సైబర్‌ వలలో..

ABN , First Publish Date - 2023-03-25T23:58:02+05:30 IST

సైబర్‌ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు.

సైబర్‌ వలలో..

జిల్లాలో 20 రోజుల నుంచి నిత్యం మూడు, నాలుగు కేసులు నమోదు

ఆఫర్ల పేరిట అమాయకులకు కుచ్చుటోపి

బ్యాంక్‌ అకౌంట్లలో లక్షలు మాయం

అవగాహన కల్పిస్తున్న పోలీసులు

సిద్దిపేట క్రైం, మార్చి 25 : సైబర్‌ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. లక్షల రూపాయలు దోచుకుంటున్నారు. సైబర్‌ నేరాల పట్ల గ్రామాల్లో పట్టణాల్లో ప్రజలకు పోలీసులు అవగాహన కల్పించినప్పటికీ కొంతమంది మోసపోతూనే ఉన్నారు. 20 రోజుల నుంచి జిల్లాలో ప్రతీరోజు మూడు నుంచి నాలుగు సైబర్‌ కేసులు నమోదవుతున్నాయి. 24 గంటల్లోపు ఫిర్యాదు చేసిన బాధితుల అకౌంట్లలో డబ్బును ఫ్రీజ్‌ చేస్తున్నారు.

జిల్లాలో ఇటీవల నమోదైన సైబర్‌ నేరాలు

- సిద్దిపేట వన్‌టౌన్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని ఓ బాధితుడికి పార్ట్‌ టైం జాబ్‌ కోసం మొబైల్‌కు మెసేజ్‌ వచ్చింది. ఆ నంబర్‌కు కాల్‌చేయగా సైబర్‌ నిందితులు లింకు పంపించి జాయిన్‌ అవమనగా క్లిక్‌ చేశాడు. దీంతో టెలిగ్రామ్‌ గ్రూప్‌లో చేరాడు. అందులో డబ్బు చెల్లించి చేసే టాస్కులు ఇచ్చి పూర్తిచేశాకా లాభాలు వస్తున్నట్లుగా చూపించారు. కొన్నిరోజులకు బాధితుడికి డబ్బు విత్‌ డ్రా కాకపోవడంతో అడగగా వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ విధంగా రూ.2,61,224 కోల్పోయాడు.

- సిద్దిపేట రూరల్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని ఆటోడ్రైవర్‌ అతనికి తెలిసిన ప్లైవుడ్‌ షాప్‌లో ఆర్డర్‌ ఇచ్చామని సైబర్‌ నిందితుడు కాల్‌ చేశాడు. బాధితుడు నమ్మి నిందితులు చెప్పిన అడ్ర్‌సకి ఆర్డర్‌ని తీసుకెళ్లాడు. కానీ అక్కడ ఎవరు లేకపోవడంతో బాధితుడు నిందితునికి ఫోన్‌చేయగా ప్రస్తుతం తాము అక్కడ లేమని తర్వాత తీసుకుంటామని, ఇప్పుడు డబ్బు పంపిస్తానని చెప్పారు. క్యూఆర్‌ కోడ్‌ పంపించగా బాధితుడు నమ్మి కోడ్‌ను స్కాన్‌ చేయగా రూ.36,799 కోల్పోయాడు.

- గజ్వేల్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని ఒకరికి క్రెడిట్‌ కార్డు లిమిట్‌ పెంచుతామని సైబర్‌ నిందితుడు ఫోన్‌ చేశాడు. బాధితుడు నమ్మి అతని అకౌంట్‌, కార్డు డీటెయిల్స్‌, ఓటీపీ నంబర్‌ చెప్పాడు. అప్పుడు బాధితుడి అకౌంట్‌ నుంచి రూ.17,140 కోల్పోయాడు.

- సిద్దిపేట టూ టౌన్‌ పరిధిలోని ఒకరు క్యాష్‌బే అనే యాప్‌ ద్వారా రూ.3010 రూపాయల లోన్‌ తీసుకున్నాడు. కానీ అతడు వాటిని చెల్లించగా మళ్లీ చెల్లించమని ఇబ్బంది పెట్టారు. బాధితుడు 1930కి కాల్‌ చేసి ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు రిజిస్టర్‌ చేశారు.

- హుస్నాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో ఒకరు యూట్యూబ్‌లో ఫ్రాంచైజ్‌ ప్రకటన చూసి దానికోసం కాల్‌ చేశాడు. సైబర్‌ నిందితుడు జీఎస్టీ, గవర్నమెంట్‌ పర్మిషన్‌ కోసం అని చెప్పి డబ్బు చెల్లించాలని అడగగా బాధితుడు కట్టాడు. తర్వాత కాల్‌ చేయగా అది ఫేక్‌ అని గుర్తించాడు. ఈ విధంగా బాధితుడు రూ.64,500 కోల్పోయాడు

- సిద్దిపేట త్రీ టౌన్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో ఒకరికి మీ షో నుంచి కాల్‌ చేస్తున్నామని మీకు లాటరీ వచ్చిందని మీరు జీఎస్టీ డబ్బు కడితే లాటరీ డబ్బు వస్తుందని చెప్పారు. బాధితుడు నమ్మి డబ్బు పంపించాడు. తర్వాత కాల్‌ చేయగా ఎలాంటి స్పందన లేదు. ఈవిధంగా బాధితుడు రూ.47,000 కోల్పోయాడు.

24గంటల్లో 1930కి కాల్‌ చేస్తే డబ్బు ఫ్రీజ్‌

సైబర్‌ నేరం జరిగిన వెంటనే బాధితులు గుర్తించి 1930కి కాల్‌ చేసి ఫిర్యాదు చేస్తే డబ్బును వెంటనే ఫ్రీజ్‌ చేయవచ్చని పోలీసులు చెబుతున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు ఏవైనా లింకులు పంపినప్పుడు వాటిని క్లిక్‌ చేయొద్దని, క్యూఆర్‌ కోడ్‌లు పంపినప్పుడు స్కాన్‌ చేయొద్దని పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

Updated Date - 2023-03-25T23:58:02+05:30 IST