‘ఉపాధి’ నిధులతో అంతర్గతరోడ్లకు మహర్దశ

ABN , First Publish Date - 2023-03-25T23:55:49+05:30 IST

2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి హుస్నాబాద్‌ మండలంలో 23, అక్కన్నపేట మండలంలో 33 సిమెంటు రహదారుల నిర్మాణాలకు రూ.4.10 కోట్ల నిధులు మంజూరయ్యాయి.

‘ఉపాధి’ నిధులతో అంతర్గతరోడ్లకు మహర్దశ

హుస్నాబాద్‌, అక్కన్నపేట మండలాలకు రూ.4.10 కోట్లు మంజూరు

మార్చి నెలాఖరులోగా పనులు పూర్తి చేస్తేనే బిల్లులు

ఇప్పటికీ ప్రారంభం కాని పనులపై సర్పంచుల్లో అయోమయం

హుస్నాబాద్‌రూరల్‌, మార్చి 25 : పల్లెదారులకు సీసీ రోడ్లు మంజూరు చేసేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రతిపాదనలు పంపించడంతో ఫిబ్రవరిలో ఉపాధిహామీ పథకం ద్వారా నిధులు మంజూరయ్యాయి. దీంతో పల్లె రహదారులకు మహర్దశ కలిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి హుస్నాబాద్‌ మండలంలో 23, అక్కన్నపేట మండలంలో 33 సిమెంటు రహదారుల నిర్మాణాలకు రూ.4.10 కోట్ల నిధులు మంజూరయ్యాయి.

శాశ్వత పనులకు ప్రాధాన్యం

అంతర్గత రహదారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం ఉపాధిహామీ పథకంలో కూలీలకు 40 శాతం నిధులను, సామగ్రికి వాటాగా 60 శాతం కేటాయిస్తూ సీసీ రోడ్ల నిర్మాణాలను చేపట్టింది. ఈ పనుల నిర్వాహణకుగాను జిల్లాస్థాయిలో కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి కలెక్టర్‌ చైర్మన్‌గా, జిల్లా పంచాయతీ అధికారి కన్వీనర్‌గా, జిల్లా పంచాయతీ రాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు సభ్యులుగా వ్యవహరిస్తుండగా మండల స్థాయిలో ఎంపీడీవో, పంచాయతీ రాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారులు కీలకపాత్ర పోషిస్తున్నారు. పంచాయతీ తీర్మానంతో పనులు చేయాల్సి ఉండడంతో దాదాపు పనులను సర్పంచులు పర్సంటేజీలు తీసుకుని కాంట్రాక్టర్లకు అప్పజెప్పుతున్నట్లు తెలిసింది. దీంతో పనుల్లో నాణ్యత లోపించే అవకాశం ఎక్కువగా ఉంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. సమయం తక్కువగా ఉండడంతో కాంట్రాక్టర్లు పనులను హడావిడిగా చేస్తున్నారు. దీంతో ఇంజనీరింగ్‌ అధికారుల పర్యవేక్షణ కొరవడుతోందని, నాణ్యత లోపించి, క్యూరింగ్‌ లేక ఏడాదిలోపే రోడ్లకు పగుళ్లు ఏర్పడే అవకాశం ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

గడువులోగా పనులు కష్టమే!

అయితే ఈ రహదారుల పనులను మార్చి నెలాఖరులోగా పూర్తిచేయాలని గడువు విధించారు. అభివృద్ధి పనులకు నిధులు కోసం ఎదురుచూసే అధికారులు, ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉన్న వాటిని ఖర్చు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. మండలంలో మంజూరైన పనులు ఎవరు చేస్తారనే విషయంలోనూ సర్పంచులు, అధికారులు సమాలోచనలో ఉన్నారు. మార్చి నెల గడువు తరుముకొస్తున్నా నేటికి కొన్ని గ్రామాల్లో పనులు ప్రారంభం కాలేదు. ఈ నెల దాటితే చేసిన పనులకు బిల్లులు వచ్చే అవకాశాలు లేవు. పంచాయతీ తీర్మానంతో నామినేషన్‌ పద్ధతిలో పనులు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ గ్రామాల్లో రహదారుల పనులు 80శాతం మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన 20శాతం పనులను పూర్తి చేయించేందుకు అధికారులు తలపట్టుకుంటున్నారు. అయితే మంజూరైన పనులు గడువులోగా పూర్తి చేయకపోతే నిధులు వెనక్కి వెళ్లే అవకాశం ఉందని సర్పంచులు అయోమయంలో పడ్డారు.

గడువులోగా ప్రారంభించిన పనులకు ఎలాంటి ఇబ్బంది లేదు

ఉపాధి హామీ ద్వారా మంజూరైన సీసీ రోడ్ల నిర్మాణాల్లో మార్చిలోగా చేపట్టిన పనులకు ఎలాంటి ఇబ్బంది లేదు. గడువు తర్వాత ప్రారంభించే పనులకు మాత్రం బిల్లుల చెల్లింపులలో జాప్యం జరిగే అవకాశం ఉంది. అయితే నాణ్యతలో ఎలాంటి లోపాలు లేకుండా పర్యవేక్షణ చేపట్టి పనులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. గడువు మీరిన తర్వాత పనులు చేసి ఇబ్బందులు పడొద్దని సర్పంచులను మోటివేషన్‌ చేస్తున్నాం.

- స్నేహ, పీఆర్‌ ఏఈ

Updated Date - 2023-03-25T23:55:49+05:30 IST