బ్రాండెడ్‌ సీసాల్లో.. గోవా లిక్కర్‌

ABN , First Publish Date - 2023-09-22T23:18:48+05:30 IST

బెల్టుషాపులే అడ్డాగా విస్తరించిన నకిలీ మద్యం రాకెట్‌ను ఎక్సైజ్‌ అధికారులు చేధించారు.

బ్రాండెడ్‌ సీసాల్లో.. గోవా లిక్కర్‌

ఎక్సైజ్‌ అధికారుల దాడుల్లో వెలుగులోకి

రూ. 8 లక్షల విలువైన మద్యం స్వాధీనం, 8 మంది అరెస్టు

నర్సాపూర్‌, సెప్టెంబరు 22: బెల్టుషాపులే అడ్డాగా విస్తరించిన నకిలీ మద్యం రాకెట్‌ను ఎక్సైజ్‌ అధికారులు చేధించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎక్సైజ్‌ డీప్యూటీ కమిషనర్‌ హరికిషన్‌, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ రజాక్‌ శుక్రవారం సాయంత్రం నర్సాపూర్‌లోని ఎక్సైజ్‌ సీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం మనోరాబాద్‌ మండలం కాళ్లకల్‌ పారిశ్రామిక ప్రాంతంలో బెల్టుషాపుల నిర్వహణపై వచ్చిన సమాచారం మేరకు ఎక్సైజ్‌ అధికారులు ఈ నెల 21వ తేదీన దాడులు నిర్వహించారు. బెల్టుషాప్‌ నిర్వాహకుడు మదన్‌చౌదరి ఇంట్లో అక్రమంగా విక్రయిస్తున్న స్థానిక మద్యంతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన నాన్‌డ్యూటీపేయిడ్‌ మద్యం సీసాలు కూడా ఉన్నట్టు గుర్తించారు. మదన్‌చౌదరి, అతడి కొడుకు సూరజ్‌చౌదరిని అదుపులో తీసుకుని విచారించగా సిద్దిపేట జిల్లా ములుగు మండలం కొత్తురు నుంచి నాన్‌డ్యూటీపేయిడ్‌ మద్యం తెచ్చి అమ్ముతున్నట్టు తెలిపారు. దీంతో ఆ ప్రాంత ఎక్సైజ్‌ అధికారులతో కలిసి కొత్తురులోని పురుషోత్తం ఇంట్లో దాడి చేయగా అక్కడ పెద్ద మద్యం రాకెట్‌ బయటపడింది. గోవా నుంచి తక్కువ ధర మద్యం తీసుకువచ్చి మన రాష్ట్రంలో విక్రయించే బ్రాండెడ్‌ సీసాల్లో నింపి విక్రయిస్తున్నట్టు గుర్తించారు. పురుషోత్తంను విచారించగా ఓరిస్సాకు చెందిన సంజయ్‌కుమార్‌ అనే వ్యక్తి గోవా నుంచి అక్రమంగా మద్యం తెస్తాడని వెల్లడించాడు. దీంతో సంజయ్‌కుమార్‌ను కూడా అదుపులో తీసుకున్నారు. రూ. 8 లక్షల విలువ చేసే మద్యం సీసాలు, సీసాల్లో మద్యం నింపి సీల్‌వేసే మిషన్‌, ఖాళీ సీసాలు, మూతలు, లేబుళ్లను స్వాధీనం చేసుకున్నారు. పురుషోత్తంకు వ్యాపారంలో సహకరిస్తున్న అతడి తండ్రి సత్తయ్య, భాస్కర్‌, దుశ్శాసన్‌ను కూడా అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించినట్టు డిప్యూటీ కమిషనర్‌ తెలిపారు.

Updated Date - 2023-09-22T23:18:48+05:30 IST