హుస్నాబాద్.. ఎవరికో జిందాబాద్?
ABN , First Publish Date - 2023-11-16T23:48:37+05:30 IST
ద్దిపేట జిల్లాలో భౌగోళికంగా పెద్దదైన హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొన్నది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఢీ అంటే ఢీ అంటూ ప్రచారంలో దూసుకెళుతున్నాయి. వీటితో పాటు బీజేపీ తామేం తక్కువ కాదంటూ జోరు పెంచింది. గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం ప్రారంభానికి సెంటిమెంట్‌గా నిలిచిన హుస్నాబాద్ నియోజకవర్గం ఎవరికి జిందాబాద్ కొడుతుందోనని రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నది.
హుస్నాబాద్, నవంబరు 16: వ్యవసాయక, సామాజిక, ఆర్థిక, పారిశ్రామిక రంగాల్లో వెనుకబడి పోయినా రాజకీయ చైతన్యంలో మాత్రం హుస్నాబాద్ అగ్రభాగాన నిలిచింది. వామపక్ష రాజకీయాలు, దళిత, బహుజన ఉద్యమాలకు గుర్తింపు తెచ్చింది. నుస్తులాపూర్ నియోజకవర్గం నుంచి ఇందుర్తిగా.. ఇందుర్తి నుంచి హుస్నాబాద్ నియోజకవర్గంగా మారింది. నియోజకవర్గ బరిలో 19మంది అభ్యర్థులు నిలిచారు. ఈసారి హ్యాట్రిక్ సాధించడానికి బీఆర్‌ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్, నియోజకవర్గంలో పునర్‌వైభవాన్ని తీసుకవచ్చి అసెంబ్లీలో అడుగుపెట్టాలని కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్, ఈసారి సత్తాచాటాలని బీజేపీ అభ్యర్థి బొమ్మ శ్రీరాంచక్రవర్తి పోరాడుతున్నారు. వీరు ముగ్గురే కాకుండా మరో 16 మంది అభ్యర్థులు నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్నారు. వీరు ప్రధాన అభ్యర్థుల గెలుపొటములను ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికల శంఖారావం ఇక్కడి నుంచే పూరించి వొడితెల సతీ్‌షకుమార్‌ను గెలిపించాలని కోరడం, తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి కాంగ్రెస్ బీసీ మెనిఫెస్టో కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఇక్కడి నుంచి పోటీ చేస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చానీయాంశమైన నియోజకవర్గంగా మారింది.
అభివృద్ధి, సంక్షేమ పథకాల లబ్ధిదారులను నమ్ముకున్న వొడితెల సతీష్‌కుమార్
హుస్నాబాద్ నుంచి మూడోసారి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఎన్నికల రంగంలోకి దిగిన వొడితెల సతీ్‌షకుమార్ అభివృద్ధి మంత్రంతో ప్రచారం చేస్తూ ముందుకెళుతున్నారు. సీఎం కేసీఆర్ హుస్నాబాద్‌లో మొదటి ఎన్నికల ఆశీర్వాద సభ పెట్టక ముందు నుంచే నియోజకవర్గంలో ప్రచారం మొదలు పెట్టారు. ఇప్పటికే దాదాపుగా అన్ని గ్రామాల్లో ప్రచారం పూర్తి చేసి పట్టణంలోని అన్ని వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏ గ్రామానికి వెళితే ఆ గ్రామానికి తాను చేసిన అభివృద్ధిని వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు. గౌరవెల్లి రిజర్వాయర్ పూర్తయ్యిందని, కొద్ది రోజుల్లోనే గోదావరి జలాలు పారిస్తామని, నియోజకవర్గంలో రూ.9 వేల కోట్ల అభివృద్ధి సంక్షేమ పనులు చేశామని, సీఎం జిల్లా కావడంతో మళ్లీ గెలిపిస్తే నియోజకవర్గం మరింత ప్రగతిపథంలో దూసుకెళుతుందని ప్రచారం చేస్తున్నారు. పింఛన్‌దారులు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు అండగా ఉంటారని విశ్వసిస్తున్నారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి సతీ్‌షకుమార్ ప్రచారానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ గెలిస్తే నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడుతుందని పేర్కొంటూ మరోసారి తన విజయం ఖాయమనే భావనతో ఉన్నారు.
బీసీ ఓటు బ్యాంకుపై పొన్నం ఆశలు
తెలంగాణ ఏర్పాటు ప్రకటన సందర్భంగా పార్లమెంట్‌లో పెప్పర్ స్ర్పే దాడి సంఘటనతో దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఎలాగైనా విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టాలని పట్టుదలతో ముందుకు పోతున్నారు. దశాబ్ద కాలంగా అధికారం లేక నీరసించిపోయిన పార్టీకి పునర్‌వైభవం తీసుకవచ్చి హుస్నాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ప్రచారం సాగిస్తున్నారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం పొందిన తరువాత 2014లో ఓటమి చెందగా, 2018లో పొత్తుల్లో భాగంగా సీపీఐకి వదిలిపెట్టారు. అంతకు ముందు నాలుగుసార్లు ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ పోటీపడగా చివరకు పొన్నంకు వరించింది. అయితే టికెట్ ఖరారు కాకముందే ప్రవీణ్‌రెడ్డి విస్తృత ప్రచారం చేశారు. దీనికి తోడు ప్రభాకర్ కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేపట్టబోయే ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ వైఫల్యాలను, గౌరవెల్లి, గండిపల్లి రిజర్వాయర్‌ల పనుల పెండింగ్, నియోజకవర్గ వెనుకబాటుకు ఎమ్మెల్యే సతీష్ కారణమంటూ పొన్నం ప్రచారం సాగిస్తున్నారు. ముఖ్యంగా గౌడ కులస్థులతో పాటు బీసీలు ఓట్లు గట్టెక్కిస్తాయని నమ్మకంతో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి కలిసిరాగా సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి మద్దతు ఇస్తుండటంతో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్న శ్రీరాం
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు దీటుగా బీజేపీ అభ్యర్థి బొమ్మ శ్రీరాంచక్రవర్తి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇటీవల బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌తో సభ ఏర్పాటు చేసి ప్రజల దృష్టిని తనవైపు మరల్చుకున్నారు. మాజీ ఎమ్మెల్యే దివంగత బొమ్మ వెంకటేశ్వర్లు కుమారుడైన బొమ్మ శ్రీరాంచక్రవర్తికి ఈ ప్రాంతంతో అవినాభావ సంబంధం ఉంది. 15 నెలల క్రితం వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న శ్రీరాం బీజేపీలో చేరారు. అయితే ఇక్కడి టికెట్ కోసం శ్రీరాంతో పాటు బీజేపీ నాయకులు జన్నపురెడ్డి సురెందర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, కర్ణకంటి మంజులరెడ్డి పోటీ పడ్డారు. చివరకు శ్రీరాంకు రాగా అభ్యర్థిని ఖరారు చేయడంలో అధిష్ఠానం చాలా జాప్యం చేసింది. అయినప్పటికీ ప్రస్తుతం సుడిగాలిలా పర్యటిస్తూ బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. బీజేపీకి ఓటు వేస్తే బీసీ సీఎం అవుతాడని, ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి, సంక్షేమ పథకాలను, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల వైకరీలను వివరిస్తూ ప్రచారం సాగిస్తున్నారు. యువతతో పాటు సైలెంట్ ఓట్లు బీజేపీకి పడుతాయని విశ్వసిస్తున్నారు.
వొడితెల సతీ్‌షకుమార్ (బీఆర్‌ఎస్) అనుకూలతలు
రెండుసార్లు ఎమ్మెల్యే కావడం.
గతం కంటే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారు.
ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందిన ఓటర్లు.
ప్రజలకు సహాయం చేస్తాడనే పేరుండడం.
అవినీతి లేకపోవడం, సౌమ్యుడిగా పేరుండటం.
పార్టీలో తనపట్ల అసమ్మతి వర్గం లేకుండా చేసుకోవడం.
సీఎం ముందస్తు ఆశీర్వాదసభ ఇక్కడి నుంచే ప్రారంభించడం.
ప్రభుత్వం వస్తే ఈ సారి మంత్రి అవుతాడనే ప్రచారం కావడం.
ప్రతికూలతలు
రెండు పర్యాయాలు అధికారంలో ఉండటంతో ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత.
సంక్షేమ పథకాల్లో లబ్ధిదారుల ఎంపికలో నాయకుల జోక్యంతో వ్యతిరేకత.
తన చుట్టూ ఉండే కొంతమంది నేతలు చేసే పొరపాట్లను పట్టించుకోకపోవడం.
గ్రామాల్లోని నాయకుల మధ్య ఏర్పడిన వర్గాలను ఐక్యత చేయలేకపోవడం, వారిని మందలించకపోవడం.
అభివృద్ధి పనుల్లో జాప్యం నెలకొనడం.
సీఎం కేసీఆర్‌కు దగ్గర సంబంధాలుండి కూడా అనుకున్న మేర అభివృద్ధి చేయలేదనే అభిప్రాయం.
మాజీ ఎంపీ, రాజకీయ చతురత కలిగిన పొన్నం ప్రభాకర్‌తో తలపడటం.
బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి (బీజేపీ) అనుకూలతలు
మాజీ ఎమ్మెల్యే దివంగత బొమ్మ వెంకటేశ్వర్లు కుమారుడిగా నియోజకవర్గ ప్రజలతో సన్నిహిత సంబంధాలు
యువ ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపడం
ఇక్కడి అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలతో సత్సంబంధాలుండటం
దశాబ్ద కాలానికిపైగా ఇక్కడ సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు చేయడం
తన అనుచర వర్గానికి సమస్య ఉంటే అండగా ఉంటాడనే నమ్మకం
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అండగా ఉండటం
బీసీ సీఎం నినాదం, కేంద్ర ప్రభుత్వ పథకాలు, హిందూ నినాదం
ప్రతికూలతలు
అభ్యర్థిగా ప్రకటించడంలో జాప్యం జరుగడంతో కార్యకర్తలు ఇతర పార్టీల్లోకి వెళ్లడం
161 గ్రామాలున్నా నియోజకవర్గంలో ప్రచారానికి అనుకున్న సమయం లేకపోవడం
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నుంచి బలమైన అభ్యర్థులతో తలబడటం
పటిష్టమైన నాయకత్వం లేకపోవడం
పొన్నం ప్రభాకర్ (కాంగ్రెస్) అనుకూలతలు
రాష్ట్ర ఏర్పాటు ప్రకటనలో పార్లమెంట్‌లో పెప్పర్ స్ర్పే ఘటనతో తెలంగాణ ఉద్యమకారుడిగా ప్రజల్లో ఆదరణ
ఎంపీగా గెలువక ముందు నుంచి ఈ ప్రాంత ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించడం
బీసీలతో పాటు అధికంగా ఉన్న గౌడ కులస్థుల మద్దతు ఉండటం
ఉద్యోగులు, మేధావులు, నిరుద్యోగుల మద్దతు కూడగట్టడం
కాంగ్రెస్ మేనిఫెస్టో, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కీలక పదవిలో ఉంటాడనే ప్రచారం
ప్రజల్లోకి చొచ్చుకొనిపోవడం.. వాగ్దాటితో పాటు ఓటర్లను ఆకట్టుకునే పలుకరించే ధోరణి
ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, సీపీఐ మద్దతుతో పాటు అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి కలిసి రావడం
ప్రతికూలతలు
కెప్టెన్ లక్ష్మీకాంతారావుతో సన్నిహిత సంబంధాలున్న సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు అండ ఉన్న సతీ్‌షతో పోటీపడటం
పింఛన్‌దారులు, రైతుబంధు, సంక్షేమ పథకాలు పొందిన వ్యక్తులు అధికంగా ఉండటం
మా నాయకునికి (ప్రవీణ్‌రెడ్డికి) టికెట్ రాకుండా చేశాడని కొంతమంది సొంత పార్టీ కార్యకర్తలు దూరం ఉండటం
కరీంనగర్ కాకుండా ఇక్కడ పోటీ చేయడంపై ఇతర పక్షాలు ప్రచారం చేస్తుండటం