బంగారు తెలంగాణే కేసీఆర్‌ లక్ష్యం

ABN , First Publish Date - 2023-06-02T23:52:45+05:30 IST

ఉద్యమాలతో సాధించుకున్న రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ పేర్కొన్నారు.

బంగారు తెలంగాణే కేసీఆర్‌ లక్ష్యం

70 ఏళ్ల అభివృద్ధి తొమ్మిదేళ్లలో సాధించాం

అభివృద్ధిలో పరుగులు పెడుతున్న మెదక్‌ జిల్లా

మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌

ఆంధ్రజ్యోతి, ప్రతినిధి, మెదక్‌, జూన్‌ 2 : ఉద్యమాలతో సాధించుకున్న రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ పేర్కొన్నారు. మెదక్‌ కలెక్టరేట్‌ ఆవరణలో శుక్రవారం నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు చిన్నశంకరంపేట మండలకేంద్రంలోని అమరవీరుల స్తూపానికి నివాళులార్పించారు. అనంతరం కలెక్టరేట్‌లో జెండా ఎగురవేసి మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, అభివృద్ధిలో యావత్‌ దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. ఆర్థిక ఇబ్బందులు, కరోనా సంక్షోభాన్ని తట్టుకొని నిలబడేలా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దారని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరిగని అభివృద్ధి గత తొమ్మిదేళ్లలోనే చేసి చూపించామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, డబుల్‌బెడ్రూం ఇళ్లు, రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్‌ కిట్‌, దళితబంధు, కంటివెలుగు తదితర విన్నూత పథకాలను అమలు చేస్తున్న ఘనత తెలంగాణ రాష్ర్టానికే దక్కుతుందని పేర్కొన్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత మెదక్‌ జిల్లాలో అమలువుతున్న కార్యక్రమాలను మంత్రి వివరించారు.

పెరిగిన సాగు విస్తీర్ణం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మెదక్‌ జిల్లాలో సాగు విస్తీర్ణం పెరిగిందని మంత్రి తన ప్రసంగంలో వివరించారు. రాష్ట్ర ఆవిర్భావానికి 1.62 లక్షల ఎకరాల్లో పంటలు పండిస్తే.. ప్రస్తుతం 6.22 లక్షల ఎకరాలకు చేరుకుందని తెలిపారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌, కాళేశ్వరం జలాలతోనే సాగు విస్తీర్ణం పెరిగిందని పేర్కొన్నారు. రైతుబంధు పథకం ద్వారా యాసంగి సీజన్‌లో 2.40 లక్షల మంది రైతులకు రూ. 189.6 కోట్ల సాయం అందజేశామని చెప్పారు. 544 రైతు కుటుంబాలకు రైతుబీమా సొమ్ము రూ. 27.20 కోట్లను ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. 2016-17 వానాకాలంలో 72వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించగా.. ప్రస్తుత యాసంగిలో ఇది 3.51 లక్షల మెట్రిక్‌ టన్నులకు పెరిగిందన్నారు. సాగునీటి రంగంలోనూ జిల్లా ఎంతో ప్రగతిని సాధించిందని తలసాని పేర్కొన్నారు. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, విద్యుత్‌, దళితబంధు, గిరిజన సంక్షేమం, బీసీ, మైనార్టీ సంక్షేమంతో పాటు అనేక రంగాల్లో మెదక్‌ జిల్లా ముందున్నదని తెలిపారు.అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన వివిధ శాఖల ఉద్యోగులకు అవార్డులు, ప్రశంసాపత్రాలను అందజేశారు. ఉత్సవాలను పురస్కరించకుని నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వేడుకల్లో ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, కలెక్టర్‌ రాజర్షిషా, అదనపు కలెక్టర్లు రమేష్‌, ప్రతిమాసింగ్‌, ఎస్పీ రోహిణీ ప్రియదర్శిని, ఇఫ్కో డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే, జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ రోహిణి ప్రియదర్శిని త్రివర్ణ పతాకం ఎగురవేసి, అమరవీరులకు నివాళులర్పించారు.

Updated Date - 2023-06-02T23:52:45+05:30 IST