నేటి నుంచి సంగారెడ్డి జిల్లాలో బడి బయట పిల్లల సర్వే
ABN , First Publish Date - 2023-01-05T23:53:08+05:30 IST
బడీడు పిలల్ల ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్బంధ విద్యాహక్కు చట్టాన్ని అమలు చేస్తున్నాయి.
సంగారెడ్డి అర్బన్, జనవరి 5 : బడీడు పిలల్ల ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్బంధ విద్యాహక్కు చట్టాన్ని అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా పాఠశాలలకు రాని బడీడు పిల్లలను గుర్తించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. బడి బయట ఉన్న బడీడు పిల్లలను తిరిగి చేర్పించేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రతీ విద్యా సంవత్సరం రెండు సార్లు సర్వే నిర్వహిస్తున్నది. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి రెండో విడత సర్వేను ఈ నెల 6 నుంచి 18 వరకు చేపట్టనున్నారు. సర్వే ద్వారా బడి బయట ఉన్న 6 ఏళ్ల నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలను, కళాశాల స్థాయిలో 15-19 ఏళ్ల పిల్లలను వేర్వేరుగా గుర్తించి జాబితా రూపొందించనున్నారు. విద్యార్థి సామర్థ్యం, వయసు ప్రకారం వీరి అర్హత ఆసక్తిని బట్టి తగిన తరగతుల్లో చేర్పించటం, దూర విద్యలో ప్రవేశాలు కల్పించేలా అధికారులు కృషి చేయనున్నారు. విద్యాశాఖ పరిధిలోని సమగ్ర శిక్ష కింద పనిచేసే సీఆర్పీలు క్షేత్రస్థాయిలో ఈ సర్వే చేయనున్నారు. ఈ నెల 18 వరకు ఇంటింటికి తిరుగుతూ సర్వే పూర్తి చేయనున్నారు. ఆవాస ప్రాంతాలు, గృహాలు, పనిప్రదేశాలను సందర్శించి వివరాలు సంబంధిత ఫార్మట్‌లో నమోదు చేస్తారు. అనంతరం గుర్తించిన బడి బయటి పిల్లల వివరాలు ప్రబంద్ పోర్టల్‌లో నమోదు చేస్తారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వారు బడికి వచ్చేలా చర్యలు తీసుకుంటారు. వివిధ కారణాలతో బాల, బాలికలు చదువుకు దూరం కాకుండా వంద శాతం బడిలో చేర్పించాలనే లక్ష్యంతోనే ఈ సర్వే చేపడుతున్నట్టు డీఈవో నాంపల్లి రాజేశ్ తెలిపారు.