారు.
ఈ విషయంలో ఎటువంటి అనుమానం లేదు
బీఆర్‌ఎ్‌సను వీడబోం.. పార్టీలో మాకేం బాధలేదు
అమిత్‌షాను ఇఫ్కో సమావేశంలో కలిశాను
డైరెక్టర్లందరితోపాటు నేనూ పుష్పగుచ్ఛం ఇచ్చాను
ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి స్పష్టీకరణ
మెదక్, మే 10 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఎన్నికల్లోనూ మెదక్ నుంచి బీఆర్‌ఎస్ టికెట్ పద్మారెడ్డికే వస్తుందని ఆమె భర్త, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి తెలిపారు. ఈ విషయంలో తమకు ఎటువంటి అనుమానమూ లేదని స్పష్టం చేశారు. తాము బీఆర్‌ఎ్‌సను వీడే ప్రసక్తే లేదని, పార్టీలో తాము చాలా ప్రశాంతంగా ఉన్నామని చెప్పారు. బుధవారం ‘పద్మా దేవేందర్‌రెడ్డికి పొగ’ అనే శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై దేవేందర్‌రెడ్డి స్పందించారు. ఢిల్లీలో జరిగిన ఇఫ్కో సమావేశంలో డైరెక్టర్ హోదాలో తాను కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిశానని, మర్యాదపూర్వకంగా పుష్పగుచ్ఛం అందించానని తెలిపారు. దీనికే కొంత మంది తనపై బట్టకాల్చి మీదేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలు వస్తే టికెట్ కోసం చాలా మంది ప్రయత్నిస్తారని చెప్పారు.
2004లో రామాయంపేట నుంచి తాము మొదటిసారిగా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు టికెట్ కోసం 12 మంది ప్రయత్నించారని తెలిపారు. అయినా.. బీఆర్‌ఎస్ (అప్పుడు టీఆర్‌ఎస్) టికెట్ మాత్రం తన భార్య పద్మారెడ్డికే దక్కిందని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆమెకే టికెట్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇఫ్కో బోర్డ్ మీటింగ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను డైరెక్టర్లందరూ మర్యాదపూర్వకంగా కలిశారని తెలిపారు. వారిలో కాంగ్రెస్, డీఎంకే, వైసీపీ తదితర పార్టీల వారు కూడా ఉన్నారని పేర్కొన్నారు. తమపై కొంత మంది చేస్తున్న చౌకబారు ప్రచారాన్ని తాము పట్టించుకోబోమన్నారు.