ప్రతీ కార్యకర్త కేసీఆర్‌లా పనిచేయాలి
ABN , First Publish Date - 2023-09-21T23:45:40+05:30 IST
ప్రతీ కార్యకర్త కేసీఆర్‌లా పనిచేయాలని, ఉద్యమనేత.. బీఆర్‌ఎస్ అధినేతను మూడోసారి సీఎంను చేయడానికి కృషిచేయాలని ఆర్థిక, వైద్యఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు.

ఉద్యమ నేతను మూడోసారి సీఎం చేయాలి
ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు
రామచంద్రాపురం, సెప్టెంబరు 21 : ప్రతీ కార్యకర్త కేసీఆర్‌లా పనిచేయాలని, ఉద్యమనేత.. బీఆర్‌ఎస్ అధినేతను మూడోసారి సీఎంను చేయడానికి కృషిచేయాలని ఆర్థిక, వైద్యఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరులోని 4,500 ఇళ్ల పట్టాలను గురువారం ఆయన లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొల్లూరులో రూ.40 కోట్లకు ఎకరం పలికే భూముల్లో కేసీఆర్ ఆధ్వర్యంలోని తమ ప్రభుత్వం 20 వేల డబుల్‌బెడ్రూం ఇళ్లను నిర్మించి పేదలకు ఇచ్చిందని పేర్కొన్నారు. ఇక్కడి టౌన్‌షి్‌పలో ప్రజల సౌకర్యం కోసం ఆర్టీసీ బస్సు సౌకర్యం, బడి, బస్తీదవాఖానా, రేషన్‌షాపు, పోలీ్‌సస్టేషన్ తదితర సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. పేదలు ఆత్మగౌరంతో బతకడానికే హైదరాబాద్‌లో లక్ష డబుల్‌బెడ్రూం ఇళ్లను నిర్మించి ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రాన్ని 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, టీడీపీ ఈ పని చేయలేకపోయాయని విమర్శించారు. గతంలో ఇళ్ల నిర్మాణానికి అరకొరగా చేసిన సాయానికి కూడా లంచాలు ఇస్తేనే మంజూరు చేసేవారని ఆరోపించారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. గోదావరి, కృష్ణా జలాలను తీసుకొచ్చి హైదరాబాద్‌లో తాగునీటి కొరతను తీర్చారని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఈపని చేయలేకపోయాయని విమర్శించారు. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన ప్రముఖ సినీ నటుడు రజినీకాంత్ ‘ఇది హైదరాబాదా.. లేక అమెరికానా? అంటూ ఆశ్చర్యానికి గురయ్యారని తెలిపారు. రజినీకాంత్‌కు కనిపించిన అభివృద్ధి మన గజినీలకు కనిపించడంలేదని ఎద్దేవా చేశారు. ప్రజల కోసం పలు సంక్షేమ పథకాలు అందిస్తున్న కేసీఆర్‌కు కాంగ్రెస్, బీజేపీ వాళ్ల తిట్లు, శాపనార్థాలు కూడా దీవెనలుగా మారుతున్నాయన్నారు. ఎన్నికలు వస్తున్నాయంటే దొంగ డిక్లరేషన్లు, హామీలతో కొందరు వస్తుంటారని విమర్శించారు. అలాంటి వారిని ప్రజలు నమ్మబోరని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్‌రెడ్డి, దానం నాగేందర్, ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ వి.భూపాల్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ లలితాసోమిరెడ్డి, కార్పొరేటర్ వి.సింధూఆదర్శరెడ్డి. మాజీ కార్పొరేటర్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.