ఎన్నికలు వస్తున్నాయి.. ప్రజాసేవ చేసి గెలవాలి

ABN , First Publish Date - 2023-02-13T23:45:32+05:30 IST

మద్దూరు, ఫిబ్రవరి 13: ఎన్నికలు వస్తున్నాయి. ప్రజాసేవ చేసి మళ్లీ గెలిచేందుకు ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రజాప్రతినిధులకు సూచించారు.

ఎన్నికలు వస్తున్నాయి.. ప్రజాసేవ చేసి గెలవాలి
మండల సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

విద్యుత్‌ సమస్యలపై సర్వసభ్య సమావేశంలో అధికారుల నిలదీత

మద్దూరు, ఫిబ్రవరి 13: ఎన్నికలు వస్తున్నాయి. ప్రజాసేవ చేసి మళ్లీ గెలిచేందుకు ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రజాప్రతినిధులకు సూచించారు. సోమవారం ఎంపీపీ బద్దిపడిగె కృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన మండల సభకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, చేర్యాల మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సుంకరి మల్లేశం హాజరయ్యారు. ఈ సందర్భంగా మండల రైతాంగం ఎదుర్కొంటున్న విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి నిర్లక్ష్యం వహిస్తున్న అధికారుల తీరుపై ప్రజాప్రతినిధులు మండల సభలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయానికి కేవలం 6 గంటలే విద్యుత్‌ను అందిస్తూ 24 గంటల విద్యుత్‌ అందిస్తున్నట్లు చెప్పుకోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నట్లు ఎంపీటీసీలు, సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 18 గంటలు అందిస్తున్నట్లు విద్యుత్‌ అఽధికారులు కూడా తెలుపడం శోచనీయని, 18 గంటల విద్యుత్‌ను అందిస్తున్నట్లు హామీ ఇస్తూ సభలో తీర్మానం చేయగలరా అంటూ బెక్కల్‌ సర్పంచ్‌ కూకట్ల బాల్‌రాజ్‌ ప్రశ్నించారు. ఇళ్ల మీదుగా విద్యుత్‌ తీగలు వేలాడుతున్నాయని, వ్యవసాయ పొలాల్లో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ప్రమాదకరంగా మారాయని గత మండల సభ దృష్టికి తీసుకొచ్చినా నేటికీ సమస్య పరిష్కరించలేదని కమలాయపల్లి సర్పంచ్‌ ఓరుగంటి అంజయ్య అధికారుల తీరుపై మండిపడ్డారు. అర్జున్‌పట్ల, కమలాయపల్లి గ్రామాలను చేర్యాల మండల సభలో పాల్గొనే విధంగా చూడాలని సభ దృష్టికి తీసుకొచ్చారు. గ్రామంలోని కొందరు అనుమతులు లేకుండా పోలీసు, రెవెన్యూ అధికారుల అండదండలతో ఇష్టానుసారంగా జెనిగెలవాగు నుంచి 40 ట్రాక్టర్ల ద్వారా ప్రతిరోజు ఇసుక తరలిస్తుండటంతో గ్రామస్థుల్లో నిద్రలేకుండాపోతోందని, చర్యలు తీసుకోవాలని సర్పంచ్‌ కూకట్ల బాల్‌రాజ్‌ కోరారు. మండలంలో ఏళ్ల క్రితం బీడీ కార్మికులకు మంజూరైన ఇళ్ల స్థలాల్లో ఇళ్లు నిర్మించుకోకపోవడంతో స్థలాన్ని స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు రైతు గోదాం నిర్మాణంతో పాటు మిగిలిన స్థలాన్ని మినీ స్టేడియానికి కేటాయించారని, ఈ స్థలంలో కొందరు పాలకవర్గానికి, ఎమ్మెల్యేకు సమాచారం లేకుండా బీడీ కార్మికులకు ఇళ్లస్థలాన్ని కేటాయించడంపై ఎంపీటీసీ సమ్మయ్య సభ దృష్టికి తీసుకొచ్చారు. ఇళ్ల నిర్మాణాలను ఆపి, స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని తహసీల్దార్‌కు ఎంపీపీ సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సభకు వచ్చిన సమస్యల పరిష్కారానికి ఆయాశాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. 18 గంటల విద్యుత్‌ను ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

Updated Date - 2023-02-13T23:45:33+05:30 IST