కొత్త ఓటర్ల నమోదుకు చివరి అవకాశం
ABN , First Publish Date - 2023-10-16T23:41:41+05:30 IST
కొత్తగా ఓటర్ల నమోదుకు కేంద్ర ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది.
31 వరకు గడువు పొడిగింపు
ఫారం-6కు మాత్రమే వర్తింపు
సిద్దిపేట అగ్రికల్చర్, అక్టోబరు 16 : కొత్తగా ఓటర్ల నమోదుకు కేంద్ర ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. ఈనెల 9వ తేదీన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా అక్టోబర్ 4న ఓటరు జాబితాను ప్రకటించారు. షెడ్యూల్ వచ్చిన తర్వాత కూడా కొత్త ఓటరు నమోదుకు చివరి అవకాశం కల్పించింది. కేవలం ఫారం-6 ద్వారా కొత్త ఓటర్లు దరఖాస్తు చేసుకోవచ్చు.
నవంబర్ 30న రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే యంత్రాంగం సెప్టెంబర్ 19 వరకు ఓటరు నమోదుకు, మార్పులు చేర్పులకు అవకాశమిచ్చింది. ఆ దరఖాస్తులు అన్నింటినీ పరిగణలోకి తీసుకొని అక్టోబర్ 4న తుది ఓటరు జాబితాను విడుదల చేసింది. అయినప్పటికీ, షెడ్యూలు వచ్చిన తర్వాత కూడా చివరి అవకాశంగా ఓటరు నమోదుకు మళ్లీ గడువు పెంచింది. ఈ గడువులో ఫారం 7, 8ల ద్వారా మార్పులు, చేర్పులకు అవకాశం ఇవ్వలేదు. ఫారం-6 ద్వారా ఆన్‌లైన్‌లో గానీ, నేరుగా బూత్ లెవల్ అధికారుల ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. అక్టోబర్ 4న విడుదలైన ఓటరు లిస్టు పోలింగ్ కేంద్రాల వారీగా ఉండగా, ఇప్పుడు కొత్తగా నమోదయ్యే వారి లిస్టు సప్లిమెంటుగా ప్రచురిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. 2023 అక్టోబర్ 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు 31వ తేదీ వరకు ఆధార్‌కార్డు, వయసు ధ్రువీకరణ పత్రం అందజేస్తే మరో నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకొనే సువర్ణావకాశాన్ని పొందవచ్చు. జిల్లాలో మొత్తం 9,25,398 మంది ఓటర్లున్నారు. ఇందులో పురుషులు 4,57,178 మంది కాగా, మహిళలు 4,68,140 మంది, ఇతరులు 80 ఉన్నారు. ప్రస్తుతం ఓటరు నమోదుకు గడువు పెంచడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.