Share News

పెరిగిన నేరాలు

ABN , Publish Date - Dec 29 , 2023 | 12:24 AM

దొంగతనాలు.. రోడ్డు ప్రమాదాలు.. సైబర్‌ మోసాలు.. హత్యలు.. ఇలా అన్నింటా కేసులు పెరగడం ఆందోళన కల్గిస్తోంది. అతివలపై అకృత్యాలు ఆగడం లేదు.

పెరిగిన నేరాలు

గతేడాదితో పోలిస్తే పెరిగిన హత్యలు, దొంగతనాలు, సైబర్‌ కేసులు

అదుపు చేయడంలో కనిపించని పురోగతి

ఉత్తమ సేవలందించిన జిల్లా పోలీసులకు

దక్కిన ప్రశంసలు, రివార్డులు

మెదక్‌ అర్బన్‌, డిసెంబరు 28: దొంగతనాలు.. రోడ్డు ప్రమాదాలు.. సైబర్‌ మోసాలు.. హత్యలు.. ఇలా అన్నింటా కేసులు పెరగడం ఆందోళన కల్గిస్తోంది. అతివలపై అకృత్యాలు ఆగడం లేదు. వారిపై వేధింపులు మరింత పెరిగాయి. మరో వైపు దొంగతనాలు ఎక్కువ అయ్యాయి. నేరాలు అదుపు చేయడంలో ఈ ఏడాది పురోగతి కనిపించలేదు. గత రెండేళ్లతో పోలిస్తే ఆశించిన స్థాయిలో ఫలితాలు లేవు. ఒకవైపు నేరాల శాతం పెరిగినప్పటికీ వీటిని అదుపు చేయడానికి ఎన్నికల కారణంగా అడ్డంకులు ఎదురయ్యాయి. జిల్లా పోలీస్‌ శాఖ పలు సంస్కరణలతో ముందుకు వెళ్తూ.. నేరాలు నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. పెట్రోలింగ్‌, సీసీ కెమెరాలు, పోలీస్‌ గస్తీతోపాటు సైబర్‌ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించింది. ఆయా వర్గాలకు చట్టాలపై అవగాహన కల్పించింది. ఉత్తమ సేవలకు జిల్లా పోలీసులకు దక్కిన ప్రశంసలు, రివార్డులు అందజేస్తున్నారు. జిల్లాలో గతేడాది 2022లో 4,081 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది 4,187 కేసులు నమోదయ్యాయి.

పెరిగిన సైబర్‌ నేరాలు.. దొంగతనాలు

2023లో సైబర్‌ నేరాలు పెరిగాయి. ఆన్‌లైన్‌లో బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు కాజేయడం లాంటివి ఈ యేడు జిల్లాలో ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. సైబర్‌ నేరాల కింద 122 కేసులు నమోదు కాగా.. దాదాపు రూ. 74 లక్షలు ప్రజల నుంచి కాజేశారు. అందులో 92 కేసుల్లో రూ.19.75 లక్షలను స్తంభింపజేశారు. ఈ ఏడాది దొంగతనాలు పెరిగాయి. సంవత్సరంలో 392 దొంగతనాలు జరిగాయి. రూ. 2,19,95,481 సొత్తును దొంగలు దోచుకెళ్లారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి రూ.77,89,920 నగదును రికవరీ చేశారు. నేరాల నివారణకు సీసీ కెమెరాల ఉపయోగంపై పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతీ పట్టణాలు, మండలాలు, గ్రామాల్లోనూ ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయిస్తున్నారు. దొంగతనాల కేసులను ఛేదించడంలో పోలీసులకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడినట్లు ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

Updated Date - Dec 29 , 2023 | 12:24 AM