Share News

బహుభాషా నిలయం

ABN , First Publish Date - 2023-11-06T23:23:41+05:30 IST

మూడు రాష్ట్రాల సరిహద్దుల సంగమం నారాయణఖేడ్‌ నియోజకవర్గం నిజాం సర్కారును గడగడలాడించిన గడ్డ వలసలకు మారుపేరుగా నిలుస్తున్న ఖేడ్‌ ప్రాంతం మంత్రి పదవికి నోచుకోని నియోజకవర్గం గ్రామాలతో సమానంగా గిరిజన తండాలు గౌడ్‌గాం జన్‌వాడవద్ద జిల్లాలోకి మంజీర నది ప్రవేశం

బహుభాషా నిలయం
నారాయణఖేడ్‌ నియోజకవర్గంలోని మధ్యతరహా ప్రాజెక్టు

నారాయణఖేడ్‌, నవంబరు 6 : స్వాతంత్య్ర పోరాటంతో పాటు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ప్రాంతం నారాయణఖేడ్‌. నిజాం పాలనలో బీదర్‌ జిల్లాలో కొనసాగిన నారాయణఖేడ్‌ భాషా ప్రాతిపదికన రాష్ట్రాల విభజన అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో విలీనమైంది. నారాయణఖేడ్‌ నియోజకవర్గంలోని కొంతభాగం కర్ణాటక సరిహద్దుల్లో, మరికొంత భాగం మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉండడంతో ఈప్రాంతాన్ని మూడు ప్రాంతాల సంగమంగా పిలుస్తుంటారు. నియోజకవర్గంలో తెలుగు, కన్నడ, మరాఠీ, ఉర్దూ, గోర్‌బోలి భాషలలో మాట్లాడుతుంటారు. జిల్లాలో ఉన్న ఏకైక మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు నల్లవాగు. 70 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఈ నియోజకవర్గం ఆర్థిక, పారిశ్రామిక రంగాల్లో వెనుకబాటుకు గురైనప్పటికీ, రాజకీయంగా మాత్రంగా చైతన్యవంతమైనదిగా గుర్తింపు పొందింది.

1952లో ఏర్పాటైన నియోజకవర్గం

నారాయణఖేడ్‌ నియోజకవర్గం 1952లో ఏర్పాటైంది. 1983లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం మండలాలను ఏర్పాటు చేయడంతో నియోజకవర్గంలో నారాయణఖేడ్‌, కంగ్టి, కల్హేర్‌, మనూరు, న్యాల్‌కల్‌ మండలంతో పాటు రాయికోడ్‌ మండలంలోని ఐదు గ్రామపంచాయతీలు ఉండేవి. అనంతరం 2009లో నియోజకవర్గాల పునర్విభజన అనంతరం న్యాల్‌కల్‌ మండలంతో పాటు రాయికోడ్‌ మండలంలోని ఐదు గ్రామపంచాయతీలు జహీరాబాద్‌ నియోజకవర్గంలో విలీనమయ్యాయి. నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో పెద్దశంకరంపేట మండలం చేరింది. అనంతరం నూతనంగా సిర్గాపూర్‌, నాగల్‌గిద్ద, నిజాంపేటలను మండలాలుగా ఏర్పాటు చేయడంతో ఖేడ్‌ నియోజకవర్గంలో మండలాల సంఖ్య ఎనిమిదికి చేరింది. తెలంగాణ ఏర్పాటు అనంతరం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాంలో నారాయణఖేడ్‌ నూతన రెవెన్యూ డివిజన్‌గా అవతరించింది.

పదిసార్లు కాంగ్రెస్‌కు చెందిన వారే ఎమ్మెల్యేలు

మొదటి నుంచి ఈ ప్రాంతం కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటగా ఉన్నప్పటికీ, టీడీపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు రెండుసార్లు విజయం సాధించాయి. నియోజకవర్గానికి 16సార్లు ఎన్నికలు జరిగితే పదిసార్లు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అభ్యర్థులే నెగ్గారు. రెండుసార్లు స్వాతంత్య్ర సమరయోధుడు అప్పారావుషెట్కార్‌, మూడుసార్లు శివ్‌రావుషెట్కార్‌, నాలుగుసార్లు పట్లోళ్ల కిష్టారెడ్డి, ఒకసారి స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబానికి చెందిన సురే్‌షషెట్కార్‌ కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. రాంచందర్‌రావుదేశ్‌పాండే స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందగా, ఎం.వెంకట్‌రెడ్డి ఒకసారి స్వతంత్రుడిగా నెగ్గారు. వెంకట్‌రెడ్డి మరోసారి టీడీపీ తరఫున ఎమ్మెల్యే అయ్యారు. ఆయన తనయుడు ఎం.విజయపాల్‌రెడ్డి టీడీపీ అభ్యర్థిగా ఒకసారి విజయం సాధించారు. వెంకట్‌రెడ్డి మరో తనయుడు ఎం.భూపాల్‌రెడ్డి 2016లో జరిగిన ఉపఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తరఫున మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం జరిగిన సాధారణ ఎన్నికల్లోనూ విజయఢంకా మోగించారు.

ఖేడ్‌ ఓటర్ల విలక్షణ తీర్పు

2009 వరకు ఈనియోజకవర్గంలో ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వారు మరోసారి వరుసగా ఎన్నిక కాలేదు. 1952-57లో స్వాతంత్య్ర సమరయోధులు అప్పారావుషెట్కార్‌ మాత్రమే రెండోసారి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నిక కాగా అనంతరం 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికైన పి.కిష్టారెడ్డి వరుసగా 2014లోనూ రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కిష్టారెడ్డి అకస్మిక మృతితో జరిగిన ఉపఎన్నికల్లో గెలుపొందిన ఎం.భూపాల్‌రెడ్డి సైతం 2016, 2018లో వరుసగా గెలుపొందారు. నియోజకవర్గంలో అధిక శాతం ఎన్నికల్లో ఎవరూ గెలిచిన ఐదు నుంచి ఆరువేల ఆధిక్యతతోనే విజయాన్ని కైవసం చేసుకునేవారు. 1994లో విజయపాల్‌రెడ్డి 22వేల ఆధిక్యతతో గెలుపొందగా, 2014లో పి.కిష్టారెడ్డి 14,600 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. 2016లో జరిగిన ఉపఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి భూపాల్‌రెడ్డి రికార్డును బద్ధలు చేస్తూ 53,625 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. అనంతరం 2018లో ఆయన 58,508 మరింత ఆధిక్యతతో గెలుపొందారు. నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో ప్రజలు రక్తసంబంధాల కంటే రాజకీయాలకే అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఒక పార్టీలో కొనసాగుతున్న వారితో మరోపార్టీ వారు బంధుత్వాలను కూడా కొనసాగించడానికి ఇష్టపడేవారు కాదు. ఇప్పుడిప్పుడు ప్రజల్లో కొద్ది మేరకు మార్పు జరుగుతుంది.

నియోజకవర్గంలో 217 గ్రామ పంచాయతీలు

నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో గ్రామాలతో సమానంగా గిరిజన తండాలు ఉన్నాయి. నియోజకవర్గంలో దాదాపు 200 వరకు గ్రామాలు ఉంటే, అంతే సంఖ్యలో గిరిజన తండాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నియోజకవర్గంలో 120 వరకు గ్రామపంచాయతీలు ఉంటే, నేడు 217 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. నారాయణఖేడ్‌ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ప్రతీ ఏటా చెరకు సీజన్‌లో గిరిజనులు కుటుంబాలతోపాటు చక్కెర కర్మాగారాల వద్ద పనులు చేయడానికి వలస వెళ్తుంటారు. దీనికి తోడు ఈ ప్రాంతంలో పరిశ్రమలు లేకపోవడంతో నిరుద్యోగులు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తారు. దీంతో వలసలకు కేరా్‌ఫగా నారాయణఖేడ్‌ నిలుస్తుంది.

ఖేడ్‌ మీదుగా ప్రవహిస్తున్న మంజీర

గోదావరికి ఉపనదిగా ఉన్న మంజీరా నది నాగల్‌గిద్ద మండలం గౌడ్‌గాం జన్‌వాడవద్ద నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో ప్రవేశించిన అనంతరం ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా 96 కిలోమీటర్లు ప్రవహించి, కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌కు చేరుకుంటుంది. మంజీరాపై సింగూరు ప్రాజెక్టు నిర్మించడం వల్ల ఖేడ్‌ నియోజకవర్గంలోని అనేక గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నియోజకవర్గ లక్షా 80వేల ఎకరాలను సాగులోకి తీసుకురావడానికి బసవేశ్వర ఎత్తిపోతల పథకాన్ని నిర్మించ తలపెట్టింది. ఈ పథకం పనులకు గత సంవత్సరం ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు.

సర్వేలకే పరిమితమైన రైల్వేలైన్‌

నారాయణఖేడ్‌ మీదుగా బోధన్‌ - బీదర్‌ రైల్వేలైన్‌ కోసం సురే్‌షకుమార్‌షెట్కార్‌ ఎంపీగా ఉన్న సమయంలో ప్రతిపాదనలు చేయించడంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం రైల్వేలైన్‌కు సర్వే చేయించింది. ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. కాగా నారాయణఖేడ్‌ నియోజకవర్గం మీదుగా హైదరాబాద్‌-అకోలా జాతీయరహదారి 161 నిర్మించడంతో నియోజకవర్గ ప్రజలకు ప్రయోజనం చేకూరింది. అంతేకాకుండా నిజాంపేట నుంచి బీదర్‌ వరకు 161బీ జాతీయ రహదారి నిర్మాణానికి నిధులు సైతం మంజూరు కావడంతో ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి.

నాటి లక్ష్మీనారాయణపురమే.. నేటి నారాయణఖేడ్‌

నారాయణఖేడ్‌ పట్టణం పేరు పూర్వం లక్ష్మీనారాయణపురంగా ఉండేదని పూర్వీకులు తెలుపుతున్నారు. అప్పట్లో పాలించిన ఔరంగాజేబు ఈ ప్రాంతం గుండా ప్రయాణం చేస్తూ విశ్రాంతి తీసుకుంటున్న క్రమంలో లక్ష్మీనారాయణపురంలో హిందువులు, ముస్లింలు సమానస్థాయిలో ఉండడానికి తోడు పట్టణం గుండా చెరువు ఉండడంతో ఆయన అప్పట్లో ఈ పట్టణం పేరును ఉర్దూలో నాలా, తెలుగులో చెరువు కలిసేవిధంగా నాలాచెరువుగా పేరు పెట్టారని పెద్దలు చెబుతారు. కాలక్రమేణ నాలాచెరువు అభివృద్ధికి ఆమడదూరంలో ఉండడంతో ఖేడ్‌ ప్రాంతంగా పిలిచేవారు. దీంతో నాలాచెరువు పేరు నారాయణఖేడ్‌గా మారిందని పూర్వీకులు తెలుపుతున్నారు. గతంలో నారాయణఖేడ్‌ మున్సిపాలిటీగా ఉన్నప్పటికీ అనంతరం ఆదాయం లేకపోవడంతో గ్రామపంచాయతీగా మార్చారు. తిరిగి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం నాలుగేళ్ల క్రితంమళ్లీ మున్సిపాలిటీగా ఏర్పాటైంది.

ఖేడ్‌లో తిరంగాజెండాను ఎగురవేసిన అప్పారావు షెట్కార్‌

దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చినప్పటికీ నిజాం పాలిత ప్రాంతంలో నిర్బంధం ఉండడంతో అప్పారావుషెట్కార్‌, శివ్‌రావుషెట్కార్‌ రహస్యంగా నారాయణఖేడ్‌కు చేరుకోని పోలీసు ఠాణా ఎదురుగా తిరంగా జెండాను ఎగుర వేశారు. దీంతో వారిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. స్వామి రామానందతీర్థతో కలిసి నర్సింహారావు, నారాయణ, విఠల్‌, అంతయ్య తదితరులు నారాయణఖేడ్‌లో నిర్వహించిన సత్యాగ్రహంలో పాల్గొన్నారు.

Updated Date - 2023-11-06T23:23:42+05:30 IST