అచ్చం తిరుమల మాదిరే ఉండాలి
ABN , First Publish Date - 2023-07-21T00:15:38+05:30 IST
అన్ని వసతులతో నిర్మాణం చేపట్టాలి శ్రావణమాసంలో శంకుస్థాపన జరిగేలా చూడాలి సిద్దిపేటలో వెంకన్న గుడిపై అధికారులకు మంత్రి హరీశ్‌రావు సూచనలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష
సిద్దిపేట టౌన్, జూలై 20: కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలిచే తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి ఆలయ వైభవం ఉట్టిపడేలా సిద్దిపేటలో ఆలయ నిర్మాణం చేపట్టనున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి ఆర్‌ఆండ్‌బీ కార్యదర్శి శ్రీనివాసరాజుతో కలిసి తిరుపతిలో ఉన్న టీటీడీ ఇంజనీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సిద్దిపేటలో టీటీడీ ఆలయ నమూనాను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఇటీవల సిద్దిపేటలో టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు పర్యటించి ఆలయ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని పరిశీలించి, కొలతలు తీసుకున్నారని, దానికి అనుగుణంగా ఆలయ నిర్మాణ నమునా, డిజైన్‌ను రూపొందించినట్లు చెప్పారు. ఆలయ గర్భగుడి మొదలుకొని ఇతర నిర్మాణాలపై పలు సూచనలు చేశారు. తిరుపతి వేంకటేశ్వర స్వామి ఆలయ మాదిరిగానే సిద్దిపేటలో ఆలయం నిర్మించాలని, చుట్టూ ప్రాకారం భక్తులు కలియ తిరిగేలా ఉండాలని సూచించారు. తిరుపతి వైభవం ఉట్టిపడేలా ఉండాలని చెప్పారు. అదేవిధంగా ఆలయ నిర్మాణ పనుల శంకుస్థాపన వచ్చే శ్రావణ మాసంలో జరిగేలా చూడాలని కోరారు. తిరుపతి వేంకటేశ్వర స్వామిని భక్తులు ఇష్ట దైవంగా, ఇలవేల్పుగా కొలుస్తారని, అలాంటి ఆలయం సిద్దిపేటలో నిర్మించడం గొప్ప అదృష్టమని మంత్రి పేర్కొన్నారు.