సిద్దిపేట జిల్లాలో దంచికొట్టిన వాన
ABN , First Publish Date - 2023-03-19T00:04:54+05:30 IST
జిల్లాలో పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి వాన దంచికొట్టింది....

రాత్రి ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షం
సిద్దిపేట టౌన్/మద్దూరు/తొగుట/హుస్నాబాద్, మార్చి18 : జిల్లాలో పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి వాన దంచికొట్టింది. సిద్దిపేట పట్టణంలో సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో వర్షం ప్రారంభమైంది. ఉరుములు, మెరుపులతో గంటకుపైగా కురిసింది. దీంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయ్యమయ్యాయి. పలు కాలనీల్లో విద్యుత్ సమస్య తలెత్తింది. పట్టణంలోని మోడల్ బస్టాండ్ నుంచి హైదరాబాద్ రోడ్డులో నీరు నిలిచింది. పలు చోట్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు పొంగిపొర్లాయి. హుస్నాబాద్ పట్టణంలో రాత్రి 8.30 గంటలకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. పట్టణంలోని ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. ఉరుములు, మెరుపులతో కొన్ని గంటలపాటు కరెంట్ సరఫరాను నిలిపివేశారు. తొగుట మండలంలోని గుడికందుల, కానుగల్, పెద్దమాసాన్‌పల్లి, రాంపూర్, తుక్కాపూర్, తొగుట తదితర గ్రామాల్లో వడగళ్ల వర్షం కురిసింది. చేతికందిన పంటలు భారీగా దెబ్బతిన్నాయి. ఈదురుగాలులు వీయడంతో మండలంలోని కొన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మద్దూరు ఉమ్మడి మండలంలో రాత్రి 7.20 గంటలకు ఈదురుగాలులతో కూడిన వాన పడింది. అకాలవర్షంతో మామిడి తోటలతో పాటు పలు పండ్లతోటలకు నష్టం వాటిల్లింది.