జనగామ టికెట్‌ హోల్డ్‌

ABN , First Publish Date - 2023-08-22T01:19:30+05:30 IST

జనగామ బీఆర్‌ఎస్‌ టికెట్‌పై సస్పెన్స్‌ కొనసాగుతున్నది. కేసీఆర్‌ సోమవారం బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితా ప్రకటించినప్పటికీ జనగామ స్థానాన్ని పెండింగ్‌ పెట్టారు.

జనగామ టికెట్‌ హోల్డ్‌

చేర్యాల, ఆగస్టు 21 : జనగామ బీఆర్‌ఎస్‌ టికెట్‌పై సస్పెన్స్‌ కొనసాగుతున్నది. కేసీఆర్‌ సోమవారం బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితా ప్రకటించినప్పటికీ జనగామ స్థానాన్ని పెండింగ్‌ పెట్టారు. దీంతో సిట్టింగ్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆలోచనలో పడిపోగా, అతడి వర్గీయులు నైరాశ్యానికి లోనయ్యారు. జనగామ స్థానంపై ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివా్‌సరెడ్డి ఆశించి ఎవరికి వారుగా వ్యవహరిస్తుండటంతో వివాదాలు తలెత్తాయి. దీంతో నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా పరిశీలన కోసం పెండింగ్‌ పెట్టారు. పార్టీ అంచనాలు, సర్వేలు, అంతర్గత అవగాహనతో వడబోత చేపట్టి మరో రెండు, మూడురోజులలో నిర్ణయం తీసుకుని అభ్యర్థిని వెల్లడిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించిన క్రమంలో జనగామ టికెట్‌ ఎవరికి దక్కుతుందోనని ఉత్కంఠ నెలకొంది. ముత్తిరెడ్డి తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ఈ విషయమై సోమవారం ఎమ్మెల్సీ కవితను ఆయన కలిసినట్లు తెలిసింది. అయితే సీఎం కేసీఆర్‌పై తనకు సంపూర్ణ నమ్మకం ఉందని ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన ఆదేశానుసారం నడుకుంటానని తెలిపారు.

సీపీఐకి హుస్నాబాద్‌ సీటు లేనట్లే!

హుస్నాబాద్‌: బీఆర్‌ఎస్‌, కమ్యూనిస్టుల పొత్తుల్లో హుస్నాబాద్‌ నియోజవర్గ సీటు ఎవరికి దక్కుతుందనే సందిగ్ధతకు సీఎం కేసీఆర్‌ తెరదించారు. సోమవారం విడుదల చేసిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తొలిజాబితాలో ఈ నియోజకవర్గ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే వొడితెల సతీ్‌షకుమార్‌ను ప్రకటించారు. దీంతో మొదటి నుంచి సీపీఐ ఆశీస్తున్న ఈ సీటు ఇక లేనట్లేనని వెల్లడి చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌, కమ్యూనిస్టుల మధ్య కుదిరిన స్నేహం రాబోయే ఎన్నికల వరకూ ఉంటుందని భావించారు. అందులో భాగంగా సీపీఐకి రెండు, మూడు సీట్లు ఇచ్చినా అందులో రాష్ట్రంలో పార్టీకి బలమున్న హుస్నాబాద్‌ నియోజకవర్గం తప్పకుండా ఉంటుందని ఆశించారు. కానీ మొదటి జాబితాలోనే హుస్నాబాద్‌ అభ్యర్థిగా సతీ్‌షకుమార్‌ పేరు ఉండటంతో ఈ రెండు పార్టీల మధ్య పొత్తులుంటాయా లేవా అనే సందిగ్ధం ఏర్పడింది. పొత్తులు ఉన్నా లేకున్నా ఇక్కడ సీపీఐ ఒంటరిగా పోటీ చేసే అవకాశాలున్నాయని ఆ పార్టీ నాయకులు బాహటంగా పేర్కొంటున్నారు.

Updated Date - 2023-08-22T01:19:30+05:30 IST