దావత్‌ ఇస్తే.. బీరు సీసాతో పొడిచాడు!

ABN , First Publish Date - 2023-03-05T00:13:17+05:30 IST

తాతా దావత్‌ ఇయ్యవా అంటూ ఓ బాలుడు అడిగితే అంగీకరించడమే ఆ వ్యక్తి చేసిన తప్పయింది. కావాల్సినంత మద్యం తాగిస్తే.. ఆ మత్తులో పార్టీ ఇచ్చిన వ్యక్తినే బీరు సీసాతో పొడిచి చంపాడా బాలుడు.

దావత్‌ ఇస్తే.. బీరు సీసాతో పొడిచాడు!

60 ఏళ్ల వ్యక్తిని హత్య చేసిన 15 ఏళ్ల బాలుడు

హత్నూర, మార్చి 4: తాతా దావత్‌ ఇయ్యవా అంటూ ఓ బాలుడు అడిగితే అంగీకరించడమే ఆ వ్యక్తి చేసిన తప్పయింది. కావాల్సినంత మద్యం తాగిస్తే.. ఆ మత్తులో పార్టీ ఇచ్చిన వ్యక్తినే బీరు సీసాతో పొడిచి చంపాడా బాలుడు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్‌లో ఈ ఘోరం జరిగింది. మృతుడి కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. హత్నూర మండలం కొన్యాల గ్రామానికి చెందిన మంగలి ఆముదయ్య (60) శుక్రవారం సాయంత్రం హత్నూర పోస్టాఫీ్‌సలో రైతుబంఽధు, పెన్షన్‌ డబ్బులు తీసుకొని దౌల్తాబాద్‌కు బయలుదేరాడు. దీన్ని గమనించిన అదే గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలుడు ఆముదయ్యను అనుసరించాడు. దౌల్తాబాద్‌కు చేరుకోగానే ‘‘పైసలొచ్చినయ్‌ తాతా.. దావత్‌ ఇయ్యవా?’’ అని అడిగాడు. ఆముదయ్య కాదనలేక బాలుడిని వెంటబెట్టుకొని దౌల్తాబాద్‌లోని రేణుక వైన్స్‌కు వెళ్లాడు. ఆ షాపులో మద్యం కొని.. బాలుడిని తీసుకొని వైన్స్‌ వెనక తాగారు. రాత్రి 11:30 సమయంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఆ బాలుడు పక్కనే ఉన్న బీరు సీసాను పగులగొట్టి ఆముదయ్యను విచక్షణా రహితంగా పొడిచాడు. ఈ ఘటనలో ఆముదయ్య మృతిచెందడంతో బాలుడు అక్కడి నుంచి పరారయ్యాడు. శనివారం ఉదయం వైన్స్‌ నిర్వాహకుల ద్వారా విషయం తెలుసుకున్న సీఐ వేణుకుమార్‌, మృతుడి కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదుచేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా బాలుడిని గుర్తించి అదుపులోకి తీసుకొని సంగారెడ్డి కోర్టులో హాజరుపరిచారు.

Updated Date - 2023-03-05T00:13:17+05:30 IST