ఆన్‌లైన్‌లో కొమురవెల్లి మల్లన్న సేవలు
ABN , First Publish Date - 2023-02-21T00:14:10+05:30 IST
కొమురవెల్లి మల్లన్న భక్తులు ఆలయానికి వచ్చి ఆర్జితసేవలు, మొక్కుబడుల టికెట్ల కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి ఇబ్బందులు పడకుండా ఇక ఇంటి నుంచే సులువుగా టికెట్లు పొందొచ్చు.
టీ-యాప్ పోలియోలో 12 రకాల సేవా టికెట్ల బుకింగ్‌కు అవకాశం
భక్తులకు తప్పనున్న తిప్పలు
చేర్యాల, ఫిబ్రవరి 20: కొమురవెల్లి మల్లన్న భక్తులు ఆలయానికి వచ్చి ఆర్జితసేవలు, మొక్కుబడుల టికెట్ల కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి ఇబ్బందులు పడకుండా ఇక ఇంటి నుంచే సులువుగా టికెట్లు పొందొచ్చు. గతంలో దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో సేవలను పొందుపరిచినప్పటికీ సాంకేతిక లోపాల వలన కొన్నాళ్ల క్రితం నిలిచిపోయాయి. ఇటీవల మల్లన్న ఆలయానికి వచ్చిన దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్ ఆరా తీయగా, ఆన్‌లైన్‌లో సేవలు రాకపోవడంతో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. రాష్ట్ర ఈఎ్‌సడీ అధికారులతో సంప్రదించి టీ-యాప్ పోలియో యాప్‌లో నమోదు చేయించారు. సాధారణ రోజుల్లో అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ జాతర (మూడునెలల కాలంలో) సమయంలో వేలాదిగా భక్తులు తరలివస్తుండటంతో ఆర్జితసేవలు, మొక్కుబడుల టికెట్లకోసం క్యూలైన్లలో బారులు తీరి ఇబ్బందులు పడుతున్నారు. ఈక్రమంలో ప్రస్తుతానికి 12రకాల సేవలు అభిషేకం, చలుకపట్నం, కుంకుమార్చన, ముఖమండపపట్నం, నజరుపట్నం, శాశ్వత కల్యాణం, శాశ్వత పూజ, స్వామివారి నిత్యకల్యాణం, తిరుగుడు కోడె, వీవీఐపీ దర్శనం, ఎల్లమ్మ అర్చన, ఎల్లమ్మ పట్నం సేవలను టీ-యాప్ పోలియోలో పొందుపరిచారు. భక్తులు సులువుగా బుక్‌చేసుకుంటూ నేరు గా ఆలయానికి చేరుకుని మొక్కులు తీర్చుకుని దర్శించుంటున్నారు.
మిగతావి కూడా ఆన్‌లైన్ చేయాలని డిమాండ్
ఆర్జితసేవలు, మొక్కుబడులనే కాకుండా దర్శనాలు, వసతిగదుల అద్దె, ప్రసాద విక్రయ టికెట్లతో పాటు కార్యాలయ కార్యకలాపాలను కూడా ఆన్‌లైన్ చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో దర్శనాలు, ప్రసాదం, పట్నాల టికెట్లను రీ-సైక్లింగ్ చేస్తూ ఆలయ ఉద్యోగులతో పాటు ప్రైవేటు బ్యాంకు ఉద్యోగులు పట్టుబడ్డారు. పలువురిపై కేసులు కూడా నమోదు చేశారు. ఈ క్రమంలో అవినీతికి ఆస్కారం లేకుండా మిగతాసేవల టికెట్లను కూడా ఆన్‌లైన్ చేయాలని కోరుతున్నారు. మిగతా సేవలు, కార్యకలాపాలనన్నింటిని కూడా ఆన్‌లైన్ చేసే విషయమై ఉన్నతాధికారులతో సంప్రదిస్తున్నామని ఆలయ ఈవో బాలాజీ శర్మ అన్నారు.