ఏడు నెలలుగా ఎడమొహమే!
ABN , First Publish Date - 2023-05-02T23:49:20+05:30 IST
సంగారెడ్డి గ్రేడ్‌వన్ మున్సిపాలిటీ పాలకవర్గంలో ఏర్పడిన గ్రూపు తగాదాలు పట్టణాభివృద్ధికి ఆటంకంగా మారాయి
పాలకవర్గ సభ్యుల మధ్య కుదరని సయోధ్య
జరగని మున్సిపల్ సమావేశాలు
కుంటుపడిన అభివృద్ధి
సంగారెడ్డి మున్సిపాలిటీలో ఇదీ పరిస్థితి
సంగారెడ్డి టౌన్, మే 2 : సంగారెడ్డి గ్రేడ్‌వన్ మున్సిపాలిటీ పాలకవర్గంలో ఏర్పడిన గ్రూపు తగాదాలు పట్టణాభివృద్ధికి ఆటంకంగా మారాయి. అధికార పార్టీకి చెందిన మున్సిపల్ చైర్‌పర్సన్ బొంగుల విజయలక్ష్మితో అదే పార్టీకి చెందిన మెజార్టీ కౌన్సిలర్లకు నెలకొన్న విభేదాలు ఇప్పట్లో సమసిపోయేలా లేవు. ఈ కారణంగా జిల్లాకేంద్రంలో సమస్యలు పేరుకుపోయాయి.
గతేడాది నుంచి ఇదే పరిస్థితి
రెండువర్గాల మధ్య సయోధ్య కుదరకపోవడంతో నెలకు ఒక్కసారి జరగాల్సిన మున్సిపల్ సాధారణ సర్వసభ్య సమావేశాలు 7 నెలలుగా జరగడం లేదు. చివరిసారిగా గత సంవత్సరం అక్టోబరు నెలలో మున్సిపల్ సాధారణ సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ శరత్ ఒత్తిడి మేరకు మార్చి నెలాఖరులో బడ్జెట్ సమావేశం మాత్రం నిర్వహించారు. అప్పట్లో సాధారణ సర్వసభ్య సమావేశాలు ఎందుకు జరపడం లేదని పలువురు కౌన్సిలర్లు అసహనం వ్యక్తం చేశారు. ఇక నుంచి క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తామని చైర్‌పర్సన్, కమిషనర్ హామీ ఇచ్చారు. ఈమేరకు ఏప్రిల్ 8న సమావేశం నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ ఇరువర్గాల మధ్య విభేదాలు కారణంగా వాయిదా వేసినట్టు తెలుస్తున్నది.
పేరుకుపోయిన సమస్యలు
నెలనెలా నిర్వహించాల్సిన సమావేశాలు ఏడు నెలలుగా నిర్వహించకపోవడంతో పట్టణంలో సమస్యలు పేరుకుపోయాయి. ప్రజలు ఎన్నుకున్న పాలకవర్గ సభ్యులు పట్టించుకోకపోవడంతో అధికారుల పర్యవేక్షణ కరువైంది. పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా మారింది. చెత్త సేకరణ సక్రమంగా జరగడం లేదు. వీధి దీపాలు వెలగడం లేదు. రూ.50 కోట్లతో చేపట్టిన మురికికాల్వలు, రోడ్ల పనులు మందకొడిగా సాగుతున్నాయి.
సయోధ్య కుదిరేనా?
కొంత కాలంగా మున్సిపల్ చైర్‌పర్సన్, కౌన్సిలర్ల మధ్య నెలకొన్న విభేదాలు తారాస్థాయికి చేరాయి. చైర్‌పర్సన్ బొంగుల విజయలక్ష్మిపై సొంత పార్టీకి చెందిన కౌన్సిలర్లు జనవరిలో అవిశ్వాస తీర్మానం నోటీసులు జిల్లా కలెక్టర్‌కు అందజేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి చైర్‌పర్సన్‌తో మెజార్టీ కౌన్సిలర్లు దూరంగా ఉంటున్నారు. వీరి మధ్య సయోధ్య కుదరకపోతే జనరల్ బాడీ మీటింగ్ ప్రశాంతంగా జరగదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హెచ్‌డీసీ చైర్మన్ చింతాప్రభాకర్ జోక్యం చేసుకుని చైర్‌పర్సన్, కౌన్సిలర్ల మధ్య ఏర్పడిన విభేదాలను తొలగించాలని అధికార పార్టీ నాయకులు, కౌన్సిలర్లు కోరుతున్నారు.