మార్కెట్ల ఏర్పాటుకు మీనమేషాలు

ABN , First Publish Date - 2023-03-25T23:57:31+05:30 IST

మత్స్య పరిశ్రమను ప్రోత్సహించి మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నా ఆశించిన ఫలితం రావడం లేదు.

మార్కెట్ల ఏర్పాటుకు మీనమేషాలు
మెదక్‌లో అసంపూర్తిగా ఉన్న చేపల మార్కెట్‌

చెరువుల్లో చేపలు దళారుల పాలు

మార్కెట్‌ సౌకర్యం లేక గంపగుత్తగా విక్రయం

మెదక్‌ అర్బన్‌, మార్చి 25: మత్స్య పరిశ్రమను ప్రోత్సహించి మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నా ఆశించిన ఫలితం రావడం లేదు. ఏటా మత్స్యకార సంఘాలకు ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తుండడంతో జిల్లావ్యాప్తంగా చేపల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. కానీ సరైన మార్కెటింగ్‌ సౌకర్యం లేక చేపల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారు. వారి నిస్సహాయతను అవకాశంగా మలచుకున్న దళారులు మత్స్య సొసైటీలను తమ గుప్పిట్లో పెట్టుకొని వేలం పాటల ద్వారా చెరువులు దక్కించుకుంటున్నారు. దళారులు గడిస్తుంటే.. మత్స్యకారులు నష్టపోతున్నారు. ఎన్‌ఎ్‌ఫడీబీ ద్వారా చేపల మార్కెట్ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నా ఆ దిశగా అడుగులు పడడం లేదు. మహిళ మత్స్యకారులు చిన్న చిన్న యూనిట్లు నెలకొల్పేలా మత్స్యశాఖ ప్రోత్సాహం అందిస్తుంది. కానీ చేపలను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్మినా గిట్టుబాట ధర రావడం లేదు. రవాణా ఖర్చులు భరించలేని వారు స్థానికంగానే దళారులకు విక్రయిస్తున్నారు.

చేప పిల్లల పంపిణీతో సరి

మెదక్‌ జిల్లా వ్యాప్తంగా 279 వరకు మత్స్యకార సహకార సంఘాలు ఉన్నాయి. వీటిల్లో 16,200 మంది మత్స్యకారులు మీనాల పెంపకంతో ఉపాధి పొందుతున్నారు. గతంలో చేపల ఉత్పత్తిపై పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను అందిస్తుండడంతో ఇప్పుడు ప్రత్యేకంగా దృష్టి సారించారు. జిల్లాలో 3 ఫిష్‌ ట్యాంకులు, రిజర్వాయర్లు, ప్రాజెక్టులతో సహా 1617 చెరువులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 5 కోట్ల చేప పిల్లలను వదిలారు. ఏటా చేపల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతోంది.

అసంపూర్తిగా మార్కెట్ల నిర్మాణం

జిల్లాలో చేపల మార్కెట్ల ఏర్పాట్లపై సర్కార్‌ దృష్టి పెట్టడం లేదు. 2011లో జిల్లాలోని మెదక్‌, నర్సాపూర్‌, గోమారం, తూప్రాన్‌లో మార్కెట్ల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించారు. కానీ మెదక్‌, తూప్రాన్‌లో మార్కెట్‌ నిర్మాణాలు అసంపూర్తిగా ఉండగా, నర్సాపూర్‌, గోమారం మార్కెట్లు పట్టణాలకు దూరంగా ఉండడం వల్ల నిరుపయోగంగా ఉన్నాయి. నాలుగేళ్ల క్రితం జిల్లా కేంద్రంలో హోల్‌సేల్‌ మార్కెట్‌ నిర్మాణానికి ఎకరా స్థలం కేటాయించి వదిలేశారు. ఎక్కడా కూడా మార్కెట్లు లేవు. చాలా సంఘాలు చెరువుల్లో ఉత్పత్తయిన చేపలను దళారులకు గుత్తగా విక్రయిస్తున్నారు. ఫలితంగా నష్టాలు ఎక్కువగా వస్తున్నాయని మత్స్యకారులు వాపోతున్నారు. ప్రత్యేకంగా మార్కెట్లు నిర్మిస్తే విక్రయాలకు అవకాశాలు పెరిగి మెరుగైన ఉపాధి పొంది ఆర్థికంగా బలోపేతమవుతామని పలువురు మత్య్సకారులు చెబుతున్నారు. అసంపూర్తి మార్కెట్ల నిర్మాణం, జిల్లా కేంద్రంలో హోల్‌సేల్‌ చేపల మార్కెట్‌ స్థల కేటాయుంపుపై జిల్లా మత్స్యశాఖ అధికారి రజినిని వివరణ కోరగా.. రేపు ఫైల్‌ చూసి చెబుతామని సమాధానం ఇచ్చారు.

Updated Date - 2023-03-25T23:57:31+05:30 IST