దేవాదుల.. కాలువ మారిందా?

ABN , First Publish Date - 2023-06-01T00:25:59+05:30 IST

జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా చేర్యాల పట్టణ శివారులోని 8-ఆర్‌ కెనాల్‌ పనుల ప్రారంభానికి అఽధికారులు చర్యలు తీసుకోవడం ఇప్పుడు వివాదాస్పదమవుతున్నది.

దేవాదుల.. కాలువ మారిందా?
తూర్పుగుంటూరుపల్లి శివారులోని దేవాదుల ప్రధాన కాలువ

8-ఆర్‌ అలైన్‌మెంట్‌ మార్పు?

20 ఎకరాలు కోల్పోనున్న 45 మంది రైతులు

రియల్టర్ల మాయాజాలానికి అధికారుల సహకారం!

తాజా భూసేకరణ నోటిఫైతో బయల్పడిన డైవర్ట్‌ బాగోతం

పాత డిజైన్‌ ప్రకారం కొనసాగించాలని రైతుల డిమాండ్‌

న్యాయం చేయకుంటే ఆత్మహత్యే శర ణ్యమంటున్న అన్నదాతలు

చేర్యాల, మే 31: జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా చేర్యాల పట్టణ శివారులోని 8-ఆర్‌ కెనాల్‌ పనుల ప్రారంభానికి అఽధికారులు చర్యలు తీసుకోవడం ఇప్పుడు వివాదాస్పదమవుతున్నది. తూర్పుగుంటూరుపల్లి శివారులోని ఓ వెంచర్‌ భూమిని కాపాడేందుకు దేవాదుల అధికారులు, రియల్లర్లు కుమ్మక్కై అలైన్‌మెంట్‌ మార్చి త మకు అన్యాయం చేస్తున్నారంటూ రైతులు ఆరోపిస్తున్నారు. కొత్తగా భూసేకరణతో తమ మధ్య చిచ్చుపెట్టడం తగదని మండిపడుతున్నారు. పాత డిజైన్‌ ప్రకారమే చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనకు సిద్ధమవుతున్నారు.

చేర్యాల పట్టణ శివారులోని ప్రధాన కాలువకు అనుసంఽధానంగా తూర్పుగుంటూరుపల్లిదారి నుంచి ముస్త్యాల వరకు 8-ఆర్‌ కాలువ నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. ముస్త్యాల శివారులో సర్వే నెం.1147/సి/1/1వరకు తవ్వకం పూర్తిచేశారు. కానీ తూర్పుగుంటూరుపల్లి శివారులోని సర్వేనెం.852, 853, 854, 855, 856, 859, 858, 898, 896, 897, 892లో పనులు చేపట్టాల్సి ఉన్నా అర్ధాంతరంగా ఆగిపోయా యి. 8-ఆర్‌ కాలువకు నీటిని మళ్లించేందుకు ప్రఽధాన కాలువగుండా సర్వే నెం.892కు సమీపంలో డైవర్టింగ్‌ పాయింట్‌ ఏర్పాటు చేశారు. ఇదే సర్వేనంబరులోని వెంచర్‌ మధ్యలో నుంచి కాలువ తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రియల్టర్లు గతంలో జిల్లాకు చెందిన ఓ రిటైర్డ్‌ అధికారి నిర్వాకంతో పక్క నుంచి మళ్లించేందుకు తీసుకున్న చర్యలు ప్రస్తుతం అమలుకు నోచుకోనుండటంతో రైతుల్లో కలవరపాటు మొదలైంది..

‘మలుపు’ తిప్పిన భూసేకరణ నోటి ఫై

నిలిచిపోయిన 8-ఆర్‌ కాలువ పనుల ప్రారంభించేందుకు సర్వే నెం. 891, 885, 883, 892, 882, 881, 880, 860, 859, 856, 855, 1006, 1007, 1013, 1012, 1015, 1014లలో 19.32ఎకరాల భూసేకరణకు నోటిఫై చేశారు. కొద్దిరోజుల క్రితం రైతుల అభిప్రాయ సేకరణకు తహసీల్దార్‌ ఆరీఫాబేగం సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో కాలువ డైవర్ట్‌ కథను రైతులు పసిగట్టి అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఏర్పాటు చేసిన హద్దుల ప్రకారం తమ భూములు పోలేవని, ప్రస్తుత మార్పుతో తమ పట్టాభూములు కోల్పోయే పరిస్థితి నెలకొన్నదని వాపోయారు. తమ భూములు ఇవ్వబోమని, బలవంతంగా లాక్కుంటే ఆత్మహత్యలే శరణ్యమని తేల్చి చెప్పారు. దీంతో ఎలాంటి ‘మలుపులు’ చోటుచేసుకుంటాయోనని ఎదురుచూస్తున్నారు.

సమన్వయలోపం..

దేవాదుల కార్యాలయం వరంగల్‌లో ఉండటం, పదిహేనేళ్ల కాలంలో ఎంతోమంది అధికారులు, సిబ్బంది మారడం, కాలువ పనులు నిలిచి యేళ్లు గడవడంతో భూసేకరణ, పరిహారం, ఇతరత్రా విషయాల్లో అయోమయం నెలకొన్నది. రెవెన్యూ, నీటిపారుదలశాఖాధికారుల మధ్య సమన్వయలోపం వలన కాలువ వివరాలు ఎవరిని అడిగినా ఒకరిపై మరొకరు తప్పును ఎత్తి చూపుతూ చేతులు దులుపుకుంటున్నారు.

ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి వినతి

గతంలో చేసిన డి జైన్‌ వలన సుమారు 20మంది కొంతమేర భూమిని కోల్పోయేవారని, ప్రస్తుతం అలైన్‌మెంట్‌ మార్పుతో 45మంది 20 ఎకరాలు కోల్పోవాల్సి వస్తుందని, ప్రభుత్వంపై అదనపు భారం పడనున్నందున అక్రమ పనులు నిలిపివేయాలని పలువురు రైతులు ఇటీవల ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి వినతిపత్రం అందించారు. స్పందించిన ఎమ్మెల్యే కలెక్టర్‌, ఆర్డీవోతో పాటు దేవాదుల అధికారులకు సిఫారసు చేశారు. ఈనేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.

అవసరాలకు అమ్ముకోలేని దైన్యం

పట్టణంలో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. చేర్యాలలోని ఏ శివారుకైనా ఎకరం రూ.35-50 లక్షలు ధర పలుకుతుంది. 8-ఆర్‌ కాలువ వివాదం వల్ల కొనుగోలు చేయడానికి నిరాసక్తత కనబరుస్తుండడంతో పలువురు రైతులు అత్యవసరాల కోసం భూములు అమ్ముకోలేని పరిస్థితుల నడుమ ఇబ్బందులు పడుతున్నారు. పదేళ్ల క్రితమే ఏర్పాటు చేసిన డైవర్టింగ్‌ పాయింట్‌తో పాటు కాలువ తవ్వకానికి సంబంధించి శాటిలైట్‌ చిత్రాలు అధికారుల తప్పిద నిర్ణయానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

గతంలో మా భూమి లేదు

- బీర్ల సిద్దయ్య, రైతు

కాలువ కోసం పదేళ్లక్రితం ఏర్పాటుచేసిన హద్దులలో మా భూమి ప్రతిపాదన లేదు. పంటల కోసం 20 బోర్లు వేశాను. కేవలం రెండు మంచిగా పడ్డాయి. ఇప్పుడు కాలువ మార్చితే 2 ఎకరాల భూమితో పాటు బోర్లు కూడా పోతాయి. సావనైనా సస్తా గానీ భూమిని ఇవ్వను.

అలైన్‌మెంట్‌ మార్పును విరమించుకోవాలి

- దాసరి అనిల్‌కుమార్‌, రైతు

గత భూసేకరణ జాబితాలో మాభూమి లేదు. నాకు 27 గుంటల భూమి ఉంది. ప్రస్తుతం కాలువను మార్చడం వలన 15 గుంటలు కోల్పోవాల్సి వస్తుంది. కేవలం ఒక్క వెంచర్‌ కారణంగా డైవర్ట్‌ చేస్తుండటంతో ఎక్కువమంది రైతుల నుంచి ఎక్కువ భూమిని సేకరించి నష్టం చేకూరేలా కొందరు వ్యవహ రిస్తున్నారు. ప్రభుత్వంపైనా అదనపు భారం పడుతుంది. కాలువ డైవర్ట్‌ను రద్దు చే సేంత వరకు ఊరుకోం.

అన్నీ పరిశీలించాకే స్పష్టత ఇస్తాం

- రుద్ర, నీటిపారుదలశాఖ డీఈ

రైతుల వినతి మేరకు 8-ఆర్‌ కాలువను పరిశీలించాం. నీటి మళ్లింపు కోసమే సర్వే నెం.892లో ఓటీ కట్టారు. కానీ కాలువ భూసేకరణ, పరిహారం పంపిణీకి సంబంధించిన రికార్డులు పరిశీలించి టెక్నికల్‌ అధికారులతో మాట్లాడిన తరువాతే అలైన్‌మెంట్‌ పట్ల స్పష్టత ఇస్తాం.

Updated Date - 2023-06-01T00:25:59+05:30 IST