ఉద్యోగ భద్రత కావాలి.. కనీస వేతనం ఇవ్వాలి
ABN , First Publish Date - 2023-05-26T23:37:22+05:30 IST
రాష్ట్రంలోని సెర్ఫ్ సంస్థలో 20 ఏళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో వీవోఏలుగా పనిచేస్తున్నప్పటికీ తమకు గుర్తింపు, భద్రత లేకపోవడంతో వీవోఏలు సమ్మెబాట పట్టారు.

సమ్మెలో వీవోఏలు
ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆవేదన
సమ్మెకు మద్దతు తెలిపిన కార్మిక సంఘాలు
సిద్దిపేట అర్బన్, మే 26: రాష్ట్రంలోని సెర్ఫ్ సంస్థలో 20 ఏళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో వీవోఏలుగా పనిచేస్తున్నప్పటికీ తమకు గుర్తింపు, భద్రత లేకపోవడంతో వీవోఏలు సమ్మెబాట పట్టారు. సిద్దిపేటఅర్బన్, రూరల్ మండలాలకు సంబంధించి వీవోఏలు మూడు రోజులుగా సమ్మె చేస్తున్నారు. గ్రామాల్లో మహిళా సంఘాలను బలోపేతం చేయడానికి తమ వంతు కృషి చేస్తూ, మహిళలకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను రుణాలను ఇప్పిస్తూ బ్యాంకుకు తిరిగి రుణాలను కట్టించడంలోనూ వీవోఏలు కీలక పాత్ర పోషిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో అన్ని తామే అయ్యి ముందుండి చూసుకుంటున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తమకు తగిన గుర్తింపు రావడం లేదని వీవోఏలు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వాలు తమ శ్రమను గుర్తించి కనీస గౌరవ వేతనాన్ని అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
వీవోఏల డిమాండ్లు
వీవోఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. కనీస వేతనాలు అమలు చేయాలి .రూ.10లక్షల సాధారణ ఆరోగ్యభీమా అందించాలి. ఆన్‌లైన్ పనులను రద్దు చేయాలి. సెర్ఫ్ నుంచి ఐడీ కార్డులు, యూనిఫాం ఇవ్వాలి. మహిళా సంఘాల సభ్యులకు రూ.5లక్షల బీమా సౌకర్యం కల్పించాలని తదితర డిమాండ్లతో సమ్మెకు దిగారు. శుక్రవారం కూడా సిద్దిపేటలో వివోఏలు నిరవధిక సమ్మెచేపట్టారు. సమ్మెకు సీఐటీయూ ఆధ్వర్యంలో సంఘీభావం ప్రకటించారు.
సమ్మెకు సీఐటీయూ సంపూర్ణ మద్దతు
-గోపాలస్వామి, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి కనీస వేతనం ఉద్యోగ భద్రత కల్పించాలని వివోఏలు చేస్తున్న సమ్మెకు సీఐటీయూ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. ప్రభుత్వం వారిని గుర్తించి కనీస వేతనం ఉద్యోగ భద్రత ఇచ్చేవరకు జరిగే ప్రతి పోరాటానికి సీఐటీయూ అండగా ఉంటుంది. వీవోఏలతో వెట్టి చాకిరి చేయించుకుంటూ కనీస గుర్తింపు ఇవ్వడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. సమస్యను పరిష్కరించి సానుకూలంగా వ్యవహరించాలి లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతాం
మాకు గుర్తింపు లేదు
- లావణ్య, వీవోఏ
వీవోఏలుగా పనిచేస్తూ గ్రామాల్లో మహిళా సంఘాలను ఏర్పాటు చేయడంతో పాటు వారికి రుణాలు ఇప్పిస్తున్నాం. తిరిగి ఆ రుణాలను బ్యాంకులకు కట్టిస్తున్నాం. ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని పనిచేస్తున్నాం. ఎన్ని చేస్తున్నా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించడం లేదు. గౌరవ వేతనం ఇవ్వాలని కోరుతున్నాం.
ఉద్యోగ భద్రత కల్పించాలి
-చంద్రకళ, వీవోఏ
వీవోఏలుగా గ్రామాల్లో పనిచేస్తూ ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ ముందుకు సాగుతున్నాం. మాకు ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాన్ని అమలు చేయమని అడుగుతున్నాం.