కొండపోచమ్మ జాతరకు సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2023-01-21T23:18:44+05:30 IST

మండలంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలిసిన శ్రీ కొండ పోచమ్మ ఆలయం జాతరకు ముస్తాబైంది.

కొండపోచమ్మ జాతరకు సర్వం సిద్ధం
ఆలయంలో కొలువైన కొండపోచమ్మ

జగదేవ్‌పూర్‌, జనవరి 21: మండలంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలిసిన శ్రీ కొండ పోచమ్మ ఆలయం జాతరకు ముస్తాబైంది. మండలంలోని తీగుల్‌ నర్సాపూర్‌ గ్రామ సమీపంలో ఉన్న ఈ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. కొండ పోచమ్మను స్వయాన కొమురవెల్లి మల్లికార్జునస్వామికి చెల్లెలుగా చెబుతుంటారు. కొండపోచమ్మ ఉత్సవాలను సంక్రాంతి, భోగి పండుగ రోజున సదరు పటంతో అంకురార్పణ చేస్తారు. సంక్రాంతి రోజున ప్రారంభమై వచ్చే ఉగాది పండుగతో జాతర ఉత్సవాలు ముగుస్తాయి. ఈ నెల 23 నుంచి జాతర ప్రారంభమవుతుంది. జాతరకు జంట నగరాలు హైదరాబాద్‌, సికింద్రాబాద్‌తో పాటు వరంగల్‌, కరీంనగర్‌, అదిలాబాద్‌, యాదాద్రి భువనగిరి, జనగామ తదితర జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. భక్తుల రద్దీ దృష్ట్యా పారిశుధ్య పనుల కోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించినట్టు గ్రామ సర్పంచ్‌ రజితా రమేష్‌ తెలిపారు.

ఆకట్టుకునే పట్నం బోనాలు

జాతరలో పాల్గొనే భక్తులు ఆలయం ముందున్న చెరువులో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటారు. అమ్మవారి నైవేద్యం వండిన భోజనాన్ని పసుపు, కుంకుమలతో అలంకరించి డప్పులతో ఆడుతూ పాడుతూ అమ్మవారి సన్నిధికి తీసుకువస్తారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ నుంచి వచ్చే భక్తులు తీసే బోనాలు జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అమ్మవారి ఆలయం వద్ద ఉన్న చెట్టుకు భక్తులు ముడుపులు కడతారు. కోరిక తీరగానే అమ్మవారికి ముడుపులు చెల్లిస్తారు. సంతానం కావాలనుకునేవారు తొట్టెల ముడుపులు కడతారు.

Updated Date - 2023-01-21T23:19:06+05:30 IST