పనులు చేసి ఏడాదైనా బిల్లులు రావా?

ABN , First Publish Date - 2023-03-05T00:09:43+05:30 IST

గ్రామాల్లో గత సంవత్సరం మార్చిలో సీసీ రోడ్లు వేసినప్పటికీ ఇప్పటివరకు బిల్లులు అందించడంలో అధికారులు జాప్యం చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని సర్పంచులు దీప్లా నాయక్‌, పద్మారావు ఆవేదన వ్యక్తం చేశారు.

పనులు చేసి ఏడాదైనా బిల్లులు రావా?
వట్‌పల్లి మండల సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ పత్రి కృష్ణవేణి

లంచం ఇస్తేనే భూ సర్వేలు చేస్తారా?

వట్‌పల్లి మండల సర్వసభ్య సమావేశంలో సర్పంచుల ఆవేదన

వట్‌పల్లి, మార్చి 4: గ్రామాల్లో గత సంవత్సరం మార్చిలో సీసీ రోడ్లు వేసినప్పటికీ ఇప్పటివరకు బిల్లులు అందించడంలో అధికారులు జాప్యం చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని సర్పంచులు దీప్లా నాయక్‌, పద్మారావు ఆవేదన వ్యక్తం చేశారు. వట్‌పల్లి రైతువేదికలో శనివారం ఎంపీపీ కృష్ణవేణి అధ్యక్షతన మండల సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. బిజిలిపూర్‌లో రూ.15 లక్షల నిధులతో సీసీ రోడ్లు వేశామని కానీ నిధులు అందించడం లేదని సర్పంచ్‌ పద్మారావు సభ దృష్టికి తీసుకొచ్చారు. భూముల సర్వే కోసం రైతులు దరఖాస్తు చేసుకుంటే సర్వేయర్‌ డిమాండ్‌ చేసినంత లంచం ఇస్తేనే ప్రాధాన్యమిచ్చి ముందు సర్వే చేస్తున్నారని, డబ్బు ఇవ్వని వారికి ఏళ్లు గడిచిన స్పందించడం లేదని వాపోయారు. ్లదీంతో రైతులు గ్రామాల్లో గొడవలు పడాల్సిన దుస్థితి నెలకొన్నదని ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు నర్సింలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వేయర్‌ పనితీరులో మార్పు లేకుంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. గౌతాపూర్‌ల్‌ అంగన్‌వాడీ భవనం శిథిలావస్థలో ఉందని, మరమ్మతులు చేయాలని సర్పంచ్‌ ఖయ్యూం పాషా సీడీపీవో అధికారులకు సూచించారు. ఇతర మండలాలకు ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై పంపించడం వల్ల విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఎంపీటీసీ ఫోరం మండలాధ్యక్షుడు నర్సింహులు నిలదీశారు. సమావేశంలో వైస్‌ ఎంపీపీ నాగరాణి, పీఏసీఎస్‌ చైర్మన్‌ వినోద్‌గౌడ్‌, ఎంపీడీవో జగదీశ్వర్‌, ఎంపీవో యూసుఫ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-03-05T00:09:43+05:30 IST