నూతన పారిశ్రామిక విధానంతో పెట్టుబడుల వెల్లువ
ABN , First Publish Date - 2023-06-07T00:09:41+05:30 IST
బీఆర్‌ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ రూపొందించిన నూతన పారిశ్రామిక విధానంతో ఉమ్మడి మెదక్ జిల్లాకు పరిశ్రమలు వెల్లువలా తరలివచ్చాయని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు.
పరిశ్రమలకు 15 రోజుల్లో అనుమతులు, 24 గంటలు నాణ్యమైన విద్యుత్
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి
పటాన్‌చెరు, జూన్ 6: బీఆర్‌ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ రూపొందించిన నూతన పారిశ్రామిక విధానంతో ఉమ్మడి మెదక్ జిల్లాకు పరిశ్రమలు వెల్లువలా తరలివచ్చాయని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం పటాన్‌చెరు జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి పారిశ్రామిక ప్రగతి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో తెలంగాణ ఏర్పాటుకు ముందు 40,306 చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమలు ఉండగా.. గత పదేళ్లలో కొత్తగా 2,572 పరిశ్రమలు తరలివచ్చాయని తెలిపారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,88,191 మందికి ఉపాధి లభిస్తున్నదని తెలిపారు. జిల్లాలో కొత్తగా మెడికల్ డివైజ్‌పార్కు, ఎల్‌ఈడీ పార్కు, సాఫ్ట్‌వేర్ పార్కులు ఏర్పాటవుతున్నాయని పేర్కొన్నారు. గుండెకు వేసే స్టంట్‌ల నుంచి కళ్లద్దాల వరకు సుల్తాన్‌పూర్ మెడికల్ డివైజ్ పార్కులో తయారవడం గర్వకారణమని అన్నారు. పరిశ్రమలకు సింగిల్‌విండో విధానంలో అన్ని అనుమతులు 15 రోజుల్లోనే ఇస్తున్నామని, నాణ్యమైన 24 కరెంటు, మౌలిక వసతలు కల్పిస్తున్నామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలను ప్రోత్సహిస్తుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పారిశ్రామిక రంగాన్ని దెబ్బతీస్తున్నదని ఆరోపించారు. ఎమ్మెల్యే గూడెంమహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ సమైఖ్య పాలనలో పటాన్‌చెరు పారిశ్రామికవాడలో పవర్‌హాలిడేస్ ఉండేవని, తెలంగాణ వచ్చిన తరువాత ఒక్కపూట కూడా కరెంటు పోలేదని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శరత్, జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, పరిశ్రమలశాఖ జిల్లా మేనేజర్ ప్రశాంత్‌కుమార్, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
మెదక్ జిల్లాలో రూ. 8,421 కోట్ల పెట్టుబడితో 790 యూనిట్లు
మనోహరాబాద్, జూన్ 6: తెలంగాణ రాష్ట్ర దశబ్ది ఉత్సవాల్లో భాగంగా మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలోని ముప్పిరెడ్డిపల్లి సనోఫీ కంపెనీలో పారిశ్రామిక ప్రగతి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సుహృద్భావ వాతావరణ కల్పిస్తున్నదని తెలిపారు. మెదక్ జిల్లాలో టీఎస్ ఐపాస్ విధానం ద్వారా రూ. 8,421 కోట్ల పెట్టుబడితో 790 యూనిట్లు నెలకొల్పారని, 26,354 మందికి ఉపాధి లభిస్తున్నదని వివరించారు. టీ-ప్రైడ్ క్రింద 1,632 మంది ఎస్సీ, ఎస్టీ, దివ్యంగులకు రూ. 69.29 కోట్ల ఆర్థి సహయం అందించామని తెలిపారు. మహిళా కమిషన్ చైర్మెన్ సునీతారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్, మంత్రి కేటీఆర్ చొరవతో పెద్ద కంపెనీలు తెలంగాణ వైపు చూస్తున్నాయని పేర్కొన్నారు. కంపెనీల ఏర్పాటుతో రాష్ట్రంలో భూముల విలువ పది రెట్లు పెరిగిందని, యువతకు పుష్కలంగా ఉద్యోగాలు లభిస్తున్నాయని తెలిపారు. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గజ్వేల్ నిమోజకవర్గాన్ని తీర్చిదిద్దినట్టు నర్సాపూర్ కూడా అభివృద్ది చేయాలని కోరారు. పరిశ్రమల ఏర్పాటు కోసం నియోజకవర్గంలోని పోతారంలో 250 ఎకరాలు, శివ్వంపేటలో 1,000 ఏకరాల స్ధలం అందుబాటులో ఉన్నదని తెలిపారు. ఎఫ్‌డీసీ చైర్మన్ ప్రతా్‌పరెడ్డి మాట్లాడుతూ పరిశ్రమలు గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేసేలా చొరవ తీసుకుంటామని తెలిపారు. డిక్కీ అధికారి దుర్గప్రసాద్ మాట్లాడుతూ డీక్కీ సంస్ధ ద్వారా తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ-ఏ వర్గాలకు పెద్దఎత్తున్న సబ్సిడీలు అందజేస్తున్నామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు రమేష్, ప్రతిమాసింగ్, కార్మిక సంస్థ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, జిల్లా మైనింగ్ ఏడీ జైరాజ్, నర్సాపూర్ ఆత్మకమిటీ చైర్మన్ వెంకట్‌రెడ్డి, గడ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, ఆర్డీవో శ్యాంప్రకాశ్, ఎంపీపీ నవనీతరవి, వైస్‌ఎంపీపీ విఠల్‌రెడ్డి, రాష్ట్ర సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, ముప్పిరెడ్డిపల్లి సర్పంచ్ ప్రభావతి పెంటయ్య, పీఏసీఎస్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.