రెండు గదుల ఇంటికి వేలల్లో విద్యుత్‌ బిల్లులు

ABN , First Publish Date - 2023-03-19T23:53:10+05:30 IST

వినియోగంలో లేని గృహాలకు, రెండు గదులున్న ఇంటికి వేలల్లో బిల్లులు వస్తుండడంతో, బకాయిల వసూలు కోసం వచ్చిన ట్రాన్స్‌కో బిల్‌ కలెక్టర్‌ను బిల్లులు చెలించకుండా తిప్పిపంపిన సంఘటన అల్లాదుర్గం మండలంలోని గడిపెద్దాపూర్‌లో చోటుచేసుకుంది.

రెండు గదుల ఇంటికి వేలల్లో విద్యుత్‌ బిల్లులు
విద్యుత్‌ బిల్లుల రశీదులతో ఆందోళన చేస్తున్న గ్రామస్థులు

ఇష్టానుసారంగా జరిమానాలు విధిస్తున్నారని ఆందోళన

బిల్లులు చెల్లించకుండా బిల్‌ కలెక్టర్‌ను తిప్పి పంపిన గడిపెద్దాపూర్‌ గ్రామస్థులు

అల్లాదుర్గం, మార్చి 19: వినియోగంలో లేని గృహాలకు, రెండు గదులున్న ఇంటికి వేలల్లో బిల్లులు వస్తుండడంతో, బకాయిల వసూలు కోసం వచ్చిన ట్రాన్స్‌కో బిల్‌ కలెక్టర్‌ను బిల్లులు చెలించకుండా తిప్పిపంపిన సంఘటన అల్లాదుర్గం మండలంలోని గడిపెద్దాపూర్‌లో చోటుచేసుకుంది. గ్రామస్థులు, బాధితుల కథనం ప్రకారం... గ్రామంలో కొన్ని నెలలుగా విద్యుత్‌ వినియోగించని ఇళ్లకు, ఒక ఫ్యాన్‌, రెండు బల్బులున్న ఇంటికి సైతం రూ. 2 వేల నుంచి రూ. 3 వేల వరకు కరెంటు బిల్లులు వస్తున్నాయి. దీంతో బాధితులు సంబంధిత ట్రాన్స్‌కో అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ అదే తరహాలో అధికంగా విద్యుత్‌ బిల్లులు వస్తుండడంతో ఆదివారం కరెంటు బిల్లుల వసూలు కోసం వచ్చిన ట్రాన్స్‌కో బిల్‌కలెక్టర్‌ శ్రీనివా్‌సపై మండిపడ్డారు. బిల్లులు వసూలు చేయడం మాత్రమే తమ వంతని, అధిక బిల్లులపై తమకు సంబంధం లేదంటూ బిల్‌ కలెక్టర్‌ బదులిచ్చారు. దీంతో ట్రాన్స్‌కో హెల్పర్‌ మొగులయ్యను పిలిపించి అధిక బిల్లులపై నిలదీశారు. విద్యుత్‌ వినియోగం లేని గృహాలకు, ఒక ఫ్యాన్‌, రెండు బల్బులున్న ఇంటి మీటర్లకు సైతం వేల రూపాయల బిల్లు ఎలా వస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్య వైఖరితో తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఏదో ఒక సాకుతో జరిమానాలు విధిస్తూ వేధిస్తున్నారని నిలదీశారు. పాత మీటర్‌ ఉన్న ఇళ్లకు కొత్త మీటరును ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ట్రాన్స్‌కో అధికారులపై ఉందని, ఈవేవీ పట్టనట్లుగా జరిమానాల పేరుతో వేల రూపాయల బిల్లులు వేస్తూ ఇబ్బంది పెడుతున్నారన్నారు. కరెంటు మీటర్లను సరి చేసేంత వరకు గ్రామంలో ఎవరూ బిల్లులు చెల్లించబోరంటూ గ్రామంలోని చావడి వద్ద గ్రామస్థులు ఆందోళన చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొన్నది. ఈ విషయమై బిల్‌ కలెక్టర్‌ సంబంధిత అధికారులకు సమస్యను వివరించారు. వారి సూచనతో సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తామంటూ గ్రామస్థులకు తెలిపారు. ఈ విషయమై పలుమార్లు సంబంధిత అధికారులకు విన్నవించిన తమ గోడు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు వాపోయారు. సమస్యను పరిష్కరిస్తేనే బిల్లులు చెల్లిస్తామంటూ వారు పట్టుబట్టడంతో, చేసేదేమీ లేక బిల్‌ కలెక్టర్‌ కరెంటు బిల్లులు వసూలు చేయకుండానే వెనుదిరిగిపోయారు.

Updated Date - 2023-03-19T23:53:10+05:30 IST