‘పద్దు’పొడుపు

ABN , First Publish Date - 2023-02-07T00:12:27+05:30 IST

సంక్షేమం, అభివృద్ధి రంగాలకు ప్రాధాన్యం కల్పిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు సోమవారం అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

‘పద్దు’పొడుపు

నాలుగోసారి బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మంత్రి హరీశ్‌రావు

బడ్జెట్‌లో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం

కాళేశ్వరం కాలువల నిర్మాణానికి నిధులు

‘గడ’ అభివృద్ధికి, ములుగు అటవీ కళాశాలకు రూ.100 కోట్ల చొప్పున కేటాయింపు

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, ఫిబ్రవరి 6 : సంక్షేమం, అభివృద్ధి రంగాలకు ప్రాధాన్యం కల్పిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు సోమవారం అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ పద్దులో కేటాయించిన నిధులతో జిల్లాకు ప్రయోజనం చేకూరనున్నది. ఎన్నికల ఏడాది కావడంతో రైతులు, పేదలు, సామాజిక వర్గాల సంక్షేమంతోపాటు పల్లెలు, పట్టణాల అభివృద్ధి, వ్యవసాయ, సాగునీటి రంగాలకు పెద్దపీట వేశారు.

రాష్ట్ర ఆర్థిక మంత్రిగా నాలుగోసారి బడ్జెట్‌ ప్రవేశపెట్టిన హరీశ్‌రావు జిల్లాలోని సిద్దిపేట ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. జిల్లాకు తగిన ప్రాధాన్యం కల్పించేలా ఆయా రంగాలకు నిధులు కేటాయించారు. జిల్లాలో ఉన్న అటవీ కళాశాలకు రూ.100 కోట్లు, గజ్వేల్‌ ఏరియా డెవల్‌పమెంట్‌ అథారిటీ(గడా)కు రూ.100కోట్లు ప్రకటించారు. ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ఆస్పత్రి నిర్మాణం, వెటర్నరీ కళాశాల నిర్మాణాలతోపాటు శ్రీకొమురవెల్లి మల్లన్నసాగర్‌, రంగనాయకసాగర్‌ రిజర్వాయర్ల పర్యాటక అభివృద్ధికి నిధులు కేటాయించడం జరిగింది.

కాళేశ్వరం కాలువలకు నిధులు

సాగునీటి రంగానికి రూ.26,885 కోట్ల నిధులను కేటాయించడంతో జిల్లా రైతుల్లో ఆశలు చిగురించాయి. ఇప్పటికే అన్నపూర్ణ, రంగనాయకసాగర్‌, శ్రీకొమురవెల్లి మల్లన్నసాగర్‌, కొండపోచమ్మసాగర్‌, గౌరవెల్లి రిజర్వాయర్ల నిర్మాణం జరిగింది. వీటికి అనుసంధానంగా ప్రధాన కాలువలను నిర్మించారు. ఈ కాలువలకు అనుసంధాన్నిస్తూ మైనర్‌, సబ్‌మైనర్‌ కాలువలను నిర్మిస్తే నేరుగా రైతుల పొలాల వద్దకు సాగునీరు అందుతుంది. అయితే నిధుల కొరత వల్ల ఈ మైనర్‌, సబ్‌మైనర్‌ కాలువలను నిర్మించడంలో జాప్యం జరిగింది. తాజాగా ప్రకటించిన నిధులతో వచ్చే ఏడాది వరకు కాలువల నిర్మాణం పూర్తయ్యే అవకాశంఉంది. ఇప్పటికే భూసేకరణతుదిదశకు చేరింది. అదే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రిజర్వాయర్ల వద్ద పర్యాటక అభివృద్ధి కోసం రూ.750 కోట్లను కేటాయించారు.

సుమారు 8వేల మందికి గృహ యోగం

తాజా బడ్జెట్‌లో సొంతిల్లు నిర్మించుకునే అంశంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. స్థలం ఉన్నవారికి రూ.3లక్షల ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించారు. నియోజకవర్గంలో 2వేల మంది చొప్పున తొలిదశలో సాయం అందుతుందని వివరించారు. జిల్లాలో సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్‌, హుస్నాబాద్‌ నియోజకవర్గాలతోపాటు జనగామ నియోజకవర్గంలోని చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, దూళిమిట్ట మండలాలు, మానకొండూరు నియోజకవర్గంలోని బెజ్జంకి మండలం ఉన్నాయి. ఈ లెక్కన సుమారు 7వేల మందికి రూ.3లక్షల చొప్పున సాయం అందే అవకాశం ఉంది. ఇక సీఎం కేసీఆర్‌ కోటాలో 25వేల మందికి సాయం ఉండగా జిల్లాకు ఒక వెయ్యి మందికిపైగా మంజూరు చేయనున్నారు. మొత్తంగా 8వేల మందికి సాయం అందనుంది.

4వేల మందికి దళితబంధు

దళితబంధు కింద ఇప్పటికే జిల్లాలో 496 కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున సహాయం అందించారు. ప్రస్తుత బడ్జెట్‌లో దళితబంధుకు రూ.17,700 కోట్లు కేటాయించారు. అదే విధంగా నియోజకవర్గానికి 1100మందికి చొప్పున ఈ దఫా లబ్ధి చేకూర్చాలని నిర్ణయించారు. ఈ లెక్కన దాదాపు 4వేల కుటుంబాలకు దళితబంధు సాయం అందే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా బీసీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల సంక్షేమం కోసం ఈ బడ్జెట్‌లో తగిన ప్రాధాన్యం కల్పించారు. మహిళా సంక్షేమానికి రూ.2,131 కోట్లు కేటాయించారు.

పల్లెలు, పట్టణాలకు ప్రాధాన్యం

జిల్లాలో 499 గ్రామపంచాయతీలు, 5 పట్టణాలు ఉన్నాయి. బడ్జెట్‌లో పల్లెల ప్రగతి పేరిట రూ.31,426 కోట్లు, పట్టణ ప్రగతికి రూ.11,372 కోట్లను కేటాయించారు. ఈ నిధులతో పల్లెల రూపురేఖలు మారనున్నాయి. ఇప్పటికే జిల్లాలోని ప్రతీ పల్లెలో వైకుంఠధామం, పల్లె ప్రకృతివనం, క్రీడా ప్రాంగణం, డంపుయార్డుల నిర్మాణం చేపట్టారు. సబ్సిడీ ట్రాక్టర్‌ ద్వారా చెత్త సేకరణ చేపడుతున్నారు. అదే విధంగా పట్టణాల్లోనూ రహదారులు, డ్రైనేజీలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

Updated Date - 2023-02-07T00:12:29+05:30 IST