పరీక్షల టెన్షన్
ABN , First Publish Date - 2023-03-14T23:30:51+05:30 IST
పరీక్షల కాలం దగ్గరైంది. సంవత్సర కాలం పాటు వ్యయ ప్రయాసలకోర్చి చదువుకున్న విద్యార్థుల భవితవ్యం తేల్చే ప్రత్యేక సమయం ఆసన్నమైంది.
నేటి నుంచి ఇంటర్ , ఏప్రిల్ 3 నుంచి టెన్త్ వార్షిక పరీక్షలు
ఒత్తిడిలో టెన్త్, ఇంటర్ విద్యార్థులు
ఆందోళనను అధిగమిస్తే విజయం తథ్యం
చేర్యాల, మార్చి 14: పరీక్షల కాలం దగ్గరైంది. సంవత్సర కాలం పాటు వ్యయ ప్రయాసలకోర్చి చదువుకున్న విద్యార్థుల భవితవ్యం తేల్చే ప్రత్యేక సమయం ఆసన్నమైంది. పుస్తకాలతో కుస్తీ పట్టి మేథస్సును మదించి పొందిన జ్ఞానానికి మార్కుల రూపంలో ప్రతిఫలం అందించే వార్షిక పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇటీవల ఇంటర్ ప్రాక్టికల్స్ ముగిసిన నేపథ్యంలో నేటి(బుధవారం) నుంచి థియరీ పరీక్షలు, పదోతరగతి విద్యార్థులకు ప్రీ-ఫైనల్ , ఏప్రిల్ 3వ తేదీ నుంచి వార్షిక పరీక్షలు జరగనుండడంతో ఇంటర్, టెన్త్ విద్యార్థులు అంతిమ ఫలితం పొందడానికి సన్నద్ధమవుతున్నారు. వందశాతం ఫలితాలు పొందేందుకు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులను సైతం నిర్వహిస్తున్నారు. అలాగే ఏప్రిల్ 12 నుంచి 1-9వ తరగతి విద్యార్థులకు, ఏప్రిల్ 3వ వారం నుంచి డిగ్రీ విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు జరగనుండడంతో విద్యార్థులు పరీక్షల ఫీవర్‌తో ఒత్తిడికి లోనవుతున్నారు. విఫలమైతే సంవత్సరకాలం పాటు పడిన శ్రమ బూడిదలో పోసిన పన్నీరవుతుందని ఆందోళన చెందుతున్నారు. కానీ ఒత్తిడిని అధిగమించి పలు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాన్ని పొందడం సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. చిన్నపాటి చిట్కాలు పాటించాలని సూచిస్తున్నారు.
జవాబుపత్రంపై హాల్‌టికెట్ నంబర్ మొదలగు సమాచారాన్ని విధిగా, స్పష్టంగా రాయాలి.
బాగా తెలిసిన సమాధానంతో జవాబు పత్రాన్ని ప్రారంభించాలి.
సమాధానాన్ని సాంకేతిక పదాలతో రాసే ప్రయత్నం చేయండి.
ముఖ్యమైన పదాలకింద గీత గీయండి. ఫలితంగా దిద్దే వారికి సులభంగా అవగాహన కలిగి మంచి మార్కులు పొందొచ్చు
ఎంత ఎక్కువ రాసామని కాకుండా, ఎక్కువ సమాచారాన్ని రాయడం అలవరచుకోండి.
ప్రశ్నాపత్రంపై ఎలాంటి రాతలు రాయకండి.
ప్రశ్న సంఖ్యను విధిగా రాయాలి
సమాధాన పత్రంపై మతపరమైన అంశాలు రాయకండి.
పరీక్ష రాయడానికి అవసరమైన అన్ని వస్తువులను తీసుకెళ్లండి. ఇతరులపై ఆధారపడడం వల్ల మీ సమయం వృథా కావడమే కాక, కాపీ చేస్తున్నారన్న అనుమానం వచ్చే అవకాశం ఉంది.
గణితానికి సంబంధించి చిత్తుపని మొత్తం ఒకే పేపర్‌పై రాసి సమాధానపత్రానికి చివరన జత చేయండి.
జీవశాస్త్రానికి సంబంధించి చక్కని పటములు గీయండి. అవి పూర్తి సమాధానాన్ని అందజేస్తాయని గమనించండి.
తేడాలు, పోలికలను పట్టిక రూపంలో రాయడం మరువొద్దు.
ప్రశ్నాపత్రాన్ని పూర్తిగా చదవండి. ఒకటి, రెండు ప్రశ్నలకు సమాధానాలు రాకున్నా ఆందోళన చెందకండి. ఒకవేళ ఆందోళన చెందితే జవాబులు కూడా మరిచిపోయే అవకాశం ఉంది.
బిట్ పేపర్ ర్యాంక్ డిసైడర్ అన్న విషయం గమనించండి. దిద్దడం, కొట్టివేతలను సాధ్యమైనంత వరకు నివారించండి. పరీక్షకు కొద్ది సమయం ముందు నుంచే చదవడం ఆపేయండి.
అరగంట ముందే సెంటర్‌కు చేరడం వల్ల మానసిక ఒత్తిడి దూరమవుతుందని గమనించండి.
గడిచిన పరీక్షలోని లోటుపాట్లపై చర్చ కన్నా, రాయబోయే దానిపై శ్రద్ధ అవసరమని గుర్తించండి.
ఒత్తిడి ని అధిగమించేందుకు...
పరీక్షల కాలంలో విద్యార్థులను బాధించే అంశాల్లో ప్రధానమైంది ఒత్తిడి. ఓ వైపు తల్లిదండ్రుల నుంచి మరోవైపు విద్యా సంస్థల నుంచి కలిగే ఒత్తిడి పిల్లలను ఆందోళనకు గురి చే స్తుండడం సర్వసాధారణంగా మారింది. రోగ నిరోధక శక్తి తగ్గడం, నిద్రలేమి, అలసట, ఆత్మన్యూనత వంటి దుష్పరిణామాలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలి. ఒకసారి ఒకే విషయంపై దృష్టి పెట్టడం, పటిష్ఠమైన ప్రణాళిక ఏర్పాటు చేసుకొని పాటించడం, మానసిక ఉల్లాసాన్ని పొందే పనులు చేయడం, సమతుల పోషకాహారాన్ని తీసుకోవడం, సరిపడినంత సమయం నిద్రించడం, ధ్యానం, యోగాలను అనుసరించడంతో పాటు ఆకుకూరలు, పాలు, నిమ్మజాతికి చెందిన ఫలాలు, విటమిన్-బి అధికంగా ఉన్న చికెన్, పప్పుదినుసులు, గుడ్డు, విత్తనాలు వంటి మూడ్ రెగ్యులేటర్లను అధికంగా తీసుకోవడం వల్ల సత్ఫలితాలను పొందొచ్చని నిపుణులంటున్నారు.
భయాందోళన వీడాలి
- బొడ్డు వినోద్‌కుమార్, వ్యక్తిత్వ వికాస నిపుణుడు
విద్యార్థులు పరీక్షల కాలంలో ముఖ్యంగా టీవీలు, సెల్‌ఫోన్ వాడకానికి దూరంగా ఉండాలి. ప్రతీ గంట చదివిన తరువాత కొంత విరామం తీసుకోవడం అవసరం. వ్యక్తిగా చదివిన తరువాత సమూహంగా కూర్చొని, చదివిన విషయాన్ని చర్చించడం వల్ల ఎక్కువ ఫలితం ఉంటుంది. స్లో లర్నర్స్ కొత్త పాఠాలను చదవడం కన్న చదివిన విషయంలోనే ప్రావీణ్యం సాధించడంపై దృష్టి పెట్టాలి. రోజూ ఉదయం కొద్దిసేపు ప్రాణాయామం, ధ్యానం చేయండి. మధ్యాహ్నం 15 నిముషాలు కునుకు తీయడం, సాయంత్రం 15 నిమిషాలు ఆటలాడడం వల్ల శరీరం ఉత్తేజితమవుతుంది. సాత్వికాహారం తీసుకోవాలి. సానుకూల ధృక్పథాన్ని అలవర్చుకోవాలి.