మహా జాతరకు వేళాయే

ABN , First Publish Date - 2023-02-18T00:10:09+05:30 IST

జనమే జయిడి యజ్ఞస్థలిలో వెలసిన ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో మహాశివరాత్రి జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది.

మహా జాతరకు వేళాయే

నేటి నుంచి ఏడుపాయల జాతర

8 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా

పాపన్నపేట, ఫిబ్రవరి 17: జనమే జయిడి యజ్ఞస్థలిలో వెలసిన ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో మహాశివరాత్రి జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. మొదటి రోజు మహాశివరాత్రి సందర్భంగా ఉపవాస దీక్షలు చేపడుతారు. సాయంత్రం దుర్గామాతను దర్శించుకుని రాత్రంతా జాగరణ చేస్తారు. రెండోరోజు బండ్ల ఊరేగింపు జాతరకే తలమానికంగా నిలుస్తుంది. మూడోరోజు సోమవారం రథోత్సవంతో జాతర ముగుస్తుంది. రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి 8 లక్షల మంది భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు.

అమ్మవారి ఆలయ ప్రాంగణం రంగురంగుల విద్యుద్దీపాలతో మెరుస్తున్నది. జాతరకు వచ్చే భక్తుల పుణ్యస్నానాల కోసం సింగూర్‌ నుంచి 0.45 టీఎంసీల నీరు వదలడంతో ఘణపురం ఆనకట్ట అలుగు పారుతున్నది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ప్రభుత్వ శాఖలు ఏర్పాట్లు చేస్తున్నాయి. పోలీసు శాఖ నలుగురు డీఎస్పీలు, 21మంది సీఐలు, 55మంది ఎస్‌ఐలు, 99మంది ఏఎ్‌సఐలు, 260మంది కానిస్టేబుళ్లు, 83మంది మహిళా కానిస్టేబుళ్లు, 121 మంది హోంగార్డులు, 10 ఏఆర్‌ బలగాలతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. జాతరలో ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా నాగ్సాన్‌పల్లి కమాన్‌ నుంచి వచ్చే భక్తులకు చెల్మేకుంట వద్ద, పోతంశెట్టిపల్లి వైపు నుంచి వచ్చే భక్తుల వాహనాలకు మొదటి బ్రిడ్జి వద్ద పార్కింగ్‌ సౌకర్యం కల్పించారు.

ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

ఏడుపాయల జాతరకు రావడానికి ఉమ్మడి మెదక్‌ జిల్లాతోపాటు నిజామాబాద్‌, సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ నుంచి ఆర్టీసీ 150 వరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నది. జాతరకు వచ్చే భక్తులకు మెదక్‌, నర్సాపూర్‌, బాలానగర్‌ బస్టాండులలో అన్ని రకాల సదుపాయలు ఏర్పాటు చేసిన మెదక్‌ రీజియన్‌ రీజినల్‌ మేనేజర్‌ క్యాంపులను ఏర్పాటు చేసినట్లు మెదక్‌ డిపో మేనేజర్‌ పేర్కొన్నారు. మెదక్‌ నుంచి ప్రతి 10 నిమిషాలకో బస్సు బయలుదేరుతుందని తెలిపారు. బాలానగర్‌ నుంచి నర్సాపూర్‌ మీదుగా వచ్చే భక్తులకు కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి వైపు నుంచి అమ్మవారి సన్నిధికి చేరుకోవచ్చు. బొడ్మట్‌పల్లి, నారాయణఖేడ్‌, జహీరాబాద్‌ వైపు నుంచి వచ్చే భక్తులు పాపన్నపేట మండలం మీదుగా నాగ్సాన్‌పల్లి నుంచి ఏడుపాయలకు చేరుకోవచ్చు. సంగారెడ్డి, జోగిపేట నుంచి వచ్చే భక్తులు కొల్చారం, పాపన్నపేట మండలాల మీదుగా ఏడుపాయలకు చేరుకోవచ్చు.

ముస్తాబైన ఆలయాలు

మెదక్‌, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని ఆలయాలు మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబయ్యాయి. మెదక్‌, సంగారెడ్డి జిల్లా కేంద్రాల్లో శివరాత్రి వేడుకలు, జాగరణ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. సంగారెడ్డిలోని పార్వతీ సంగమేశ్వరాలయం, రాజంపేటలోని రాజరాజేశ్వరాలయం, పోతిరెడ్డిపల్లి చౌరస్తాలోని శివాలయం, కల్పగూర్‌లోని కాశీవిశ్వేశ్వరాలయంలో ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు చేశారు. చారిత్రక ప్రాధాన్యం కలిగిన పెద్దశంకరంపేట మండలం కొప్పోలులోని సంగమేశ్వరాలయం, హవేళీఘణపూర్‌ మండలం ముత్తాయికోటలోని పురాతన సిద్ధేశ్వరాలయం, చిల్‌పచెడ్‌ మండలం చండూరులోని రామలింగేశ్వర ఆలయంలో ఉత్సవాలకు ఏర్పాట్లు చేశారు. నారాయణఖేడ్‌లోని కాశీవిశ్వేశ్వరాలయంలో శివరాత్రి ఉత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి.

Updated Date - 2023-02-18T00:10:10+05:30 IST