ఉపాధిహామీకి దూరం దూరం..

ABN , First Publish Date - 2023-05-02T23:40:55+05:30 IST

ఉపాధిహామీ పనులకు క్రమంగా ఆదరణ తగ్గుతున్నది. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం పనులకు వెళ్లే కూలీల సంఖ్య పూర్తిగా తగ్గింది. ఒకప్పుడు కూలీలు పూర్తిస్థాయిలో హాజరై పనిదినాలను పూర్తిచేసుకునేవారు.

ఉపాధిహామీకి దూరం దూరం..
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు(ఫైల్‌)

జిల్లాలో 20 శాతానికి మించని కూలీల హాజరు

కొత్త నిబంధనలతో నిరాసక్తి

గతేడాది కంటే తగ్గిన ఉపాధిహామీ పనులు

సిద్దిపేట అర్బన్‌/ అగ్రికల్చర్‌, మే 2 : ఉపాధిహామీ పనులకు క్రమంగా ఆదరణ తగ్గుతున్నది. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం పనులకు వెళ్లే కూలీల సంఖ్య పూర్తిగా తగ్గింది. ఒకప్పుడు కూలీలు పూర్తిస్థాయిలో హాజరై పనిదినాలను పూర్తిచేసుకునేవారు. ఇప్పుడు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 30శాతం కూడా ఉపాధి కూలీలు పనికి వెళ్లడం లేదంటే అతిశయోక్తి కాదు. ఉపాధి హామీ పని ఇంతకుముందు స్టేట్‌ కమాండింగ్‌ కంట్రోల్‌లో ఉండేది ఇప్పుడు ‘‘ఎన్‌ఐసీ’’కి వెళ్లడంతో కొత్తరూల్స్‌ వచ్చాయి. దీంతో చాలామంది కూలీలు ఆసక్తి చూపడం లేదు.

సిద్దిపేట జిల్లాలో 2,10,849 జాబ్‌ కార్డులున్నాయి. జాబ్‌కార్డులో నమోదైన కూలీల సంఖ్య 4,39,396. ఇందులో కూలీకి వెళ్లే వారి సంఖ్య 2.10లక్షలు. గతేడాది ఏప్రిల్‌లో 62వేల మంది కూలీలు పనులకు వెళ్తే ఈ ఏడాది కేవలం 30వేల మంది మాత్రమే పనిచేశారు. సగటున కేవలం 15 నుంచి 20 శాతం మంది మాత్రమే ఉపాధి పనికి వెళ్తున్నారు. 100 రోజుల పనిదినాల సంఖ్య ఉన్నప్పటికీ కొంత మంది కూలీలు ఇప్పటికీ కొత్త పనులను ప్రారంభించలేదు.

మారిన రూల్స్‌తో తగ్గిన ఆసక్తి

గతంలో ఉపాధిహామీ కూలీలు గ్రూపుగా ఏర్పడి తమకు కేటాయించిన పనిని గంట రెండు గంటల్లో పూర్తిచేసుకుని వచ్చి మరో పనికి వెళ్లేవారు. కానీ ప్రస్తుతం ఫొటో క్యాప్చర్‌ విధానం వల్ల సగటున కూలీ ఉపాధిహామీ పని వద్ద నాలుగు గంటలు వేచి ఉండాల్సిందే. ఉదయం పనికి వెళ్లగానే ఫొటో క్యాప్చర్‌ చేసుకుంటే, మళ్లీ నాలుగు గంటల తర్వాత ఫొటో క్యాప్చర్‌ చేసుకోవాలి. నాలుగు గంటలు అక్కడే ఉండలేక కూలీలు పని అంటేనే ఆసక్తి చూపడం లేదు. గతంలో కంటే కూలి కూడా చాలా తక్కువగా రావడం కూడా ఒక కారణం. ఒకప్పుడు 272 రూపాయలు చెల్లించేవారు. ఇప్పుడు రూ.178 మాత్రమే ఇస్తున్నారు. ఇక ఉపాధిహామీ స్టేట్‌ గవర్నమెంట్‌ కంట్రోల్‌లో ఉన్నప్పుడు మార్చిలో రూ.25, ఏప్రిల్‌, మే నెలలో రూ.30 కూలి అదనంగా జమయ్యేది. కానీ ప్రస్తుతానికి అందడం లేదు. వేసవిలో అదనపు కూలి పడకపోవడంం, తాగునీరు, గడ్డపార, ఇతర సౌకర్యాలు లేకపోవడంతో ఆసక్తి చూపడం లేదు. కూలీలను అధిక సంఖ్యలో పనికి తీసుకురావాలన్న అధికారుల ప్రయత్నాలు కొత్తరూల్స్‌ ముందు పనిచేయడం లేదు.

కొత్తరూల్స్‌ వల్ల పనిపై ఆసక్తి రావడం లేదు

- ప్రభాకర్‌, సిద్దిపేట అర్బన్‌ మండలం

గతంలో ఉపాధి పనికి వెళ్తే గంటో, రెండు గంటలో పనిచేసుకుని వచ్చేవాళ్లం. కూలి కూడా సకాలంలో అందేవి. కానీ ఇప్పుడు నాలుగు గంటలు పనిచేయాలంటున్నరు. ఇంత చేసినా రూ.200 పడడం లేదు. ఆ నాలుగు గంటల సమయంలో బయట కూలికి వెళ్తే రూ.300 వస్తాయి. కొత్తగా రూల్స్‌ తీసుకొచ్చి ఉపాధిహామీ పనిని కష్టం చేశారు.

Updated Date - 2023-05-02T23:40:55+05:30 IST