Share News

దుడ్డెచెరువు కట్టకు లీకేజీ..వృథాగా పోతున్న నీరు

ABN , Publish Date - Dec 17 , 2023 | 10:46 PM

ఓవైపు చెరువు నిండిందని ఆనందపడాలో.. కట్ట కింది నుంచి లీకవుతున్న నీటితో అర్థంకాని దుస్థితి రైతుల్లో నెలకొన్నది.

దుడ్డెచెరువు కట్టకు లీకేజీ..వృథాగా పోతున్న నీరు
నిండుకుండలా కుకునూరుపల్లి మండలం మంగోలు దుడ్డె చెరువు, కట్ట కింద ఏర్పడిన లీకేజీ నుంచి వృథాగా పోతున్న నీరు

కట్ట కింద పొలాలు జలమయం

మరమతు చేపట్టాలని రైతుల విజ్ఞప్తి

కొండపాక, డిసెంబరు 17 : ఓవైపు చెరువు నిండిందని ఆనందపడాలో.. కట్ట కింది నుంచి లీకవుతున్న నీటితో అర్థంకాని దుస్థితి రైతుల్లో నెలకొన్నది. కుకునూరుపల్లి మండలం మంగోల్‌ దుడ్డెచెరువు జలకళను సంతరించుకున్నది. తాగునీటి సరఫరా కోసం మల్లన్నసాగర్‌ నుంచి మంగోల్‌ శివారులో నిర్మించిన వాటర్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్‌కు నీరు సరఫరా అవుతుంది. ఇక్కడ నీటిని శుద్ధి చేసిన తర్వాత వృథా నీటిని మంగోల్‌ దుడ్డె చెరువుకు మళ్లించారు. నెల రోజులుగా చెరువుకు నీళ్లు చేరడంతో పూర్తిగా నిండి అలుగు సైతం పారుతున్నది. కాగా దుడ్డె చెరువు కట్ట కింద పలుచోట్ల లీకేజీలు ఏర్పడ్డాయి. దీంతో చెరువు నుంచి నీరు లీకవుతున్నది. ఇలా వృథాగా పోతున్న నీరు కట్ట కింద పొలాల్లోకి చేరుతున్నది. దీంతో కోతకు వచ్చిన వరి పంట కోయలేని పరిస్థితి ఏర్పడింది. పది ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది. చెరువు కట్ట మరమ్మతు చేయాలని బాధిత రైతులు కోరుతున్నారు. అయితే దుడ్డెచెరువు నిండి అలుగు పారితే అక్కడి నుంచి నల్లచెరువుకు చేరుతుంది. కానీ నల్లచెరువుకు గండిపడడంతో కథ మొదటికి వచ్చింది. నెలలు గడుస్తున్న ఇది మరమతుకు నోచుకోలేదు. అటు దుడ్డె చెరువు లీకేజీ మరమతులను, ఇటు నల్ల చెరువును గండి పూడ్చివేత పనులను చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

చెరువు కట్ట లీకేజీలను మరమ్మతు చేయండి

చెరువు నుంచి నీరు వృథా పోకుండా కట్టకు ఏర్పడిన లీకేజీలను మరమ్మతు చేయాలి. పంటలను కాపాడాలి. వృథాగా పారుతున్న నీరు పొలాల్లో నిలవడంతో పంటలకు నష్టం వాటిల్లింది. పెట్టుబడిరాని పరిస్థితులు ఏర్పడ్డాయి.

- ఎల్లు శ్రీనివా్‌సరెడ్డి, రైతు, మంగోల్‌

Updated Date - Dec 17 , 2023 | 10:46 PM