Share News

పదవి కావలెను

ABN , First Publish Date - 2023-12-05T23:59:56+05:30 IST

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి అధికారం దక్కడంతో ఆ పార్టీ నేతల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

పదవి కావలెను

మొదలైన కాంగ్రెస్‌ నేతల ప్రయత్నాలు

మార్కెట్‌, దేవాలయ కమిటీలపై దృష్టి

కార్పొరేషన్‌, నామినేటెడ్‌ పోస్టులపైనా ఆశలు

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, డిసెంబరు 5: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి అధికారం దక్కడంతో ఆ పార్టీ నేతల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికంగా కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధించకపోయినా నామినేటెడ్‌ పదవులు వరిస్తాయని ఆశలు పెట్టుకుంటున్నారు. ఈ దిశగా ప్రయత్నాలు సైతం ప్రారంభించారు. జిల్లాలో మార్కెట్‌ కమిటీలు, ఆత్మ కమిటీలు, దేవాలయ కమిటీలు, రైతుబంధు కమిటీలతోపాటు ఇతర నామినేటెడ్‌ పోస్టులున్నాయి. ఇవి కాకుండా ఆయా కమిటీల్లో డైరెక్టర్లుగా అనేక మందికి సర్దుబాటు చేయవచ్చని ఆశిస్తున్నారు.

జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్‌, దుబ్బాక, హుస్నాబాద్‌ నియోజకవర్గాలతోపాటు జనగామ, మానకొండూరు నియోజకవర్గాల పరిధిలోని పలు మండలాలున్నాయి. అయితే హుస్నాబాద్‌, మానకొండూరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. మిగతా నాలుగు చోట్లా బీఆర్‌ఎస్‌ అభ్యర్థులే గెలుపొందారు. ఇన్నాళ్లు బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలో ఉండడంతో నామినేటెడ్‌ పదవులన్నీ ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకే దక్కాయి. వీరి స్థానంలో ఇప్పుడు పదవులన్నీ కాంగ్రెస్‌ శిబిరానికి సొంతం కాబోతున్నాయి.

మార్కెట్‌ కమిటీలపై కన్ను

జిల్లాలో దుబ్బాక, తొగుట, గజ్వేల్‌, వంటిమామిడి, చేర్యాల, హుస్నాబాద్‌, కోహెడ, సిద్దిపేట, నంగునూరు, చిన్నకోడూరులో వ్యవసాయ మార్కెట్లు ఉన్నాయి. ఈ 10 మార్కెట్ల పరిధిలోనే జిల్లాకు సంబంధించిన 26 మండలాల వ్యవసాయాధారిత కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అన్ని మార్కెట్లకు రిజర్వేషన్ల ఆధారంగా చైర్మన్లతోపాటు వైస్‌చైర్మన్లు, డైరెక్టర్లను నియమించారు. వీరంతా కూడా బీఆర్‌ఎస్‌కు చెందిన నాయకులే. కాగా ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో మార్కెట్‌ కమిటీలపై ఆ పార్టీ నేతలు దృష్టి పెట్టారు. అయితే మార్కెట్‌ కమిటీలను రిజర్వేషన్ల ప్రకారం నియమిస్తారా.. లేక ఇక్కడున్న నాయకుల ప్రాధాన్యత ఆధారంగా ఎంపిక చేస్తారా? అనేది తేలియాల్సి ఉంది. స్థానికంగా ఉన్న నేతలు తమ పేర్లను పరిశీలించాలని తమ గాడ్‌ఫాదర్‌లకు విజ్ఞప్తి చేస్తున్నట్లు చర్చ జరుగుతున్నది. పలు నామినేటెడ్‌ పోస్టులకు కాంగ్రెస్‌ నేతలు రేసులో ఉన్నట్లు సోషల్‌ మీడియాలోనూ స్థానికంగా ప్రచారం చేస్తున్నారు.

కార్పొరేషన్లు, నామినేటెడ్‌ పోస్టులకూ

గజ్వేల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి రాష్ట్రస్థాయిలో కీలక పదవి వరిస్తుందని భావిస్తున్నట్లు తెలిసింది. సిద్దిపేటలో పోటీచేసిన పూజల హరికృష్ణ, దుబ్బాక బరిలో ఉన్న చెరుకు శ్రీనివా్‌సరెడ్డిలకు సైతం తమ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలంటే రాష్ట్రస్థాయి నామినేటెడ్‌ పోస్టులు దక్కుతాయనే ప్రచారం జరుగుతున్నది. ఇవి కాకుండా సిద్దిపేటలో సిద్దిపేట పట్టణ డెవల్‌పమెంట్‌ అథారిటీ(సుడా) చైర్మన్‌ పదవిపైనా స్థానిక నేతలు కన్నేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌, జిల్లా రైతుబంధు సమితి చైర్మన్‌ పదవులకూ పలువురు పోటీ పడే అవకాశాలున్నాయి. ఉపాధి హామీ స్టేట్‌ కౌన్సిల్‌ సభ్యులుగా కూడా ఛాన్స్‌ ఉంటుందని యోచిస్తున్నారు. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్‌ పార్టీని నమ్ముకుని ఉన్న నేతలు, కార్యకర్తలకు ముందువరుసలో స్థానం కల్పిస్తారని విశ్వసిస్తున్న పరిస్థితి జిల్లాలో నెలకొన్నది.

ఆలయాల పాలకవర్గాలపై దృష్టి

ప్రముఖ ఆలయం కొమురవెల్లికి తెలుగు రాష్ర్టాలతోపాటు ఇతర రాష్ర్టాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. ఈ ఆలయ చైర్మన్‌, పాలకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. బీఆర్‌ఎస్‌ హయాంలో ఈ పదవి కోసం పోటాపోటీ పడిన సందర్భాలు అనేకం. ఈనెలలోనే కొత్త కమిటీని నియమించాల్సి రావడంతో పలువురు కాంగ్రెస్‌ నేతలు క్యూకట్టారు. అలాగే కొండపోచమ్మ ఆలయం, హుస్నాబాద్‌ రేణుక ఎల్లమ్మ ఆలయం, బుగ్గ రాజేశ్వరస్వామి ఆలయం, సంతోషిమాత, వెంకటేశ్వర స్వామి ఆలయాల చైర్మన్లుగా, డైరెక్టర్లుగానూ అవకాశం కోసం ఆరాటపడుతున్నారు. ఇంకా కొన్ని ఆలయాలకు కమిటీలను నియమించలేదు. ఇవే కాకుండా ఆత్మ కమిటీలు, మండల, గ్రామ స్థాయిలో రైతుబంధు కమిటీల్లోనూ ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. వీరందరి స్థానాల్లో కాంగ్రెస్‌ శ్రేణులకు అవకాశాలు లేకపోలేదు. ఇప్పుడు రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ, ఇతర కార్యకలాపాల అనంతరం ఈ పోస్టులపైనా ప్రభుత్వం దృష్టి పెట్టే పరిస్థితి ఉంది. అప్పటిదాకా తమ ప్రయత్నాలను కొనసాగిస్తూ రేసులో ఉంటామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

Updated Date - 2023-12-05T23:59:57+05:30 IST