కేసీఆర్ దీక్షాదక్షతతోనే కాళేశ్వర జలాలు
ABN , First Publish Date - 2023-02-17T23:54:30+05:30 IST
సీఎం కేసీఆర్ అలుపెరుగని దీక్షాదక్షతతోనే నాడు తెలంగాణ సాధించారని, నేడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పంటపొలాలకు గోదావరి నీళ్లను అందిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఓర్వలేక విమర్శిస్తున్న ప్రతిపక్షాలు కూడవెళ్లి వాగులో
పారుతున్న గోదావరి జలాలను చూడాలి : మంత్రి హరీశ్‌రావు
తొగుట, ఫిబ్రవరి 17: సీఎం కేసీఆర్ అలుపెరుగని దీక్షాదక్షతతోనే నాడు తెలంగాణ సాధించారని, నేడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పంటపొలాలకు గోదావరి నీళ్లను అందిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం తొగుట మండలంలోని తుక్కాపూర్ వద్ద నిర్మించిన మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి దుబ్బాక నియోజకవర్గానికి నీరందించే ప్రధాన కాలువకు ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి నీళ్లను వదిలిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్ర ఫలితం ద్వారానే నేడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిండు కరువులో గోదావరి జలాలను చెరువు, కుంటల్లోకి విడుచుకుంటున్నామని స్పష్టం చేశారు. ఒకప్పుడు కరువు, కాటకాలతో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ ప్రాంతం నేడు గోదావరి జలాలతో సస్యశ్యామలం అవుతుంటే ఓర్వలేకనే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరాకు నీళ్లు రాలేవంటున్న ప్రతిపక్ష నాయకులు కూడవెళ్లి వాగులో పారుతున్న గోదావరి జలాలను చూసి మాట్లాడాలన్నారు. గ్లోబల్స్ ప్రచారాన్ని ప్రజలు నమ్మరని, ఇప్పటికైనా ప్రతిపక్షాలు వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు. 12వ ప్యాకేజీ ద్వారా దుబ్బాక, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో లక్షా25వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని హరీశ్‌రావు తెలియజేశారు. కాలువ కింద 257 చెరువులు, కుంటలు ఉండగా, 91 చెరువులు, కుంటలకు మాత్రమే నీళ్లు విడుదల చేస్తున్నామని వెల్లడించారు. మిగతా చెరువు, కుంటల్లోకి కాలువల నిర్మాణం కోసం ప్రజాప్రతినిధులు సహకరిచాలని ఆయన కోరారు. మొన్ననే మన ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి కూడవెల్లికి, హల్దీవాగులోకి మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ నుంచి నీళ్లను విడుదల చేయడం జరిగిందన్నారు. నేడు కూడవెల్లి నీటి ప్రవాహంతో పండుగ వాతావరణం నెలకొన్నదన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో కేసీఆర్ చదువుకున్న పాఠశాల పక్క నుంచి గోదావరి నీళ్లు వెళ్లాలని, నేడు నీళ్లను విడుదల చేశామన్నారు. కరెంటు, నీళ్లు లేనినాడు ఎన్ని కష్టాలు పడ్డామో మీకు తెలుసు కాబట్టి నీటిని, విద్యుత్‌ను ఆదా చేయాలని సూచించారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డితో కలిసి సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా కేక్‌ను కట్ చేశారు. అంతకుముందు దుబ్బాక కెనాల్ కాలువలో గోదావరి జలాలకు పూలు చల్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ రోజాశర్మ, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ హరేరామ్, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
గజ్వేల్ దశ, దిశను మార్చిన నేత కేసీఆర్
గజ్వేల్, ఫిబ్రవరి 17: గజ్వేల్ నియోజకవర్గ దశ, దిశను మార్చిన నేత సీఎం కేసీఆర్ అని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రిమ్మనగూడ జంక్షన్ వద్ద రింగ్‌రోడ్డుపై మొక్కను నాటి ప్లాంటేషన్‌ను ప్రారంభించారు. అనంతరం సమీకృత మార్కెట్‌లో ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ సైకత శిల్పాన్ని ఆవిష్కరించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్‌ను కట్ చేసి, స్పోర్ట్స్‌హబ్‌లో టీఎ్‌సఎ్‌ఫడీసీ సహకారంతో 60 మంది దివ్యాంగులకు స్కూటీలను అందజేశారు. అనంతరం కేసీఆర్ జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్న క్రీడాపోటీలను ప్రారంభించి మాట్లాడారు. 15 రోజుల్లో రింగ్‌రోడ్డును పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కొండపోచమ్మ, మల్లన్నసాగర్ రిజర్వాయర్లు కట్టి, కాలువలు, చెరువులు, కుంటలు నింపామన్నారు. జలసిరులతో ఈ ప్రాంతమంతా సస్యశ్యామలమైందన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, జడ్పీచైర్‌పర్సన్ రోజారాధాకృష్ణశర్మ, ఎఫ్‌ఢీసీ చైర్మన్ వంటేరు ప్రతా్‌పరెడ్డి, అదనపు కలెక్టర్ ముజామిల్‌ఖాన్, ‘గడ’ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, ఆర్డీవో విజయేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
కొండపోచమ్మసాగర్ నుంచి రామాయంపేట కాలువలోకి గోదావరి జలాలు విడుదల
వర్గల్, ఫిబ్రవరి 17 : కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రంలో పంటపొలాలు సస్యశ్యామలం అయ్యాయని, ఇదంతా సీఎం కేసీఆర్ సంకల్పమని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం వర్గల్ మండలం సింగాయిపల్లి వద్ద కొండపోచమ్మసాగర్ కెనాల్ నుంచి మెదక్ జిల్లా రామాయంపేట కాలువలోకి నీళ్లు వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారన్నారు. ఎండకాలం, వానాకాలం అనే తేడా లేకుండా రైతాంగానికి ఎల్లవేళలా సాగునీరు అందిస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో తాగు, సాగు నీటి సమస్యలకు చెక్ పడిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బాలుయాదవ్, ఎంపీపీ లతారమేశ్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ రామకృష్ణరెడ్డి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు వెంకటరెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.