అన్నదాతలను ప్రభుత్వాలు ప్రోత్సహించాలి
ABN , Publish Date - Dec 23 , 2023 | 11:24 PM
రాష్ట్ర రైతు సమైక్య సంఘాల మాజీ అధ్యక్షుడు మంద బలరాం రెడ్డి పలు గ్రామాల్లో రైతు దినోత్సవం
గుమ్మడిదల, డిసెంబరు 23: దేశానికి అన్నం పెట్టే అన్నదాతలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించి ఆదుకోవాలని రాష్ట్ర రైతు సమైక్య సంఘాల మాజీ అధ్యక్షుడు మంద బలరాంరెడ్డి కోరారు. శనివారం జాతీయ రైతు దినోత్సవాన్ని గుమ్మడిదల రైతు సంఘం అధ్యక్షుడు పోచుగారి మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతు సంఘం భవనం ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా బలరాంరెడ్డి మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటలకు మద్దతు ధరను అందించాలని కోరారు. అనంతరం ఆదర్శ రైతులను, అధికారులను అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, జిల్లా రైతు సంఘాల సమైక్య ఉపాధ్యక్షుడు మద్దుల బాల్‌రెడ్డి సమక్షంలో సన్మానించి సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కుమార్‌గౌడ్, సర్పంచ్ చిమ్ముల నరసింహారెడ్డి పాల్గొన్నారు.
కోతుల బెడదను తీర్చాలి
నర్సాపూర్: జిల్లాలో కోతుల బెడద వల్ల వరికి బదులు ఇతర ప్రత్యామ్నయ పంట వేసుకునే పరిస్థితి లేకుండా పోయిందని రైతు రక్షణ సమితి జిల్లా అఽఽధ్యక్షుడు మైసయ్యయాదవ్ పేర్కొన్నారు. శనివారం నర్సాపూర్ మండలం పెద్దచింతకుంట జలహనుమాన్ ప్రాంగణంలో రైతు దినోత్సవం సందర్భంగా రైతులను సన్మానించారు. ఈ సందర్భంగా మైసయ్యయాదవ్ మాట్లాడుతూ... ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి కోతుల బెడదను తీర్చాలని, సబ్సిడీపై సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకునేలా సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని చరణ్‌సింగ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో రైతు రక్షణ సమితి నియోజకవర్గ అధ్యక్షుడు యాదాగౌడ్, ఏఈవో దుర్గప్రసాద్, గోపాలమిత్ర రామకృష్ణ పాల్గొన్నారు.
పంటలసాగులో సస్యరక్షణ చర్యలపై దృష్టిపెట్టాలి
జహీరాబాద్/ఝరాసంగం: పంటలసాగులో రైతులు సస్యరక్షణచర్యలపై ప్రత్యేక దృష్టిని పెట్టాలని వ్యవసాయశాఖ ఏడీఏ భిక్షపతి పేర్కొన్నారు. శనివారం ఝరాసంగం మండలంలోని మాచ్నూర్ గ్రామంలో రైతుదినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంటలను క్రిమికీటకాలు ఆశించినప్పుడు రసాయనాల పిచికారి విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సేంద్రియ ఎరువులతో పంటలను పండిస్తే భూసారం కోతకు గురికాకుండ ఉంటుందన్నారు. ఈ సందర్భంగా బిడెకన్నె, అల్గొల్ గ్రామాలకు చెందిన రైతులను సన్మానించి జ్యూట్‌బ్యాగులను, పురుగుమందు కిట్లను అందజేశారు.